- సర్కారు ఖజానాకు భారీగా నష్టం
- కాంట్రాక్టర్లను వదలి
- లారీ యజమానులపై కేసులు
- డంప్ యార్డుల వద్దే అక్రమాలు
- నామమాత్రపు తనిఖీలు
- మాఫియా స్వైర విహారం
రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక అక్రమ రవాణాను అరికట్టడం ద్వారా ఖజానాకు ఆదాయం పెరిగిందని ప్రభుత్వ పెద్దలు చెప్తున్న మాటల్లో నిజం లేదని స్పష్టమవుతున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇసుకపై ఆదాయం రూ. 1,200 కోట్లకు చేరింది. కానీ ప్రభుత్వం మారిన తర్వాత అత్యధికంగా 2025 26 ఆర్థిక సంవత్సరంలో ఇసుక ఆదాయం రూ. 1,0000 కోట్లకే పరిమితమయింది. నిజానికి ఇసుక ద్వారా రూ. 1,500 కోట్ల వరకూ ఆదాయం వస్తుందని కొందరు అధికారులు ముఖ్యమంత్రికి హామీ ఇచ్చారు. అధికారులు చెప్తున్న మాటలకు, క్షేత్ర స్థాయిలో జరుగుతున్న దానికి పొంతన లేకుండా పోతున్నది. రాష్ట్రంలోని వివిధ ఇసుక రీచ్ ల నుంచి పెద్ద ఎత్తున ఇసుక అక్రమంగా తరలిపోతున్నదనే ఫిర్యాదులు ప్రభుత్వానికి అందుతూనే ఉన్నాయి.
జీరో దందాతో పాటూ నకిలీ వేబిల్లులు, ఓవర్ లోడింగ్ వంటి అక్రమాలను పూర్తిగా అరికట్టలేక పోవడంతో ఇసుక మాఫియా చెలరేగిపోతున్నది. రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక తవ్వకాల్లో 90 శాతం గోదావరి నదిలోనే జరుగుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భూపాలపల్లి జిల్లాలోని ఇసుక రీచ్ ల వద్ద నుంచి కోట్లాది రూపాయల ఇసుక అక్రమ రవాణా జరిగింది. అప్పట్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అక్రమ రవాణాలో ద్వితీయ స్థానంలోనూ, ములుగు జిల్లా మూడవ స్థానంలోనూ ఉండేది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీతమ్మసాగర్ పూడిక పేరుతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యధికంగా ఇసుక రీచ్ లను మంజూరు చేయడంతో అక్రమ రవాణా కూడా ఇక్కడి నుంచే ఎక్కువగా జరుగుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి.

రీచ్ ల వద్దే అక్రమాలు..
రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు, లోడింగ్, రవాణా తెలంగాణ ఖనిజాభివృద్థి సంస్థ ద్వారానే జరుగుతున్నప్పటికీ అక్రమ రవాణా జరగడం విశేషం. వినియోగదారులు ఆన్ లైన్ లో డబ్బులు చెల్లిస్తే వేబిల్లు జనరేట్ అవుతుంది. దీని ఆధారంగా కేటాయించిన ఇసుక రీచ్ లో టీజీఎండీసీ సిబ్బంది వేబిల్లు తీసి లారీ యజమానికి ఇస్తారు. వే బిల్లులో పేర్కొన్న విధంగా ఇసుక లోడింగ్ జరగాలి. కానీ ఇసుక రీచ్ లన్నీ బినామీ కాంట్రాక్టర్ల చేతుల్లో పెట్టడంతో వారే అన్ని వ్యవహారాలను చక్కబెడుతున్నారు. నకిలీ వేబిల్లులు సృష్టించి లారీలను లోడింగ్ చేయిస్తున్నారు. హైదరాబాద్ వంటి దూర ప్రాంత నగరాలకు వెళ్ళే లారీలకు నకిలీ వేబిల్లులు ఇస్తుండగా దగ్గరలో ఉన్న జిల్లా కేంద్రాలకు, ఇతర పట్టణాలకు వెళ్ళే లారీలను ఎటువంటి వేబిల్లులు లేకుండానే లోడ్ చేసి పంపిస్తున్నారు. అధికారికంగా వేబిల్లులు తీసుకున్న తర్వాత వాటి కాలపరిమితి ఒక వారం రోజుల పాటు ఉంటుంది. ఈ లారీలను సమీప పట్టణాల్లో అన్ లోడ్ చేసి మళ్ళీ రెండవసారి అదే వేబిల్లుపై ఇసుక లోడ్ చేయించుకుంటున్నారు. బినామీ కాంట్రాక్టర్లు ఇచ్చే ముడుపులు తీసుకుంటున్న టీజీఎండీసీ సిబ్బంది కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతోంది.
లారీలను తనిఖీచేసే వ్యవస్థ లేదు..
ఎప్పుడో ఒక సారి రహదారిలో వెళ్ళే వాహనాలను పోలీసులు తనిఖీ చేసే సందర్భంలో జీరో లారీలతో పాటూ, నకిలీ వేబిల్లులతో వెళ్ళే లారీలు పట్టుబడుతున్నాయి. ఇసుక లారీలను తనిఖీ చేసే ప్రత్యేకమైన వ్యవస్థ కానీ, యంత్రాంగం కానీ లేదు. గతంలో అక్కడక్కడ రవాణా శాఖ చెక్ పోస్టులుండేవి. వీటిని కూడా ఎత్తివేయడంతో ఇసుక లారీలను పట్టుకునే నాధుడే లేడు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టడానికి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన పనిచేసే జిల్లా ఇసుక కమిటీలు ఉన్నాయి.

ఈ కమిటీ సమావేశాలకు జిల్లా ఎస్పీ, జిల్లా రవాణా శాఖాధికారులను కూడా ప్రత్యేక ఆహ్యానితులుగా పిలిచే అధికారం కలెక్టర్ కి ఉంది. ఇసుక అక్రమ రవాణాను అరికట్టడానికి జిల్లా, రెవిన్యూ డివిజన్, మండల స్థాయిలో ప్రత్యేక బృందాలను నియమించే అధికారం కూడా కలెక్టర్లకు ఉంది. కానీ కొందరు కలెక్టర్లు ఈ విషయంలో అచేతనంగా ఉండటానికి రాజకీయ ఒత్తడులతో పాటూ మాఫియా ప్రలోభాలకు లొంగిపోవడం కూడా కారణమని తెలుస్తోంది.
మాఫియాను వదలి లారీ యజమానులపై కేసులు
గోదావరి నది నుంచి కోట్లాది రూపాయల ఇసుకను తరలిస్తున్న మాఫియా డాన్ ల జోలికి పోకుండా కేవలం లారీ యజమానులకు ఫైన్ లు వేసి వదలి వేయడం వివాదాస్పదంగా మారింది. బినామీ కాంట్రాక్టర్లందరూ స్వంత లారీలను కొనుగోలు చేసి తమ లారీల ద్వారానే జీరో దందా కొనసాగిస్తున్నారు. అధికారులు వీటిపైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. బినామీ కాంట్రాక్టర్ల లారీలను పట్టుకున్నప్పుడు రాజకీయ నేతల నుంచి ఫోన్ లు వస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇసుక అక్రమ రవాణా చేసిన వారే ప్రభుత్వం మారిన తర్వాత కూడా అక్రమ రవాణా కొనసాగిస్తున్నారు.
నకిలీ వేబిల్లుల వ్యవహారంలో ముందుకు సాగని దర్యాప్తు
గత ఐదారు సంవత్సరాలుగా నకిలీ వేబిల్లుల దందా కొనసాగుతున్నది. గతంలో ఏటూరు నాగారం, తాడ్వాయి. స్టేషన్ ఘనపూర్, భద్రాచలం, అశ్వాపురం, పాల్వంచ, వరంగల్ పోలీస్ స్టేషన్ల పరిథిలో నకిలీ వేబిల్లుల లారీలను పట్టుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేవలం లారీ యజమానులు, డ్రైవర్లను అరెస్టు చేశారు. టీజీఎండీసీ వేబిల్లు తరహాలోనే వేబిల్లులను సృష్టించిన వారిని కూడా అరెస్టు చేశారు.

కానీ ఆ లారీలను లోడ్ చేసిన ఇసుక రీచ్ లను నిర్వహిస్తున్న కాంట్రాక్టర్లను కానీ నకిలీ వేబిల్లుల వెనుక ఉన్న సూత్రధారులను కానీ అరెస్టు చేయలేదు. ప్రస్తుత హైడ్రా కమిషనర్ రంగనాథ్ వరంగల్ పోలీస్ కమిషనర్ గా పనిచేసిన కాలంలో ఒకే రోజు 600 ఇసుక లారీలను పట్టుకుని కేసులు నమోదు చేశారు. కానీ అక్రమ రవాణా వెనుక ఉన్న కింగ్ పిన్ లను పట్టుకోలేదు. ఈ దిశగా దర్యాప్తు కూడా కొనసాగలేదు. అక్రమ రవాణాకు కారణమని భావిస్తున్న టీజీఎండీసీలోని కింది స్థాయి సిబ్బందిని బలి చేసి పై అధికారుల జోలికి కూడా పోలేదు.
విజిలెన్స్ అధికారుల మౌనం..
ఇసుక అక్రమ లోడింగ్, రవాణాపై దర్యాప్తు జరిపి చర్యలు తీసుకునే అధికారం విజిలెన్స్ అండ్ ఎనఫోర్స్ మెంటు శాఖకి కూడా ఉన్నప్పటికీ వారు కాలు కదపక పోవడానికి అవినీతే ప్రధాన కారణమని తెలుస్తోంది. జిల్లా స్థాయి లో ఉండే విజిలెన్స్ ఇనస్పెక్టర్ నుంచి ప్రాంతీయ స్థాయిలో పనిచేసే అదనపు ఎస్పీ స్థాయి అధికారుల వరకూ అవినీతి ఊబిలో కూరుకుపోయారు. విజిలెన్స్ అధికారులను ముందుగానే కలుస్తున్న ఇసుక కాంట్రాక్టర్లు వారికి భారీగానే ముడుపులు చెల్లిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంతో విజిలెన్స్ డీజీ ఆదేశాల మేరకు ఇసుక రీచ్ లపై దాడులు నిర్వహించి తనిఖీలు చేసిన ఆ శాఖ అధికారులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ఇసుక దందా వెనుక కొందరు ప్రభుత్వ పెద్దల హస్తం ఉండడమే దీనికి కారణమని కింది స్థాయి అధికారులంటున్నారు.