A place where you need to follow for what happening in world cup

ఇసుక మాఫియా వెనుక దొరలెవరు? దొంగలెవరు?

  • నాడు ‘గులాబీ’ – నేడు హస్తం
  • జెండా మార్చిన మాఫియా డాన్ లు
  • సీఐడీ దర్యాప్తు నామమాత్రమేనా?

ఇసుక సహా రాష్ట్రంలోని మైనింగ్ అక్రమాలపై సీఐడీ దర్యాప్తునకు ఆదేశిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఇటీవల ప్రకటించడం రాజీకీయ ప్రకంపనలు రేపింది.తెలంగాణ ఏర్పడిన కాలం నుంచీ ఈనాటి వరకూ జరుగుతున్న అక్రమాలపై దర్యాప్తు జరుగుతుందని ఆయన వివరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గులాబీ నేతలే గ్రానైట్, ఇసుక, మెటల్, మొరం కాంట్రాక్టర్లుగా మారి భారీగా అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.

వీటిపై దర్యాప్తు జరిపించడం ద్వారా ప్రతిపక్షాన్ని ఇరుకున పెట్టవచ్చని సీఎం అభిప్రాయపడినట్లు స్పష్టమవుతోంది. కానీ ఇదే పరంపరను ప్రస్తుత కాంగ్రెస్ పాలకులు కూడా కొనసాగిస్తున్న విషయం రేవంత్ దృష్టికి రాలేదా అనే ప్రశ్న ఉదయిస్తున్నది.ఇసుక మాఫియా ఆగడాలతో గత ప్రభుత్వం అప్రదిష్ఠ పాలయింది. సిరిసిల్ల జిల్లా నేరెళ్ళ దళితులపై జరిగిన దమనకాండ జాతీయ స్థాయిలో అందరి దృష్టినీ ఆకర్షించింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేండ్లు గడిచినా గతంలో జరిగిన ఇసుక అక్రమాలపై దర్యాప్తు జరగలేదు. నాటి నేరెళ్ళ సంఘటనకు బాధ్యులైన వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు.

రంగు మార్చిన మాఫియా డాన్ లు..
బీఆర్ఎస్ హయాంలో ఇసుక దందా చేసిన మాఫియా డాన్ లు నేడు కాంగ్రెస్ నేతల పంచన చేరారు. హస్తం పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలకు బినామీలుగా మారి తమ అక్రమాలను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. గోదావరి నది వీరి అక్రమాలకు అడ్డాగా మారిపోయింది. రాష్ట్రంలోని భూపాలపల్లి, ములుగు, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఇసుక తవ్వకాలు, రవాణాలో అక్రమాలు పెరిగిపోయాయి. రాష్ట్రంలో కీలక శాఖలు నిర్వహిస్తున్న ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్ జిల్లాలకు చెందిన ఇద్దరు మంత్రులతో పాటూ పలువురు ఎమ్మెల్యేలు ఇసుక ద్వారా వచ్చే ఆదాయంలో పరోక్ష భాగస్వాములుగా ఉన్నారు. వీరి వ్యవహారంపై గత సంవత్సరమే ముఖ్యమంత్రికి నివేదికలు అందినప్పటికీ వారిపై ఎటువంటి చర్యలు తీసుకునే పరిస్థితి లేదు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం, పినపాక ఎమ్మెల్యేల ఓటమికి ఇసుక అక్రమాలు కూడా ప్రధాన కారణమని చెప్పవచ్చు. కానీ ప్రస్తుత ఎమ్మెల్యేలు కూడా ఇదే మకిలిని అంటించుకుని ప్రజా వ్యతిరేకత కూడగట్టుకుంటున్నారు. అధికార పార్టీ నేతలు ఇసుక మాఫియాకు కొమ్ముకాస్తున్న విషయం తెలిసి కూడా ఈ వ్యవహారంపై దర్యాప్తునకు ఆదేశించడం చూస్తే ఇది కేవలం ప్రకటనకే పరిమితమవుతుందని అందరూ భావిస్తున్నారు. ఒక రకంగా ఇది ప్రతిపక్షానికి మేలు చేసినట్లే నని కూడా రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. అక్రమాల్లో రెండు పార్టీల నేతల పాత్ర ఉన్నప్పుడు దర్యాప్తు ముందుకు సాగదని అధికారులు కూడా భావిస్తున్నారు. సీఐడీ దర్యాప్తుపై ఇప్పటి వరకూ విధివిధానాలు కూడా ఖరారు కాలేదు. మైనింగ్ అక్రమాలపై దర్యాప్తు కేవలం గ్రానైట్, మెటల్ మైనింగ్ కే పరిమితి చేస్తారా అనే చర్చ కూడా జరుగుతోంది.

అధికారులకు అందలం..
బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఇసుక మాఫియాకు కొమ్ము కాసిన కొందరు అధికారులకు ప్రస్తుత ప్రభుత్వంలో కీలక బాధ్యతలు అప్పగించడం చూస్తే దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్లుగా ఉందని అటు రాజకీయ వర్గాలతో పాటు అధికార వర్గాలు కూడా అంటున్నాయి. బీఆర్ఎస్ నేతలతో అంటకాగి అనేక అక్రమాలకు పాల్పడిన ఒక అధికారికి మైనింగ్ కి సంబంధించిన కీలక బాధ్యతలను అప్పగించడం కూడా చర్చనీయాంశంగా మారింది.

CID Enquiry on sand mafia

ప్రస్తుత ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారుల పాత్రపై కూడా నిష్పాక్షిక దర్యాప్తు జరిగే అవకాశం లేదని అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు అంటున్నారు. ఇసుక తవ్వకాల కోసం ఇష్టారీతిన అనుమతులను ఇచ్చిన కొందరు కలెక్టర్ల పాత్రపై కూడా దర్యాప్తు జరగాల్సి ఉంది. సీఐడీ దర్యాప్తు ఒక రాజకీయ ప్రహసనంగా మారకుండా ఉండాలంటే మొత్తం వ్యవహారంపై నిష్పాక్షిక దర్యాప్తు జరగాలంటే గతంలో పనిచేసిన అధికారులను మైనింగ్ విధుల నుంచి తప్పించాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.