- ఇసుక మాఫియాపై కొరడా ఝుళిపించిన ములుగు కలెక్టర్
- రాజకీయ ఒత్తిడులకు లొంగని వైనం
- బదిలీ చేయిస్తామంటూ ప్రగల్భాలు
ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికార యంత్రాంగంపై రాజకీయ ఒత్తిడులు రావడం సహజం. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా అభివృద్థి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూనే రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించడం, న్యాయస్థానాల తీర్పులకు లోబడి పనిచేయడం ఐఏఎస్ అధికారుల విధి. దేశంలో అఖిల భారత సర్వీసులకు చెందిన కొందరు అధికారులు మంచి పోస్టింగ్ ల కోసం నేతల అడుగులకు మడుగులొత్తడం, నిబంధలకు విరుద్ధంగా వ్యవహరించడం సర్వసాధారణంగా జరుగుతూనే ఉంది. మరికొందరు అధికారులు ముక్కు సూటిగా వ్యవరిస్తూ పాలకుల ఆగ్రహానికి గురై తరచూ బదిలీలు కావడం కూడా పరిపాటిగా మారింది. అయినప్పటికీ ప్రజల కోసం పని చేసే అధికారులు మాత్రం వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. ఈ కోవకే చెందుతారు కృష్ణ ఆదిత్య ఐఏఎస్.
2014 బ్యాచ్ కి చెందిన ఈ తెలంగాణ ఐఏఎస్ అధికారి రెండేండ్ల క్రితం ములుగు జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు పనిచేసిన ఒక ఐఏఎస్ అధికారిని మేడారం జాతర సందర్భంగా మధ్యలోనే ప్రభుత్వం బదిలీ చేసింది. అదనపు బాధ్యతలతో కొద్ది కాలం పనిచేసిన మరో అధికారి ఇసుక ఫైళ్ళపై హడావుడి నిర్ణయాలు తీసుకుని ఆకస్మికంగా వైదొలగారు. కొత్తగా ఏర్పడిన ములుగు జిల్లాను గాడిలో పెట్టాల్సిన సమయంలో కృష్ణ ఆదిత్య అక్కడ అడుగు పెట్టారు. అనతి కాలంలోనే అభివృద్థి, సంక్షేమ కార్య క్రమాలను అమలు చేయడంలో తనదైన ముద్ర వేశారు. విద్య, వైద్యం, పల్లె ప్రగతి, హరిత హారం వంటి కార్యక్రమాల అమలు కోసం జిల్లా యంత్రాంగాన్ని పరుగులు పెట్టించారు. భూపాలపల్లి కలెక్టర్ గా కొంత కాలం అదనపు బాధ్యతలు నిర్వహించారు. ఏటూరునాగారం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా కూడా ప్రస్తుతం అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
అభివృద్థి, సంక్షేమ కార్యక్రమాల అమలు కోసం నిరంతరం శ్రమిస్తున్న ఆదిత్యకు రెండు ప్రధాన సవాళ్ళు ఎదురయ్యాయి. జిల్లాలో అధిక భాగం గోదావరి తీర ప్రాంతంలో ఉండడంతో ఇసుక రీచ్ ల మంజూరు, నిర్వహణ ప్రధాన సమస్యగా మారింది. జిల్లా ఇసుక కమిటీ చైర్మెన్ గా ఇది పెద్ద సవాలుగానే చెప్పవచ్చు. వివిధ శాఖలకు పూర్తి స్థాయి అధికారులు లేక పోవడంతో కీలక నిర్ణయాల్లో జాప్యం జరుగుతున్నదని ఆయన గమనించారు. ఇసుక రీచ్ లన్నీ ఏజెన్సీ మండలాల్లో ఉండడంతో ఆదివాసీలకు లబ్ది చేకూర్చే నిర్ణయాలు తీసుకోవాలసి వచ్చింది. ‘పీసా’ చట్టం ప్రకారం ఏజెన్సీ ప్రాంతంలోని ఇసుక రీచ్ లను ఆదివాసీ సహకార సంఘాలకు కేటాయించాల్సి ఉంది. తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థకు ఇసుక రీచ్ లను జిల్లా ఇసుక కమిటీ కేటాయిస్తే ఆ సంస్థ ఆదివాసీ సహకార సంఘాలను రైజింగ్ కాంట్రాక్టర్ల పేరుతో వాటిని అప్పగిస్తున్నది. సంఘాల వద్ద పెట్టుబడులు లేక పోవడంతో అనధికారిక కాంట్రాక్టర్లు రంగ ప్రవేశం చేశారు. కొందరు దళారులు ఏజెన్సీ ప్రాంతంలో తిష్ఠ వేసి ఇసుక రీచ్ ల వ్యవహారాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారు. సహకార సంఘాలు నమోదు చేయించడం, ఇసుక రీచ్ ల కోసం సర్వే చేయించడం వంటి అన్ని పనులు తామే చేయిస్తున్నామంటూ ఆదివాసీలను నమ్మబలికి వారి వద్ద నుంచి ముందుగానే వంద రూపాయల స్టాంప్ పేపర్లపై అగ్రిమెంట్లు చేసుకున్నారు.
ఒకరిద్దరు అవినీతిపరులైన అధికారుల అండదండలు వారికి లభించాయి. జిల్లా కలెక్టర్ అధ్యతన జరిగే జిల్లా ఇసుక కమిటీల సమావేశాల్లో ఇసుక రీచ్ లు మంజూరైన తర్వాత దళారులు వాటిని అమ్మకానికి పెట్టారు. ముందుగా మంజూరైన కొన్ని ఇసుక రీచ్ లను కొందరు దళారులు రూ. 9 కోట్లకు అమ్మివేయడం ఏజెన్సీలో సంచలనం కలిగించింది. ఈ వ్యవహారంలో అధికార పార్టీకి చెందిన ఒక కీలక నేత అండదండలు తమకు ఉన్నాయని వారు ప్రచారం చేసుకున్నారు. వీరితో పాటు మరికొందరు దళారులు రంగ ప్రవేశం చేసి సహకార సంఘాలకు చెందిన 25, పట్టా భూములకు చెందిన 10 ఇసుక రీచ్ లను కోట్లాది రూపాయలకు అమ్ముకున్నారు. నిబంధల ప్రకారం నడిపితే నష్టం వస్తుందని తెలిసి కూడా కొత్త కాంట్రాక్టర్లు ముందుకు రావడం విశేషం. పర్యావరణ అనుమతుల నిబంధనల ప్రకారం సొసైటీ రీచ్ లలో మనుషులతో లోడింగ్ చేయించి ట్రాక్టర్ల ద్వారా డంపింగ్ యార్డుకు తరలించాలి. రవాణా చేసే లారీల్లో కూడా పాసింగ్ నిబంధనల మేరకే లోడింగ్ చేయాలి. ఈ విధంగా చేస్తే తమకు నష్టం వస్తుందని భావించిన కాంట్రాక్టర్లు భారీగా అక్రమాలకు తెరలేపారు. పగలూ రాత్రి తేడా లేకుండా నేరుగా గోదావరిలో టిప్పర్లు పెట్టి భారీ జేసీబీలతో ఇసుకను తరలించడం, లారీలను ఓవర్ లోడింగ్ చేయడం ద్వరా ప్రతి లారీకి రూ. 4,000 అదనంగా వసూలు చేయడం మొదలు పెట్టారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ కు కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులందాయి.
కలెక్టర్ కన్నెర్ర…
ఇసుక మాఫియా ఆగడాలపై వస్తున్న ఫిర్యాదులపై కలెక్టర్ కృష్ణ ఆదిత్య కన్నెర్ర చేశారు. అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. అదనపు కలెక్టర్ స్థాయి నుంచి వీఆర్వో స్థాయి వరకూ పలువురు అధికారులు, సిబ్బందితో విజిలెన్స్ టీమ్ లను ఏర్పాటు చేశారు. ఏటూరునాగారం ఐటీడీఏలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయించి ఆదివాసీ సహకార సంఘాలకు దిశా నిర్దేశం చేయించారు. నిబంధనల ప్రకారం ఇసుక రీచ్ లను నిర్వహిస్తామాని రాత పూర్వక హామీలు తీసుకున్నారు. ఓవర్ లోడింగ్ తో వచ్చే లారీలను గోదావరి బ్రిడ్జి వద్ద, చిన్న బోయినపల్లి వద్ద తనిఖీలు చేయించి కఠిన చర్యలు తీసుకున్నారు. దీనితో మాఫియా ఆగడాలకు తాత్కాలికంగా తెర పడింది. అయినప్పటికీ అధికారుల కళ్లు కప్పి కొందరు అక్రమార్కులు రాత్రి వేళల్లో టిప్పర్లు, జేసీబీలతో దందా చేస్తున్నారు. ఇటువంటి అక్రమాలు తర దృష్టికి వస్తే అధికారులపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ఇసుక వ్యవహారంలో కలెక్టర్ పై ఒత్తిడిలు పెరుగుతూనే ఉన్నాయి. ఇద్దరు మంత్రులు, ఒక ఎమ్మెల్సీ నుంచి ఫోన్ లు వచ్చినట్టు సమాచారం. తాను ప్రభుత్వ నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తున్నానని కలెక్టర్ వారికి నచ్చ చెప్పినట్టు అధికార వర్గాల ద్వారా తెలిసింది.
నేతల నోట్లో పచ్చి వెలక్కాయ…
కలెక్టర్ వ్యవహారం మింగుడు పడని కొందరు నేతలు ఆయన బదిలీ అవుతున్నారంటూ ప్రచారం చేస్తున్నారు. రెండు సంవత్సరాలు సర్వీసు పూర్తి చేసుకున్న కలెక్టర్ బదిలీ రొటీన్ గా జరిగితే జరగవచ్చు. లేదా మరికొంత కాలం ఆయన కొనసాగ వచ్చు. కానీ అయన ఉంటే ఇసుక మాఫియా ఆటలు కొనసాగవని భావిస్తున్న కొందరు వ్యక్తులు హైదరాబాద్ స్ధాయిలో ఒత్తిడి పెంచే పనిలో పడ్డారు. కలెక్టర్ వైఖరితో ఇసుక రీచ్ లు ఆగిపోయాయని, ప్రభుత్వ ఆదాయానికి రూ. 350 కోట్లు నష్టం వాటిల్లిందని ఒక కార్పొరేషన్ చైర్మైన్ ఇటీవల మీడియాకు చెప్పారు. ఈ ఆరోపణల్లో నిజం లేదని సీఎస్ భావించారు. నిజానికి ములుగు జిల్లా లోనే ఎక్కువ ఇసక రీచ్ లను మంజూరు చేశారు. వీటి ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం వస్తున్నది. ఏటూరు నాగారం వన్యప్రాణుల అభయారణ్యంలో మంజూరు చేసిన కొన్నిఇసుక రీచ్ లను అటవీ అధికారులు నిలిపివేస్తే వీటి విషయంలో కూడా కొందరు నేతలు కలెక్టర్ పై అసత్య ఆరోపణలు చేశారు.
మేడారంలోనూ తనదైన ముద్ర
రెండేండ్ల కొకసారి జరిగే మేడారం జాతర కలెక్టర్ కు అగ్ని పరీక్షగా మారింది. దేశంలోని రెండవ అతి పెద్ద ఈవెంట్ గా పేరుగాంచిన ఈ జాతర ఏర్పాట్లను కూడా రికార్డు సమయంలో పూర్తి చేయించి రాష్ట్ర ప్రభుత్వ ప్రశంసలను కలెక్టర్ అందుకున్నారు. అవినీతికి తావు లేకుండా అక్రమార్కులను దరి చేరనీయకుండా తనదైన శైలిలో ఆయన జాతరను విజయవంతం చేశారు. మేడారం జాతరకు ప్రత్యేక అధికారులను పంపే సాంప్రదాయం గతంలో ఉండేది. జాతర సమయంలో పని చేసిన పూర్వ కలెక్టర్లను, సీనియర్ ఐఏఎస్ అధికారులను ప్రత్యేక పర్యవేక్షకులుగా గతంలో నియమించేవారు. ఇటీవల జరిగిన జాతరలో ప్రత్యేక అధికారులను నియమించలేదు. సీఎస్ పర్యవేక్షణలో కలెక్టర్ ఒక్కరే అన్నీ తానై చూసుకున్నారు.
భద్రాద్రి కొత్తగూడెంలో..
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇసుక రీచ్ లను నడిపిస్తూ ఇసుక మాఫియాపై ములుగు జిల్లా కలెక్టర్ ఉక్కు పాదం మోపితే పొరుగున ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మాత్రం ఇసుక మాఫియా చెలరేగి పోతున్నది. ఈ జిల్లా లోని ఇసుక కాంట్రాక్టర్లకు ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే కొమ్ము కాస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జేసీబీలు, టిప్పర్లు వినియోగిస్తూ ఇసుక తవ్వకాలు కొనసాగిస్తున్నా, మూడు నుంచి నాలుగు బకెట్లు ఓవర్ లోడింగ్ చేస్తున్నా అధికార యంత్రాంగం నోరు మెదపడం లేదనే విమర్శలు పెల్లుబుకుతున్నాయి. ఇసుక మాఫియాపై ఎన్ని ఆరోపణలు వచ్చినా, ఆదివాసీలు నష్టం జరుగుతున్నా అధికార యంత్రాంగం స్పందించక పోవడాన్ని జిల్లా ప్రజలు తప్పు పడుతున్నారు. భద్రాద్రి జిల్లా నుంచి ఓవర్ లోడింగ్ తో వచ్చే లారీలను కూడా ములుగు జిల్లా కలెక్టర్ పట్టించడంతో అవి పాల్వంచ మీదుగా దారి మళ్ళించడం విశేషం.
-కొండూరి రమేష్ బాబు