A place where you need to follow for what happening in world cup

సాండ్ డెవిల్స్ పారడైజ్..

  • గోదావరిలో బినామీ ఇసుక కాంట్రాక్టర్ల హల్ చల్
  • పోటీ లేని అక్రమ ఒప్పందాలు
  • అర్హతలు లేకున్నా పనులు
  • విధి విధానాలు లేకుండానే రూ. వందల కోట్లు చెల్లింపులు
  • అధికారుల విశ్వామిత్ర సృష్టి

ప్రభుత్వం ఒక గుండు సూది కొనాలన్నా కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. అటువంటిది వందల కోట్ల రూపాయల విలువ చేసే ఇసుక రీచ్ లను నామినేషన్ పద్దతిపై బినామీ కాంట్రాక్టర్లకు కట్టబెట్టడం ఆశ్చర్యం కలిగిస్తుంది. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో ఆదివాసీ సహకార సంఘాల పేరుతో అధికారులు ఆడుతున్న వింత నాటకానికి ఆస్కార్ అవార్డును ఇవ్వవచ్చు.సహకార సంఘాలకు సాధికారిత కల్పించకుండా నిర్వీర్యం చేసి బడాబాబుల బొక్కసాలు నింపడం వెనుక స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఐఏఎస్ అధికారులదే కావడం విశేషం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కాలం నుంచీ నడుస్తున్న ఈ అక్రమ దందాతో ఆదివాసీ సహకార సంఘాలతో పాటూ ప్రభుత్వ ఖజానాకు కూడా భారీగా నష్టం వాటిల్లుతోంది.

భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లోని గోదావరి పరీవాహక ప్రాంతం ఏజెన్సీలో ఉంది. ‘పీసా’ చట్టం ప్రకారం ఈ ప్రాంతంలోని ఇసుక రీచ్ లను ఆదివాసీ సహకార సంఘాలకు కేటాయించాలి. సహకార సంఘాలకు ఇసుక రీచ్ లను పూర్తిగా కేటాయించకుండా కేవలం లోడింగ్, డంపింగ్ పనులను మాత్రమే ప్రభుత్వం అప్పగించింది. తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ ఈ మేరకు ఆదివాసీ సహకార సంఘాలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నది. క్యూబిక్ మీటర్ ఇసుకను రూ. 635 లకు ఆన్ లైన్ ద్వారా అమ్ముతున్న టీజీఎండీసీ ఆదివాసీ సహకార సంఘాలకు కేవలం రూ. 220 కేటాయిస్తున్నది. వీటిలో రూ. 180 డంపింగ్, రవాణా పనులకు పోను మిగిలిన రూ. 40 మాత్రమే సహకార సంఘాల సభ్యులకు బోనస్ రూపంలో దక్కుతుంది.

ఒప్పందంలో ఏముంది?
రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఆదివాసీ సహకార సంఘాలతో కుదుర్చుకున్న ఒప్పందంలో కీలకమైన నిబంధన పెడుతోంది. సహకార సంఘాలకు కేటాయించిన పనులను వారే చేయాలని, ఎటువంటి థర్డ్ పార్టీ ఒప్పందాలు కుదుర్చుకోవద్దని స్పష్టంగా రాస్తోంది. ఏ సంఘమైనా థర్ఢ్ పార్టీ ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలిస్తే ఒప్పందాన్ని రద్దు చేయడమే కాక వారికి చెల్లించ వలసిన బిల్లు మొత్తాన్ని కూడా నిలిపి వేసి ప్రభుత్వ ఖజానాకు జమ కడతామనే నిబంధన కూడా దీనిలో ఉంది.

బినామీల సృష్టికర్తలెవరు?
ఇసుక కాంట్రాక్టులు దక్కించుకున్న ఆదివాసీ సహకార సంఘాల వద్ద పెట్టుబడి లేక పోవడం సమస్యగా మారింది. ఈ దశలో అధికారుల పాత్ర కీలకమైంది. ఆదివాసీల సాధికారిత కోసం ఏర్పాటు చేసిన ట్రైకార్, బ్యాంకుల ద్వారా సహకార సంఘాలకు రుణసౌకర్యం కల్పించే అవకాశం ఉన్నప్పటికీ అధికారులు ఆ పని చేయ లేదు. సహకార సంఘాల ద్వారా టెండర్లు పిలిచి యంత్ర పరికరాలు సమకూర్చుకునే అవకాశం ఉన్నా అది కూడా చేయలేదు. ఏజెన్సీ ప్రాంతంలోని ఇసుక రీచ్ ల వ్యవహారాన్ని జిల్లా కలెక్టర్లు చైర్మన్ లుకా ఉన్న జిల్లా ఇసుక కమిటీలకు అప్పగించారు. ఈ కమిటీల్లో ఐటీడీఏల ప్రాజెక్టు అధికారులు కూడ ఉన్నారు. అవసరమైతే ప్రత్యేకంగా మార్గదర్శకాలను రూపొందించుకునే అధికారాన్ని కూడా జీవో నంబర్ 38, 3 ద్వారా ప్రభుత్వం దారాదత్తం చేసింది.

అనేక ప్రత్యామ్నాయాలున్నప్పటికీ జిల్లా కలెక్టర్లు పట్టించుకోక పోగా బినామీ కాంట్రాక్టర్ల వ్యవస్థకు తెరలేపారు. సహకార సంఘాలు కాంట్రాక్టర్లకు పనులు అప్పగించాలంటే టెండర్ లేదా బిడ్ విధానం అమలు చేయాలి. ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ఠ ధర కన్నా అతి తక్కువ ధరకు పనులు చేసే వారితోనే ఒప్పందాలు చేసుకోవాలి. 1964 సహకార చట్టం ప్రకారం కానీ, 1995 పరస్పర సహాయక సహకార చట్టం ప్రకారం నమోదైన సహకార సంఘాలన్నీ ప్రభుత్వ నిబంధనలు, టెండర్ విధానానికి లోబడి పనిచేయాలి. ఉన్నతాధికారుల విశ్వామిత్ర సృష్టితో పుట్టిన బినామీ కాంట్రాక్టర్లకు ఎటువంటి నిబంధనలూ అడ్డు రాలేదు. ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ఠ మొత్తం తీసుకునే విధంగా సహకార సంఘాలతో బినామీ కాంట్రాక్టర్లు ఒప్పందాలను కుదుర్చుకుని కోట్లది రూపాయలను కొల్లగొడుతున్నారు. ఇదంతా అధికారుల కనుసన్నల్లోనే జరుగుతోంది.

టీజీఎండీసీ కలెక్టర్లే సూత్రధారులు..
ఎటువంటి పెట్టుబడులూ లేని సహకార సంఘాలు బినామీ కాంట్రాక్టర్లను నామినేషన్ పద్దతిలో నియమించుకుంటున్నారనే విషయం అధికారులందరికీ తెలుసు. నిజానికి ఈ వ్యవస్థను సృష్టించి కొనసాగిస్తున్నది వారే కావడం విశేషం. బినామీ కాంట్రాక్టర్ల విషయంలో టీజీఎండీసీ ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తూ పూర్తి నెపాన్ని కలెక్టర్లపై నెట్టివేస్తోంది. ఎంతో కష్టపడి చదివి ఐఏఎస్ సాధించి జిల్లా కలెక్టర్లుగా పనిచేస్తున్న వారికి ఈ మాత్రం లోగుట్టు తెలియనిది కాదు. ఉదాసీన వైఖరితో పాటు రాజకీయ ఒత్తిడులతో కలెక్టర్లు బినామీ కాంట్రాక్టర్లకు వంత పాడుతున్నారని స్పష్టమవుతోంది. తమ రికార్డుల ప్రకారం సహకార సంఘాలకే పనులు కేటాయించామని చెప్తున్న టీజీఎండీసీ అధికారులు తరచుగా బినామీ కాంట్రాక్టర్లతో అధికారిక సమావేశాలు నిర్వహించడం, ఇసుక రీచ్ లను బినామీ కాంట్రాక్టర్లకు అప్పగించడం ద్వారా అపహాస్యం పాలవుతున్నారు.

సిద్ధార్థ జైన్ నుంచి జితేష్ పాటిల్ వరకు..
బినామీ కాంట్రాక్టర్ల వ్యవస్థను సృష్టించడమే కాక వారిని గత పదమూడేండ్ల కాలంగా కాపాడుతున్న ఘనత జిల్లా కలెక్టర్లదే అని చెప్పవచ్చు. సహకార సంఘాలకు బినామీ కాంట్రాక్టర్లను నియమించుకునే అంశం ఉమ్మడి రాష్ట్రంలోనే తెరపైకి వచ్చింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా కలెక్టర్ గా పనిచేసిన సిద్ధార్థ జైన్ బినామీ కాంట్రాక్టర్ల సృష్టి కర్తగా చెప్పవచ్చు. 2012 లో పాల్వంచ లో జరిగిన ఒక కీలక సమావేశంలో సహకార సంఘాలు బినామీ కాంట్రాక్టర్లను పెట్టుకోవచ్చని మౌఖిక ఆదేశాలను జారీ చేశారు. అంతే కాకుండా కాంట్రాక్టర్లకు ప్రతి క్యూబిక్ మీటర్ కు రూ. 180 చెల్లించే విధంగా అదే సమావేశంలో నిర్ణయించారు. ఆ తర్వాత ఇదే పద్దతిని కొనసాగిస్తున్నారు. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులు సహకార సంఘాలతో కలిసి బ్యాంకుల్లో జాయింట్ అకౌంట్లను తెరవాలనే నిర్ణయం కూడా అప్పుడే జరిగింది. సహకార వ్యవస్థలో అనవసర జోక్యంతో పాటూ సంఘాల బైలాస్ కి విరుద్ధంగా ప్రాజెక్టు అధికారులు జాయింట్ అకౌంట్లు నిర్వహించడమే కాక చాలా కాలం వరకూ బినామీ కాంట్రాక్టర్లకు ఇచ్చిన చెక్కుల్లో సంతకాలు కూడా చేశారు. ఏటూరునాగారం ఐటీడీఏ పరిథిలోని ఏటూరు, తొపాకులగూడెం గ్రామాల్లో 70 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వకాల కోసం బినామీ కాంట్రాక్టర్లను నియమించడం ద్వారా అప్పటి కలెక్టర్ వాకాటి కరుణ విమర్శల పాలయ్యారు. అక్కడ కూడా బినామీ కాంట్రాక్టర్లకు అధికారులే చెక్ ల ద్వారా చెల్లింపులు జరిపారు.

బినామీ వ్యవస్థను వ్యతిరేకించిన కొందరు ఐఏఎస్ లు
బినామీ కాంట్రాక్టర్లకు నామినేషన్ పద్దతిపై నియమించడాన్ని తప్పపట్టిన ఇద్దరు ఐఏఎస్ అధికారులు ఇసుక డంపింగ్, రవాణా పనుల కోసం సహకార సంఘాలు బిడ్ విధానం పాటించాలని ఆదేశించారు. భద్రాచలం ఐటీడీఏ పీవో గా పనిచేసిన వీరపాండ్యన్, సబ్ కలెక్టర్ గా పనిచేసిన నారాయణ భరత్ గుప్త ఇసుక రీచ్ ల కోసం టెండర్లను పిలిపించారు. టెండర్లను దక్కించుకున్న కొందరు కాంట్రాక్టర్లు ఇసుక అక్రమ రవాణా చేసి నట్లు ఫిర్యాదులు రావడంతో సహకార శాఖ ద్వారా స్పెషల్ ఆడిట్ కూడా చేయించారు. అవకతవకలపై విజిలెన్స్ దర్యాప్తు కూడా జరిగింది.

ఆకునూరి మురళి సంచలనం..
ఇసుక సహకార సంఘాల పనులను బినామీ కాంట్రాక్టర్ల నుంచి తప్పించడానికి మరో ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి కూడా ప్రయత్నించారు. వెంకటాపురం మండలం సూరవీడు ఇసుక రీచ్ ని దళారులు లేకుండా నిర్వహించడం కోసం ఆ గ్రామస్తులతోనే ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. జిల్లా అధికారులనందరినీ అక్కడికి పిలిపించి అక్కడే జిల్లా ఇసుక కమిటీ సమావేశం కూడా నిర్వహించారు. కొందరు కాంట్రాక్టర్లు ప్రభుత్వ స్థాయిలో లాబీయింగ్ చేసి ఆకునూరి మురళి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. దీనితో ఆగ్రహించిన కలెక్టర్ అక్కడి ఇసుక రీచ్ ని రద్దు చేశారు.

రూ. 1,500 కోట్ల ఇసుక కాంట్రాక్టు పైనే సర్వత్రా చర్చ..
గతంలో ఒక్కొక్క ఇసుక రీచ్ లో కేవలం ఒక లక్ష క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వకాలు, రవాణా కోసం బినామీ కాంట్రాక్టర్లను నియమించే వారు. సీతారామ ప్రాజెక్టు పూడిక పేరుతో కేటాయించిన రెండున్నర కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక కోసం బినామీ కాంట్రాక్టర్లను నియమించడం, వారికి వందల కోట్ల బిల్లులు చెల్లించడం సాంకేతికంగానూ, ప్రభుత్వ నిబంధనల ప్రకారం చెల్లుబాటవుతుందో లేదో తేలాల్సి ఉంది. పూడిక పేరుతో ఇసుక కాంట్రాక్టులు దక్కించుకున్న పలువురు వ్యక్తులు తమ పలుకుబడితో వ్యవహారాలను చక్కదిద్దుకుంటున్నారు. వీరిలో పలువురికి కనీస అర్హతలు లేవు. జీఎస్టీ రిజిస్ట్రేషన్, ఇన్కం టాక్స్ అసెస్ మెంట్ వంటి కనీస డాక్యుమెంట్లను కూడా పరిశీలించ కుండా వీరికి పనులను అప్పగించారు. ఈ వ్యవహారంలో అధికారుల పాత్ర కూడా తేలాలంటే మొత్తం వ్యవహారంపై ప్రభుత్వం దర్యాప్తు జరిపించాల్సిన అవసరం ఉంది. భారీ కుంభకోణంపై విజిలెన్స్ లేదా లోకాయుక్తలో ఫిర్యాదు చేయాలని ఆదివాసీ సంఘాలు ప్రయత్నిస్తున్నాయి.

Leave A Reply

Your email address will not be published.