A place where you need to follow for what happening in world cup

పట్టా భూముల్లో ఇసుక సేద్యం..

  • రెండు మీటర్ల ఇసుకలో పంటలు పండిస్తారట
  • వ్యవసాయ శాస్త్ర వేత్తలు విస్తుపోయే వింత
  • రైతుల పేరుతో మాఫియా దందా
  • నామ మాత్రపు చెల్లింపులు.. ముందుగానే చెక్కులు
  • జీవో నంబర్ 3 కి వక్రభాష్యం
  • అక్రమార్కులకు అధికారుల అండ
  • టీఎస్ఎండీసీ ప్రేక్షక పాత్ర
  • రికార్డులు మారుస్తున్న రెవిన్యూ అధికారులు
  • దళారులు కోరినంత ఇసుక క్వాంటిటీ
  • సిఫారసు చేస్తున్న భూగర్భ జల శాఖ
  • ములుగు భద్రాద్రి జిల్లాల్లో వింత పోకడలు

తివిరి యిసుకన తైలంబు దీయవచ్చు
దవిలి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చు
తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు
చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు.

భతృహరి సుభాషితాల్లో పై పద్యం ఒకటి. ప్రయత్నముతో ఇసుకలో చమురు తీయవచ్చని ఆయన చెప్పిన మాటలను ఇసుక మాఫియా తమకు అనుకూలంగా అన్వయించుకున్నట్టు కనిపిస్తున్నది. ఇసుకలో కాసులను పండించే పనిలో పడింది. దీని కోసం వారు ఎంచుకున్న మార్గాల్లో పట్టా భూముల్లో ఇసుక తవ్వకాల అంశం కూడా ఒకటి. భారీ వర్షాలతో నదులకు వచ్చే వరదలతో తీర ప్రాంతంలోని భూములు కోతకు గురికావడం, కాల గమనంలో ఆ భూములు నదిలో అంతర్భాగం కావడం సహజంగా జరిగేదే. గోదావరి వంటి భారీ నదితో పాటు దాని ఉప నదుల పరీవాహక ప్రాంతంలో అడవులు అంతరించడంతో భూసారం కొట్టుకు వచ్చి ఇసుకగా రూపాంతరం చెందుతున్నది. ఆకస్మికంగా వస్తున్న వరదలతో తీర ప్రాంతాల కోత మరింత పెరిగి నదుల లోతు తగ్గి వెడల్పు పెరుగుతున్నది. గత అర్థ శతాబ్థపు కాలంలో ఇది పర్యావరణ విపత్తుగా మారి పోయి ఆందోళన కలిగిస్తున్నది. ఇటువంటి విపత్తులతో నష్టపోయే బడుగు జీవులు కొందరైతే దీనినే తమకు ఆదాయ మార్గంగా ఎంచుకునే ఘనులు మరికొందరు. తర తరాలుగా సేద్యం చేసుకుంటున్న పంట భూములు నదుల పాలై కొందరు అలమటిస్తుంటే అక్కడే కాసులు ఏరుకునే పనిలో మరికొందరు నిమగ్నమయ్యారు. నదుల్లో మునిగి పోయిన పట్టా భూముల్లో ఇసుక మేటలు తొలగించడం ద్వారా ఆ భూముల్లో తిరిగి వ్యవసాయం చేసుకునే వెసులు బాటును ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రభుత్వం కల్పించింది. ఇటువంటి విధానం ఇతర రాష్ట్రాల్లో కూడా ఉంది.

పరమార్థం కన్నా స్వార్థమే ఎక్కువ…

నదుల్లో మునిగిన భూముల్లో నిజంగా ఇసుక మేటలు తొలగించి ఆ భూమిలో తిరిగి వ్యవసాయం చేస్తే అది అద్భుతమే. దీని కోసం రైతే తన భూమిలో మేటలు తొలగించుకుని ఇసుక లేదా మట్టిని అమ్ముకునే అధికారం ఉన్నది. కేవలం ప్రభుత్వానికి సీనరేజి చెల్లిస్తే సరిపోతుంది. రాష్ట్ర హై కోర్టు కూడా పలు మార్లు ఇదే అంశాన్ని తీర్పుల ద్వారా స్పష్టం చేసింది. కానీ తెలంగాణ సహా కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వమే రంగ ప్రవేశం చేసింది. వాణిజ్య కోణంలో ఆలోచించి పట్టా భూములను కూడా ప్రభుత్వ ఆదాయ వనరుగా మార్చుకున్నది. ఇసుక మేటలు తొలగించుకోవడం రైతులకు చేత కాదన్నట్టు తెలంగాణ ఖనిజాభివృద్థి సంస్థకు ఈ పనిని అప్పగించింది. పట్టా భూముల్లో ఇసుక మేటలు తొలగించుకోవడానికి పర్యావరణ అనుమతులు అవసరం లేదని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ స్పష్టం చేయడంతో ప్రభుత్వానికి తక్కువ సమయంలో ఆదాయం వస్తుందని పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇవ్వాలని జిల్లా కలెక్టర్లపై ఒత్తిడి తెస్తున్నది.

 

జీవో నంబర్ 3 కి వక్ర భాష్యం…

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఇసుక విధానాన్ని ప్రకటించింది. ఈ మేరకు పరిశ్రమలు వాణిజ్య శాఖ (గనులు) జీవో నంబర్ 38 జారీ చేసింది. పట్టా భూముల్లో ఇసుక మేటలు తొలగించే అంశాన్ని కూడా ఈ జీవోలో చేర్చారు. జీవో నంబర్ 3 ద్వారా ఇసుక తవ్వకాల కోసం మార్గదర్శక సూత్రాలను కూడా జారీ చేశారు. ఈ జీవో ప్రకారం ఇసుక మేటలను తొలగించుకోవడానికి రైతులు ముందుగా తహసిల్దార్ కు దరఖాస్తు పెట్టుకోవాలి. పట్టాదారు పాస్ పుస్తకాలను కూడా దీనితో జత చేయాలి. రికార్డులను పరిశీలించిన తర్వాత సమగ్ర సర్వే చేయించి అట్టి భూములను నిర్ధారించాలి. నిబంధనల ప్రకారం అన్నీ సక్రమంగా ఉంటే రైతుల దరఖాస్తులను గనుల శాఖ సహాయ సంచాలకుడికి పంపించాలి. తహసిల్దారు నుంచి వచ్చిన దరఖాస్తుల ప్రకారం గనుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్, తహసిల్దార్, భూగర్భజల శాఖ డిప్యూటీ డైరెక్టర్, మండల వ్యవసాయ అధికారి కలిసి పరిశీలించాలి.

పట్టా భూముల్లో తీసే ఇసుక నిర్మాణ రంగానికి పనికి వస్తుందో లేదో గనుల శాఖ అధికారి నిర్ధారించాలి. నిజానికి ఇది ప్రభుత్వానికి సంబంధం లేని విషయం. అక్కడ ఎటువంటి ఇసుక వచ్చినా కంకర వచ్చినా దానిని తీసుకునే అధికారం రైతుకు ఉన్నది. జాయింట్ సర్వేలో భూగర్భ జల శాఖ అధికారి సిఫారసు కీలకం కావడంతో మొత్తం వ్యవహారం ఆ అధికారి చుట్టూ తిరుగుతున్నది. ఇసుక మేటలు ఎన్ని మీటర్ల మందంలో ఉన్నాయో నిర్ధారించి దానిలో ఎంత మేరకు తీయాలో ఆ అధికారి నిర్ధారించాలి. ఇక్కడే అవినీతికి భీజం పడుతున్నది. ఇసుక మేటల మందం మూడు మీటర్లు లేకున్నా అంతకంటే ఎక్కువే ఉందని రాయడం, దీనిలో ఒక మీటర్ నుంచి మూడు మీటర్ల వరకూ ఇసుక తీయవచ్చని భూగర్భ జల శాఖ అధికారులు సిఫారసు చేయడం సంచలనం కలిగిస్తున్నది. ఎకరానికి 20 వేల క్యూబిక్ మీటర్ల వరకూ ఇసుక తీసుకునే విధంగా సిఫారసు చేయడం ద్వారా ఆ శాఖ అధికారులు భారీగా ముడుపులు పుచ్చుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇసుక క్వాంటిటీ సిఫారసు చేసే సందర్భంలో సమీప ప్రాంతంలో వ్యవసాయ భూములు ఉన్నాయనే విషయాన్ని కూడా వారు విస్మరిస్తున్నారు. భూగర్భ జలాలపై పడే ప్రభావాన్ని కూడా అంచనా వేయడం లేదని రైతులు విమర్శిస్తున్నారు.

రెండు మీటర్ల ఇసుకలో వ్యవసాయం

పట్టా భూముల్లో ఇసుక తవ్వకాల అనుమతులకు సంబంధించి జీవో 3 ప్రకారం మండల వ్యవసాయ అధికారి ధృవీకరణ పత్రం కీలకం కానున్నది. ఇసుక మేటలు తొలగించిన భూమిలో తిరిగి వ్యవసాయం చేసుకోవచ్చని ఆ అధికారి నిర్ధారించాల్సి ఉంటుంది. మూడు మీటర్ల ఇసుక మేటలు ఉంటే అందులో ఒక మీటర్ ఇసుక తీయవచ్చని భూగర్భ జల శాఖ అధికారి సిఫారసు చేస్తున్నారు. మిగిలిన రెండు మీటర్ల ఇసుకలో వ్యవసాయం చేసుకోవచ్చని వ్యవసాయ అధికారి ధృవీకరించాలి. ఇది సాధ్యమేనా అనేది అందరికీ ఎదురయ్యే సందేహం. దీనికి తోడు ప్రతి సంవత్సరం వస్తున్న వరదలతో మళ్ళీ ఇసుక మేటలు వేస్తూనే ఉన్నాయి. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఇప్పటి వరకూ ఒక్క వ్యవసాయాధికారి కూడా ఫైల్ ను తిరస్కరించలేదు. అలాగని లక్ష్యం కూడా నెరవేరలేదు. రెండు జిల్లాల పరిధిలో గత ఏడేండ్ల కాలంలో దాదాపు వెయ్యి ఎకరాల్లో ఇసుక మేటలు తొలగిస్తే ఒక్క ఎకరంలో కూడా రైతులు వ్యవసాయం చేయలేదు. ఇసుక మేటలు తీసినా ఈ భూములు వ్యవసాయానికి పనికి రావనేది నగ్న సత్యం. అటువంటప్పుడు జీవో 3 లక్ష్యం నెరవేర లేదనేది నిర్వివాదాంశం. కేవలం వాణిజ్య అవసరాలకు, ప్రభుత్వానికి ఆదాయం సంపాదించి పెట్టడానికి మాత్రమే పట్టా భూముల అనుమతులు ఉపయోగ పడుతున్నాయని స్పష్టమవుతోంది.

అంతా తామై నడిపిస్తున్నమాఫియా..

పట్టా భూముల్లో అనుమతుల కోసం రైతులు తిరుగుతున్న దాఖలాలు లేవు. ఇసుక మాఫియా డాన్ లే ఈ వ్యవహారం నడిపిస్తున్నారు. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో గోదావరి తీర ప్రాంతంలో ఏ మండలంఆలో చూసినా ఇసుక దళారులే చక్రం తిప్పుతున్నారు. ముంపునకు గురైన భూముల గురించి ఆరా తీయడం, సంబంధిత రైతులను కలిసి ఇసుక అనుమతుల కోసం తామ పైరవీ చేస్తామని ప్రలోభ పెట్టడం జరుగుతున్నది. తహసిల్దార్లను కలవడం, రైతుల పేరుతో దరఖాస్తులు ఇప్పించడం, భారీగా ముడుపులు చెల్లించి సర్వే చేయించుకోవడం పరిపాటిగా మారింది. కొన్ని సందర్భాల్లో నకిలీ రికార్డులు సృష్టించి కూడా ఇసుక అనుమతులు తీసుకున్నట్టు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. ములుగు జిల్లా జంపన్న వాగుపై నకిలీ పట్టాలు సృష్టించినట్టు ఆరోపణలు వచ్చాయి.రికార్డుల్లో చూపిన సర్వే నంబర్లు ధరణి పోర్టల్ లో ప్రభుత్వ భూములుగా చూపిస్తున్నది. వాజేడు మండలం ధర్మారంలో 18 ఎకరాల్లో ఇసుక అనుమతులు పొందగా కేవలం 3.9 ఎకరాలు మాత్రమే నిజమైన పట్టాలు కాగా మిగిలిన భూమికి రికార్డులు తారుమారు చేశారని ఆదివాసీ నాయకులు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. మంగపేట మండలం లోని రాజుపేట గ్రామంలో పేదలకు గతంలో పంచిన అసైన్ మెంట్ భూమిని ఇతరులకు పట్టాలు చేశారని, వారి పేరుతో ఇసుక అనుమతులు తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోని మణుగూరు, పినపాక, చర్ల, బూర్గంపాడు మండలాల్లో అసైన్ మెంట్ భూముల్లోనూ, నకిలీ రికార్డులు సృష్టించిన భూముల్లోనూ ఇసుక తవ్వకాలు జరపడం ద్వారా దళారులు భారీగా లబ్ది పొందినట్టు ఆరోపణలు వచ్చాయి. బూర్గంపాడు మండలంలో కిన్నెరసాని వాగుపై దళితుల భూముల్లో ఇసుక తవ్వకాలకు అనుమతులు పొందిన ఇసుక మాఫియా ప్రభుత్వం నిర్ణయించిన ధర కన్నా మూడు రెట్లు వసూలు చేసి కోట్లాది రూపాయలు గడించారు. దళితులకు దక్కింది నామమాత్రమే.

అడుగడుగునా మొండి చెయ్యి..

పట్టా భూముల వ్యవహారంలో దళారుల ఆగడాలకు అంతు లేకుండా పోతున్నది. రైతుల వద్ద ముందుగానే వంద రూపాయల స్టాంప్ లపై ఒప్పందాలు చేసుకోవడం, ఖాళీ బ్యాంకు చెక్కులు తీసుకోవడం జరుగుతున్నది. ఎకరానికి కేవలం నాలుగైదు వేల రూపాయలను రైతులకు చెల్లించి లక్షలాది రూపాయల లాభాల్ని దళారులే తీసుకుంటున్నారు. అధికారులకు భారీగా లంచాలు ఇచ్చామని, నష్టం వచ్చిందని మాయ మాటలు చెప్పి రైతులను మోసగిస్తున్నారు. అనుమతులు ఇచ్చిన ప్రదేశంలో కాకుండా ఎక్కడ ఇసుక ఉంటే అక్కడ తవ్వి పడేస్తున్నారు. లారీలు ఓవర్ లోడింగ్ చేయడం, జీరో వ్యాపారం చేయడం సర్వ సాధారణమై పోయింది. పట్టా భూముల పూడిక ప్రదేశాల్లో రైతులు ఎవరూ కనిపించరు. రైతులతో తెలంగాణ ఖనిజాభివృద్థి సంస్థ చేసుకునే ఒప్పందాల్లో రైతులే చేసుకోవాలని ఉంటుంది. థర్ఢ్ పార్టీ అగ్రిమెంట్ లు చెల్లవనే నిబంధన ఉంటుంది. ఇవన్నీ కాగితాలకే పరిమితం. టీఎస్ఎండీసీ అధికారులే దళారులతో చెట్ట పట్టాలు వేసుకుని తిరుగుతూ ఇసుక ర్యాంపులన్నీ వారికి అప్పగించడం విశేషం. పూడిక పేరుతో రైతుల భూముల్లో తీసిన ఇసుకను రాష్ట్ర ఖనిజాభివృద్థి సంస్థ క్యూబిక్ మీటర్ కు రూ 600లకి వినియోగదారులకు ఆన్ లైన్ లో విక్రయిస్తూ కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నది. రైతుకు మాత్రం ఎకరానికి కేవలం రూ. 100 మాత్రమే చెల్లిస్తున్నది. ఈ మొత్తంలో రైతులకు పది రూపాయలు కూడా దక్కడం లేదు. రైతుల వద్ద నుంచి వర్క్ కాంట్రాక్ట్ కుదుర్చుకుంటున్న కాంట్రాక్టర్లు నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన 18 శాతం జీఎస్టీని కూడా చెల్లించడం లేదు.

జిల్లా కలెక్టర్ల పాత్ర కీలకం..

పట్టా భూముల్లో ఇసుక అనుమతులను జిల్లా కక్షలెక్టర్ల అధ్యక్షతన ఏర్పడిన జిల్లా ఇసుక కమిటీలు ఇవ్వాల్సి ఉంటుంది. పట్టా భూముల వ్యవహారంలో అనేక అవకతవకలు జరుగుతున్నాయని తెలిసినా కలెక్టర్లు పూర్తిగా పరిశీలించకుండా కింది స్థాయి అధికారుల సిఫారసుల మేరకు అనుమతులు ఇస్తున్నారనే విమర్శలు పెల్లుబుకుతున్నాయి. పట్టా భూముల్లో ఇసుక తీసిన తర్వాత అవి సాగులోకి రావని తెలిసినా అనుమతులు ఇవ్వడాన్ని పలువురు తప్పు పడుతున్నారు. అనుమతులు ఇచ్చిన తర్వాత అవి ఎవరు నడుపుతున్నారో పట్టించు కోక పోవడం, క్షేత్ర స్థాయిలో పరిశీలించక పోవడం కూడా విశేషం. భద్రాద్రి కొత్తగూడెంలో పదవీ విరమణ చేసిన ఒక కలెక్టర్ పదవీ విరమణకు కొద్ది రోజుల ముందు భారీగా ఇసుక ఫైళ్ళకు అనుమతులు ఇవ్వడంపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి.

కొండూరి రమేష్ బాబు

Leave A Reply

Your email address will not be published.