A place where you need to follow for what happening in world cup

ఇసుక బకాయిలు రూ 700 కోట్లు..

  • మూడేండ్లుగా బిల్లులు పెండింగ్
  • సంక్షేమ పథకాల కోసం నిధులు మళ్ళింపు
  • బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దల నిర్వాకం
  • గిరిజన సొసైటీలు కాంట్రాక్టర్ల విల విల
  • ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూపు

ఇసుక అమ్మకాలతో భారీగా ఆదాయం వచ్చిందని ప్రచారం చేసుకున్న గత ప్రభుత్వం గిరిజన సొసైటీలకు కాంట్రాక్టర్లకు బకాయిలు చెల్లించకుండా ఎగనామం పెట్టింది. ఆన్ లైన్ లో ఇసుక అమ్మడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు కోట్లాది రూపాయలు రాగా ఆ నిధులను కూడా ఇతర పనులకు మళ్ళించడంతో విమర్శల పాలయింది. 2020-21 ఆర్థిక సంవత్సరం నుంచీ బకాయిలు పేరుకు పోయాయి. ఇసుక సహకార సంఘాలకు కాంట్రాక్టర్లకు రూ. 700 కోట్ల మేరకు బిల్లుల రూపంలో చెల్లించాల్సి ఉంది. ఇసుక తవ్వకాలు, లోడింగ్ పనులను తెలంగాణ ఖనిజాభివృద్థి సంస్థకు ప్రభుత్వం అప్పగించింది.

గిరిజన ప్రాంతంలో గిరిజన సహకాల సంఘాలకు, మైదాన ప్రాంతాల్లో టెండర్ల విధానం ద్వారా కాంట్రాక్టర్లకు టీఎస్ఎండీసీ ఇసుక పనులను కేటాయించింది. పనులు పూర్తి చేసిన కేవలం నెల రోజుల కాల వ్యవధిలో బిల్లులు చెల్లిస్తామంటూ అగ్రిమెంట్ నిబంధనల్లో పేర్కొన్న టీఎస్ఎండీసీ ఏండ్లు గడుస్తున్నా బకాయిలు చెల్లించడం లేదు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేయక పోవడంతో ఖనిజాభివృద్థి సంస్థ ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితికి చేరింది. ప్రభుత్వం మారడంతో ఇప్పటికైనా తమకు బిల్లులు చెల్లించాలని గిరిజన సహకార సంఘాలుకోరుతున్నాయి. 

2014 లో కొత్త ఇసుక పాలసీ..

దీపక్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా కేసులో దేశ వ్యాప్తంగా ఇసుక తవ్వకాలపై సుప్రీం కోర్టు ఆంక్షలు విధించింది. సుప్రీం తీర్పునకు లోబడి తెలంగాణ ప్రభుత్వం 2014 లో కొత్త ఇసుక విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ పరిశ్రమలు వాణిజ్య శాఖ (మైనింగ్ విభాగం)జీవో నంబర్ 38 జారీ చేసింది. దీనికి అనుగుణంగా జీవో నంబర్3 పేరుతో నిబంధనలను కూడా రూపొందించింది. ఆన్ లైన్ ఇసుక అమ్మకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి 2014-15 లో రూ. 19.18 కోట్లు ఆదాయం రాగా 2015-16లో రూ. 374.99 కోట్లు, 2016-17 లో రూ. 456.46 కోట్లు, 2017-18 లో రూ. 6787.33 కోట్లు, 2018-19 లో రూ. 886.43 కోట్లు, 2019-20 లో రూ. 792.80 కోట్లు, 2020-21 డిసెంబర్ నెలాఖరు వరకూ రూ. 609.91 కోట్లు ఆదాయం వచ్చింది. 2021-22 నాటికి ఇసుక ఆదాయం రూ. 900 కోట్లకు చేరింది. 

కొత్త అనుమతులకు బ్రేక్..

రాష్ట్రంలో ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చిన తర్వాత కొత్త ఇసుక రీచ్ లకు ఎటువంటి అనుమతులు లభించలేదు. మైదాన ప్రాంతాల్లో టెండర్ల ప్రక్రియకు బ్రేక్ పడగా గిరిజన ప్రాంతంలో ఇప్పటికే పర్యావరణ అనుమతులు పొందిన 18 ఇసుక రీచ్ ల ఫైళ్ళు పెండింగ్ లో ఉన్నాయి. పర్యావరణ అనుమతుల కాల పరిమితి తక్కువగా ఉండటంతో తమ రీచ్ లకు వెంటనే అనుమతులు ఇవ్వాలను గిరిజన సహకార సంఘాలు కోరుతున్నాయి. రాష్ట్ర రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కొత్త రీచ్ లను ఆపమని చెప్పారని కొందరు అధికారులు చెప్తున్నారు.

ములుగు జిల్లాలో సీతక్క అనుమతి ఉంటేనే ఇసుక రీచ్ లను మంజూరు చేస్తామని ఒక ఉన్నతాధికారి తనను కలిసిన గిరిజన సంఘాలకు చెప్పారు. జిల్లా కలెక్టర్లు చైర్ పర్సన్ లుగా పనిచేసే జిల్లా ఇసుక కమిటీల సమావేశాలు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకూ జరగలేదు. రాష్ట్ర స్థాయిలో కూడా ఇసుక విధానంపై ఇప్పటి వరకూ ఎటువంటి సమీక్షా జరగలేదు. మైనింగ్ శాఖను గత ప్రభుత్వ హయాంలో సీఎం తన వద్దే ఉంచుకోగా ప్రస్తుత ప్రభుత్వంలోనూ సీఎం వద్దే ఉన్నది. ఆ శాఖకు ప్రత్యేకంగా ముఖ్య కార్యదర్శి లేక పోవడంతో సీఎస్ చూస్తున్నారు. తెలంగాణ ఖనిజాభివృద్థి సంస్థ ఎండీలుగా 2014 వరకూ ఐఏఎస్ అధికారులు పనిచేయగా 2015లో సహకార శాఖలో అదనపు రిజిస్ట్రార్ గా పనిచేస్తున్న మల్సూర్ ను ఎండీగా నియమించారు. ఆయన నియామకానికి అప్పట్లో పొంగులేటి శ్రీనివాస రెడ్డి చక్రం తిప్పారని తెలిసింది. హరీశ్ రావు, కేటీఆర్ మైనింగ్ మంత్రులుగా పనిచేసినా, చివిరికి సీఎం వద్దకు ఆ శాఖ చేరినా మల్సూర్ ప్రాభవం మాత్రం కొనసాగింది. కేసీఆర్ కోటరీ అధికారుల్లో ఒకరుగా ఆయనకి పేరు వచ్చింది. అస్మదీయుడైన పొంగులేటి ప్రస్తుత ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తుండటంతో మల్సూర్ ను ఎండీగా కొనసాగించ వచ్చని తెలిసింది.     

                                                           కొండూరి రమేష్ బాబు

                      మొబైల్.. 8332995398

Leave A Reply

Your email address will not be published.