A place where you need to follow for what happening in world cup

రిజర్వేషన్ల జీవోతో ఆదివాసీలకు ఒరిగేదేమిటి?

no use from reservation to adivasis

  • జీవో నంబర్ 3 కొట్టివేసిన తర్వాత తీరని అన్యాయం
  • వేలాది ఉద్యోగాలు కోల్పోయిన వైనం
  • మైదాన ప్రాంత గిరిజనులతో తీవ్ర పోటీ

విద్య, ఉద్యోగాల్లో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 33 పై సర్వత్రా చర్చ జరుగుతున్నది.  ఈ జీవో న్యాయ సమీక్షకు నిలబడుతుందా లేదా అనే సంశయం కొందరికి కలుగుతుండగా ఈ జీవోతో తమకు పెద్దగా ఒరిగేదేమీ లేదని ఆదివాసీలు పెదవి విరుస్తున్నారు. స్థానిక ఆదివాసీలకు ఏజెన్సీ ప్రాంతంలో ఉపాధ్యాయ నియామకాల్లో 100 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఉమ్మడి రాష్ట్రంలో జారీ చేసిన జీవో నంబర్ 3  ని సుప్రీం కోర్టు కొట్టి వేసిన తర్వాత ఆదివాసులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. జీవో నంబర్ 3 అమల్లోకి వచ్చిన తర్వాత వైద్యం ఆరోగ్యం, పోలీస్, రెవిన్యూ, వ్యవసాయం, ఆబ్కారీ తదితర శాఖలు కూడా ఏజెన్సీ ప్రాంతంలోని స్థానిక ఆదివాసీలకు 25 నుంచి 100 శాతం వరకూ ప్రత్యేక రిజర్వేషన్లను కల్పిస్తూ ఉమ్మడి రాష్ట్రంలోనే జీవోలు జారీ చేశాయి. సుప్రీం కోర్టు తీర్పుతో ఇవి కూడా రద్దయి పోయాయి. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లోని ఏజెన్సీ ఆదివాసీలు వేలాది ఉద్యోగాలు కోల్పోయారు. సుప్రీం తీర్పు తర్వాత తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు సుప్రీం కోర్టులో విడిగా రివిజన్ పిటిషన్లను వేసి చేతులు దులుపుకున్నాయి. రేండేండ్లు గడచినా ఇవి కనీసం విచారణకు కూడా రాలేదు.

విద్య, ఉద్యోగాల్లో 50 శాతం రిజర్వేషన్లు మించ కూడదంటూ జీవో నంబర్ 3 ని కొట్టివేసిన సందర్భంగా సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో 33 చట్టబద్దత ప్రశార్థకంగా మారింది. గిరిజన రిజర్వేషన్లను 6 నుంచి10 శాతానికి పెంచే ముందు తెలంగాణ ప్రభుత్వం చెల్లప్ప కమిషన్ నియమించింది. జనాభా ప్రాతిపదికన గిరిజన రిజర్వేషన్లను పెంచడంతో పాటూ వాల్మీకి బోయ, తైత లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చడం కోసం నియమించిన ఈ కమిషన్ నివేదికను ఆమోదించిన ప్రభుత్వం తెలంగాణలో గిరిజన రిజర్వేషన్లను 2011 జనాభా లెక్కల ప్రకారం 10 శాతానికి పెంచుతూ 16.4.2017 న రాష్ట్ర అసెంబ్లీ ఒక ప్రత్యేక తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్నికేంద్రానికి పంపినా అటువైపు నుంచి ఎటువంటి స్పందనా రాక పోవడంతో ఐదేండ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వమే రిజర్వేషన్లు పెంచుతూ ఇటీవల జీవో జారీ చేసింది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో స్థానికి అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక రిజర్వేషన్లను కల్పించవచ్చని రాష్ర్ట ప్రభుత్వం భావిస్తున్నది. తమిళనాడులో రిజర్వేషన్లు 67 శాతంగా పెంచడాన్ని ఉదాహరణగా పేర్కొంటున్నారు. అయితే తమిళనాడు రిజర్వేషన్లకు సంబంధించి పార్లమెంటులో రాజ్యాంగ సవరణ చేయగా తెలంగాణ రిజర్వేషన్ల అంశానికి కేంద్రం మద్దతు లేక పోవడం విశేషం. ఈ కారణాలతో 10 శాతం రిజర్వేషన్ల జీవో చట్టపరంగా నిలబడుతుందా లేదా అనేది చర్చనీయాంశమైంది. మునుగోడు ఉప ఎన్నికలను దృష్టిల లో పెట్టుకుని కేసీఆర్ హడావుడిగా ఈ నిర్ణయం తీసుకున్నారనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్నది.

no use from reservation to adivasis

మరో వర్గీకరణ పోరాటం తప్పదా?

రాష్టంలో గిరిజన జనాభా తాజా లెక్కల ప్రకారం దాదాపు 40 లక్షలు పైగా ఉండగా వీరిలో 20 లక్షల మంది మైదాన ప్రాంత గిరిజనులు ఉండటం విశేషం. మిగిలిన 20 లక్షల మందిలో కోయ, గోండు, కొల్లాం, ప్రధాన్, నాయక్ పోడు, వంటి ప్రధాన తెగల వారు ఏజెన్సీ ప్రాంతంలో  నివసిస్తున్నారు.  ఆదిమజాతి (ప్రిమిటివ్)  తెగలైన చెంచు, కొడరెడ్డి  ఆదివాసీలు కేవలం 40 వేల లోపుగానే ఉండి అంతరించిపోతున్నవారి జాబితాలో చేరి పోవడం ఆందోళన కలిగిస్తున్నది. ఏజెన్సీ ప్రాంత ఆదివాసీలతో పోలిస్తే మైదాన ప్రాంత గిరిజనులు పూర్తి స్థాయిలో విద్య, ఉద్యోగ అవకాశాలను పొందుతున్నారు. గురుకులాల్లో సీట్ల కేటాయింపుతో పాటు జనరల్ రోస్టర్ కేటగిరీలో 90 శాతం వీరే చేరిపోతున్నారు. కొండ కోనలు, అడవుల్లో నివసిస్తున్న ఆదివాసీల్లో డ్రాపౌట్ లు 17 శాతంగా ఉన్నదని ప్రభుత్వ లెక్కలే చెప్తున్నాయి.  ఫలితంగా ఆదివాసీలు మైదాన ప్రాంత గిరిజనులతో పోటీ పడలేక పోతున్నారనేది అందరికీ తెలిసిన విషయమే. అటువంప్పుడు వెనుక బడిన తెగలను, జాతులను మరింత ముందుకు తీసుకు వెళ్ళాలనే ఆశయంతో ప్రవేశ పెట్టిన రిజర్వేషన్లు కొందరికే ఉపయోగ పడటం ఆమోద యోగ్యం కాదు. గిరిజన, ఆదివాసీల మధ్య సమతుల్యం సాధించడానికి వర్గీకరణ ఒక్కటే ప్రత్యామ్నాయమని కొన్ని ఆదివాసీ సంఘాలు అభిప్రాయ పడుతుండగా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిన తెగలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని మరి కొన్నిసంఘాలు వాదిస్తున్నాయి.

లంబాడా రిజర్వేషన్లపైనా పోరాటం..

తెలంగాణ ప్రాంతంలో లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలంటూ రాష్ట్ర హైకోర్టు, సుప్రీం కోర్టులో ఆదివాసీ సంఘాలు దాఖలు చేసిన పిటిషన్లు విచారణలో ఉన్నాయి. ఎమర్జెన్సీ కాలంలో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి జలగం వెంగళరావు అప్పటి ప్రధాని ఇందిరా గాంధీతో మాట్లాడి రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చారు. ఎటువంటి కమిషన్ వేయక పోవడంతో పాటు లోక్ సభ, రాజ్యసభలో బిల్లు పెట్టకుండానే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆదివాసీ సంఘాలంటున్నాయి. లంబాడాలు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్ గడ్ రాష్ట్రల్లో బీసీలుగానూ, కర్నాటకలో షెడ్యూలు కులాల్లోనూ ఉన్నారనే విషయాన్ని ఆదివాసీలు ఉటంకిస్తున్నారు.                                                                                                                

కొండూరి రమేష్ బాబు

Leave A Reply

Your email address will not be published.