- వన్యప్రాణులకు ఇసుక క్వారీల బెడద
- అడవి దారిలోనే వందలాది లారీల ప్రయాణం
- అమలుకు నోచుకోని ఎకో సెన్సిటివ్ జోన్ నోటిఫికేషన్
- శాఖల మధ్య సమన్వయ లోపం
పర్యావరణం, జీవావరణం ఎవరికీ పట్టని పదాలుగా మారిపోయాయి. మానవాళి మనుగడకు అవసరమైన అడవులను,ప్రకృతి సమతుల్యంలో కీలకమైన వన్యప్రాణులను కాపాడుకోవాలనే శ్రద్ధ ఇటు పాలకులకు కానీ అటు ప్రజలకు కానీ పట్టదు. అది కేవలం పర్యావరణ వాదులు, ప్రకృతి ప్రేమికులకు సంబంధించిన విషయంగా మారిపోవడం విశేషం. రాష్ట్రంలోని ఏటూరునాగారం అభయారణ్యం పరిస్థితి చూస్తే ఇది అక్షర సత్యమనిపిస్తుంది. దేశం లోని పురాతనమైన అభయారణ్యాల్లో ఏటూరునాగారం కూడా ఒకటి. 2017 జులై 27 న ఎస్ఓ నంబర్ 2046 (ఇ) ద్వారా కేంద్ర అటవీ పర్యావరణ శాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ తో ఈ అభయారణ్యం ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిలోకి వచ్చింది. 1986 పర్యావరణ పరిరక్షణ చట్టం ప్రకారం కేంద్రం ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
పూర్వపు వరంగల్, కరీంనగర్ జిల్లాల పరిథిలోని 1281.7 చదరపు కిలో మీటర్ల పరిధి గల ప్రాంతాన్ని ఎకో జోన్ గా ప్రకటించారు. దీనిలో అధిక భాగం గోదావరి తీర ప్రాంతంలోనే ఉంది. గోదావరి అవలి తీరంలో ఉన్న మహారాష్ట్ర, చత్తీస్ గఢ్ అటవీ ప్రాంతం దీనికి సరిహద్దుగా ఉన్నది. వందలాది వృక్ష జాతులతో పాటు పులులు, చిరుతలు, గుడ్డెలుగులు, హైనాలు, అడవి బర్రెలు, అడవి దున్నలు, అడవి కుక్కలు, నక్కలు, నాలుగు కొమ్ముల దుప్పులు, జింకలు, నీల్గాయ్ లు, మొసళ్ళు, కొండ చిలువలు, అతి పెద్ద ఉడతలు, ఎగిరే ఉడతలు తదితర జంతు జాలంతో పాటు పదుల సంఖ్యలో అరుదైన పక్షి జాతులు ఈ అభయారణ్యంలో ఉన్నట్టు గుర్తించారు. అభయారణ్యానికి పది కిలోమీటర్ల దూరం వరకూ ఎకో సెన్సిటివ్ జోన్ విస్తీర్ణం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం ఈ.ఎస్.జెడ్. పరిథిలో ఇసుక వంటి చిన్న తరహా ఖనిజాల తవ్వకాన్ని నిషేధించారు. వ్యవసాయానికి అనుమతించారు. పర్యాటకం, రహదారుల నిర్మాణం వంటి పనులను కేంద్రం అనుమతితో చేపట్టే అవకాశం ఉన్నది.
తయారు కాని జోనల్ మాస్టర్ ప్లాన్…
ఎకో సెన్సిటివ్ జోన్ పరిథిలో వన్య ప్రాణుల మనుగడ, పెంపుదల కోసం నిషేధిత ప్రాంతలో తీసుకోవాల్సిన చర్యలపై ఎప్పటికప్పుడు చర్చించి నిర్ణయాలు తీసుకోవడానికి జోనల్ మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. దీని కోసం వివిధ శాఖల సమన్వయం అవసరం కావడంతో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేయాల్సి ఉంది. ఏటూరునాగారం ఎకో జోన్ ప్రకటించి ఆరేండ్లు కావస్తున్నా మానిటరింగ్ కమిటీ ఏర్పాటు కాలేదు. ఫలితంగా నీరు, గాలి, శబ్థ కాలుష్యానికి సంబంధించి వివిధ శాఖల మధ్య సమన్వయం లోపించింది.
ఇసుక లారీలతో వన్యప్రాణులు చెల్లా చెదురు..
ఎకో సెన్సిటివ్ జోన్, వన్యప్రాణుల అభయారణ్యం మధ్య నుంచి వేసిన్ రోడ్ ను163 జాతీయ రహదారిగా ప్రకటించిన తర్వాత హైదరాబాద్ చత్తీస్ గఢ్ మధ్య వాహనాల సంఖ్య గణనీయంగా పెరిగింది. వీటికి తోడు వందలాది ఇసుక లారీలు ఈ రహదారి మీదుగానే ప్రయాణం చేస్తున్నాయి. వాజేడు, వెంకటాపురం ప్రాంతం నుంచి భద్రాచలం వైపు, ఏటూరునాగారం, మంగపేట ప్రాంతాల నుంచి మణుగూరు మీదుగా పాల్వంచ వైపు రహదారులు ఉన్నా మణుగూరు, చర్ల ప్రాంతాల నుంచి వచ్చే ఇసుక లారీలను కూడా ఏటూరునాగారం అభయారణ్యం మీదుగా తరలిస్తున్నారు. వందల సంఖ్యలో వస్తున్న లారీలపై ఎటువంటి నియంత్రణ లేక పోవడంతో హారన్ ల శబ్థాలకు వన్యప్రాణులు చెల్లా చెదురై పోతున్నాయి. కొన్ని సందర్భాల్లో లారీల కింద పడి చనిపోతున్నాయి. ఎకో సెన్సిటివ్ జోన్ లో ఇసుక తవ్వకాలను అనుమతించ వద్దని అటవీ శాఖ అధికారులు చెప్పిన తర్వాత కూడా మైనింగ్ శాఖ కొన్ని రీచ్ లను మంజూరు చేసి వివాదాల్లో చిక్కుకుంది. అనుమతి లేని కొన్ని ఇసుక క్వారీలను అటవీ శాఖ అధికారులు ఇటీవల నిలిపివేశారు. ఏటూరునాగరం ప్రాంతంలో రిజర్వ్ అడవి కానీ, ఎకో సెన్సిటివ్ జోన్ కానీ లేదంటూ తప్పుడు సమాచారం ఇవ్వడం ద్వారా మైనింగ్ శాఖ, తెలంగాణ ఖనిజాభివృద్థి సంస్థ కొన్ని ఇసుక రీచ్ లకు పర్యావరణ అనుమతులు తీసుకోవడం వివాదాస్పదమైంది. వీటిపై అటవీ శాఖ దృష్టి సారించింది.
కొనసాగింపు ప్రతిపాదనలు పంపడంలో జాప్యం..
ఏటూరునాగారం ఎకో సెన్సిటివ్ జోన్ కాలపరిమితిని ముందుగా ఐదు సంవత్సరాలుగా కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసిన 545 రోజుల్లోగా అభ్యంతరాలు స్వీకరించి తుది నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంది. ఐదేండ్ల కాలపరిమితి ముగిసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కొనసాగింపు ప్రతిపాదనలు పంపాల్సి ఉంటుంది. వీటిని పంపడంలో అటవీ శాఖలో జాప్యం జరుగుతున్నది.
కొండూరి రమేష్ బాబు