A place where you need to follow for what happening in world cup

ఆరంభ శూరత్వం..

  • ఇసుక మాఫియాపై చర్యలు మూడ్నాళ్ళ ముచ్చటేనా?
  • అక్రమాలకు ద్వారాలు తెరిచిన బినామీలు
  • యధేచ్చగా టిప్పర్ల వినియోగం
  • రాత్రి పగలూ డంపింగ్
  • 20 టన్నులు ఓవర్ లోడింగ్
  • ఆదివాసీ సంఘాలు పట్టుకున్నా చర్యలు శూన్యం
  • సీసీ కెమేరాలను పట్టించుకోని అధికారులు
  • జాడ లేని టాస్క్ ఫోర్స్

ఇసుకాసురుల ఆగడాలపై ములుగు జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలు ఆరంభ శూరత్వంగానే మిగిలిపోయాయి. అధికారుల హడావుడి మూడ్నాళ్ళ ముచ్చటగా ముగియడంతో బినామీ కాంట్రాక్టర్లు మళ్ళీ చెలరేగిపోతున్నారు. యధేచ్చగా అక్రమాలకు ద్వారాలు తెరిచారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలను పూర్తిగా బేఖాతర్ చేస్తూ టీఎస్ఎండీసీ అధికారులు కాంట్రాక్టర్లకు పూర్తిగా సహకరిస్తున్నారు. వివిధ శాఖలకు చెందిన కింది స్థాయి అధికారులు కూడా కాంట్రాక్టర్ల అడుగులకు మడుగులొత్తుతున్నారు. పైగా కలెక్టర్ కొంత కాలం శెలవులో ఉండటంతో వారి ఆగడాలకు అంతులేకుండా పోయింది. కలెక్టర్ ను బదిలీ చేస్తున్నారంటూ అధికార పార్టీ నేతలు ప్రచారం చేయడంతో అవినీతి అధికారులతో పాటు కాంట్రాక్టర్లు కూడా వారికి వంత పాడుతున్నారు.

నిబంధనల ప్రకారం ఇసుక రీచ్ లను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కృష్ణ్న ఆదిత్య మార్చిలో ఆదేశాలు జారీ చేశారు. దీనితో అధికార యంత్రాంగం పరుగులు పెట్టింది. అదనపు కలెక్టర్ స్థాయి నుంచి వీఆర్వో స్థాయి వరకూ అందరినీ బాధ్యులను చేస్తూ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. అక్రమాలు జరిగితే తహసిల్దార్లు బాధ్యత వహించాలని కూడా కలెక్టర్ ఆదేశించారు. నిబంధనల ప్రకారం రీచ్ లను నిర్వహిస్తామని ఆదివాసీ సహకార సంఘాల వద్ద హామీ పత్రాలను కూడా రాయించుకున్నారు. రీచ్ ల వద్ద సీసీ కెమేరాలను ఏర్పాటు చేశారు. గోదావరి బ్రిడ్జి వద్ద, చిన్నబోయినపల్లి వద్ద లారీలను తనిఖీ చేసి ఓవర్ లోడింగ్ పై కొరఢా ఝుళిపించారు. కలెక్టర్ చర్యలతో పది రోజుల పాటు కాంట్రాక్టర్లు ఆన్ లైన్ కూడా పెట్టలేదు. ఈ హడావుడి చూసిన ఏజెన్సీ వాసులు కలెక్టర్ పై ప్రశంసల వర్షం కురిపించారు. కానీ ఇదంతా తాత్కాలికమేనని తేలిపోయింది. అధికార పార్టీ నుంచి, మంత్రుల వద్ద నుంచి ఒత్తిడి వచ్చినందువల్లే కలెక్టర్ మళ్ళీ వెనక్కి తగ్గారని ఒక వర్గం ప్రచారం చేస్తుంటే టీఎస్ఎండీసీ పెద్దలు రంగంలోకి దిగి కలెక్టర్ కు ఫోన్ లు చేశారని మరో వర్గం ప్రచారం చేసింది.

థర్డ్ పార్టీ బినామీ కాంట్రాక్టులు చెల్లవని టీఎస్ఎండీసీ ఆదివాసీ సహకార సంఘాలతో చేసుకున్న ఎస్ 4 ఒప్పందాల్లో స్పష్టంగా పేర్కొంటున్నప్పటికీ బినామీల వ్యవస్థను అదే సంస్థ బహిరంగంగనే పెంచి పోషిస్తున్నది. రీచ్ ల వద్ద సహకార సంఘాలు డమ్మీలుగా మారగా కాంట్రాక్టర్లదే హవా నడుస్తోంది. టీఎస్ఎండీసీ ఉద్యోగులు కూడా ఓవర్ లోడింగ్ బకెట్ల డబ్బుకు, కాంట్రాక్టర్లు ఇచ్చే ముడుపులకు లొంగి పోయి వ్యవహారాలన్నీ వారికి అప్పగిస్తున్నారు. బినామీ కాంట్రాక్టు ఒప్పందాలపై జిల్లా కలెక్టర్ ఏనాడూ విచారణ జరిపించలేదు. ఏజెన్సీ ప్రాంతంలో ఇసుక రీచ్ ల నిర్వహణకు విధివిధానాలను రూపొందించే అధికారం కూడా జిల్లా కలెక్టర్ అధ్యక్షతన పనిచేస్తున్న జిల్లా ఇసుక కమిటీలకు ఉన్నది.

ఈ దిశగా కలెక్టర్ ఇప్పటి వరకూ ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. బినామీ కాంట్రాక్టర్లకు చెల్లించే బిల్లులను ఆపే అధికారం కూడా కలెక్టర్ ఉంది. కానీ కలెక్టర్ మెతక వైఖరిని గమనించిన బినామీ కాంట్రాక్టర్లు గత నెల రోజులుగా చెలరేగిపోతున్నారు. వందల సంఖ్యలో టిప్పర్లను తీసుకువచ్చి పగలు, రాత్రి తేడా లేకుండా డంపింగ్ చేస్తున్నారు. మార్చిలో ఒక బకెట్ కూధడా వేయడానికి భయపడిన కాంట్రాక్టర్లు ఇప్పడు మూడు నాలుగు బకెట్లు ఓవర్ లోడింగ్ చేసి ప్రతి లారీకి అదనంగా ఐదు నుంచి పది వేల వరకూ వసూలు చేస్తున్నారు. తహసిల్దార్లు, టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఇప్పుడు కాంట్రాక్టర్లకు జీ హుజూర్ అంటున్నారు.

సీసీ కెమేరాలను పట్టించుకున్న నాధుడే లేడు. లోడింగ్ చార్జీల పేరుతో ప్రతి లారీకి రూ. 800 నుంచి రూ. 1,000 అదనంగా వసూలు చేస్తున్నారు. వాజేడు మండలంలోని ఇసుక రీచ్ లు దగ్గరగా ఉండడంతో బొమ్మనపల్లి, ధర్మారం, అయ్యవారిపేట ఇసుక రీచ్ లకు లారీలు ఎక్కువగా వస్తున్నాయి. ఈ రీచ్ లకే టీఎస్ఎండీసీ అధికారులు అధిక క్వాంటిటీలు పెట్టడంతో దూరంలో ఉన్న వెంకటాపురం మండలంలోని రీచ్ లకు లారీలు రావడం లేదు. వాజేడు మండల కాంట్రాక్టర్లపై టీఎస్ఎండీసీ అధికారులు అవ్యాజమైన ప్రేమ చూపించడం వెనుక ఏటూరునాగారం లోని ఆ సంస్థ ఏపీఓ హస్తం ఉన్నట్టు ఆరోపణలు వినవస్తున్నాయి. ఓవర్ లోడింగ్, టిప్పర్లతో రవాణా వంటి విషయాల్లో టీఎస్ఎండీసీ అధికారులకు ఎన్ని ఫిర్యాదులందినా అధికారులు పట్టించు కోరు. ఆదివాసీ సంఘాలు ఇటీవల లారీలను నిలిపి వేసి తూకం వేయించడంతో 20 టన్నులు అదనపు లోడ్ వేసినట్టు నిరూపణ అయింది. ఈ విషయాన్ని సంబంధిత పీవో దృష్టికి తీసుకు వెళ్ళినా ఆయన చర్యలు తీసుకోలేదు. పైగా కాంట్రాక్టర్లనే సమర్ధించడంతో ఆదివాసీలు విస్మయం చెందారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు టీఎస్ఎండీసీ పీఓ గా ఉన్న అధికారికే ములుగు జిల్లా అదనపు బాధ్యతలు అప్పగించారు. రెండు జిల్లాల కాంట్రాక్టర్లకు ఈయన ఎంతో ప్రీతి పాత్రుడు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సమాంతర ప్రభుత్వం..
ఇసుక కాంట్రాక్టర్ల వ్యవహారంలో ములుగు జిల్లా కలెక్టర్ కనీసం కొన్ని రోజులైనా హడావుడి చేస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పరిస్థితి దీనికి పూర్తిగా భిన్నంగా ఉంది. ఇసుక టిప్పర్ల వినియోగం, ఓవర్ లోడింగ్ ఇక్కడ చాలా చిన్న పదాలు. జీరో వ్యాపారం, నకిలీ వే బిల్లులకు ఈ జిల్లా పేరెన్నిక గన్నది. జాతీయ స్థాయిలో సివిల్స్ లో మొదటి ర్యాంక్ సాధించిన డి. అనుదీప్ ను ఇక్కడ అదనపు బాధ్యతలతో జిల్లా కలెక్టర్ గా ప్రభుత్వం నియమించింది.

ఆయన కంటే సీనియర్లను కాదని ఈ నియామకం జరిగింది. అదనపు కలెక్టర్ గా పనిచేసిన కాలంలో మంచి పేరు తెచ్చుకున్నకొత్తగూడెం కలెక్టర్ ఇప్పడు ఇసుక వ్యవహారాలపై నోరు మెదపక పోవడం జిల్లా వ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్నది. ఈ జిల్లాలో ఇసుక కాంట్రాక్టర్లే సమాంతర ప్రభుత్వం నడిపిస్తున్నారనే విమర్శలు వినవస్తున్నాయి.

కొండూరి రమేష్ బాబు

Leave A Reply

Your email address will not be published.