A place where you need to follow for what happening in world cup

మాఫియా డైరెక్షన్.. అధికారుల యాక్షన్… ఏజెన్సీ ఇసుక రీచ్ లలో దళారులదే రాజ్యం

  • ఆదివాసీ మహిళా సాధికారితకు అడుగడుగునా అడ్డంకులు
  • యంత్రాల కాంట్రాక్టు ఎంపానెల్మెంట్ కు బ్రేక్
  • పైలెట్ ప్రాజెక్టు పేరుతో ఆరంభ శూరత్వం

ఆదివాసీ మహిళా సాధికారిత మరో సారి అపహాస్యం పాలయ్యింది. ఏజెన్సీ ఇసుక రీచ్ లలో దళారుల ప్రమేయాన్ని తొలగించాలని ఆదివాసీ సంఘాలు చేస్తున్న డిమాండ్ తో అధికారుల్లో కొంత కదలిక వచ్చినప్పటికీ అది ఆరంభశూరత్వంగా మిగిలిపోయింది. ఆదివాసీ మహిళా సహకార సంఘాలకు యంత్రపరికరాలు సమకూర్చాలనే అధికారుల ప్రయత్నానికి ఇసుక మాఫియాతో పాటూ రాజకీయ నేతలు కూడా మోకాలడ్డారు. ఫలితంగా వందల కోట్ల రూపాయల విలువ చేసే ఇసుక రీచ్ ల పనులను బినామీలే నిర్వహిస్తున్నారు. షెడ్యూల్డు ప్రాంతాలకు పంచాయితీరాజ్ విస్తరణ (పీసా) చట్టం ప్రకారం ఇసుక సహా చిన్న తరహా ఖనిజాలు ఆదివాసీలకే దక్కాల్సి ఉంది. చట్ట ప్రకారం ఇసుక రీచ్ లను ఆదివాసీ సహకార సంఘాలకు పూర్తిగా అప్పగించకుండా తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థకే కేటాయిస్తున్నారు.

ఆదివాసీ సహకార సంఘాలను కేవలం రైజింగ్ కాంట్రాక్టర్లుగా పిలుస్తూ నామ మాత్రంగా చెల్లింపులు చేస్తున్నారు. క్యూబిక్ మీటర్ ఇసుకను రూ. 650 లకు ప్రభుత్వం అమ్ముతుండగా సహకార సంఘాలకు కేలం రూ. 220 మాత్రమే చెల్లిస్తున్నారు. ఇసుక తవ్వకాలు, లోడింగ్ పనుల కోసం అధికారులు బినామీ కాంట్రాక్టర్లు నియమించి క్యూబిక్ మీటర్ కు రూ. 180 చెల్లిస్తున్నారు. ఇది పోను సహకార సంఘాలకు కేవలం రూ. 40 మాత్రమే బోనస్ రూపంలో వస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కాలం నుంచీ గత 12 సంవత్సరాలుగా బినామీ కాంట్రాక్టర్ల వ్యవస్థ కొనసాగుతుండగా వందల కోట్ల రూపాయలను అనధికారికంగా ప్రభుత్వం వీరికి చెల్లించింది. ఈ భారీ స్కాం లో అధికార పార్టీ నేతలతో పాటూ ఉన్నతాధికారుల హస్తం కూడా ఉంది.

నవ్వుల పాలైన సాధికారిత..
ఆదివాసీ మహిళా సాధికారిత మరోసారి నవ్వుల పాలైంది. ఇసుక తవ్వకాలు, రవాణా లోడింగ్ పనుల్లో బినామీ కాంట్రాక్టర్లను తొలగించి సహకార సంఘాల ద్వారా పనులు చేయించాలంటే ముందుగా వారికి యంత్రపరికరాలు, పెట్టబడి కల్పించాలి. జిల్లా కలెక్టర్లు, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులు ఈ పని చేయాల్సి ఉంది. ట్రైకార్, బ్యాంకులతో మాట్లాడి సాధికారిత కల్పించాలని ఆదివాసీ సంఘాలు డిమాండ్ చేస్తునే ఉన్నాయి. ఇసుక రీచ్ లలో దళారుల ప్రమేయాన్ని తగ్గించి మహిళా సహకార సంఘాలకే అప్పగించాలని ఎవరు ప్రతిపాదించారో తెలియదు కానీ మహిళా సహకార సంఘాలకు శిక్షణ పేరుతో భద్రాచలం, ఏటూరునాగారం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులు నానా హంగామా చేశారు. అయినా అది కేవలం ఫోటో సెషన్ గా మిగిలిపోయింది. సీతమ్మసాగర్ ప్రాజెక్టు పేరుతో దాదాపు రూ. 1,500 కోట్ల రూపాయల ఇసుక తవ్వకాల కోసం అనుమతుల నిచ్చినప్పుడు కూడా ఆదివాసీ సాధికారిత పేరు వినిపించింది.

ఈ దశలోనే ప్రభుత్వ పెద్దలతో పాటూ మాఫియా కూడా అడ్డుతగిలింది. సీతమ్మసాగర్ పూడిక పేరుతొ మంజూరు చేసిన 2.8 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుకలో కనీసం 40 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వకాలు, లోడింగ్, రవాణా దళారులు లేకుండా ఆదివాసీ సహకార సంఘాల ద్వారా నిర్వహించాలని భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ నిర్ణయించారు. కానీ ఎవరి ఒత్తిడులకో తలొగ్గి వెనకడుగు వేశారు. మణుగూరు మండలంలోని రామానుజపురం ఇసుక రీచ్ లో ఒక లక్ష క్యూబిక్ మీటర్లు, చర్ల మండలంలోని గొమ్ముగూడెం ఇసుక రీచ్ లో ఒక లక్ష క్యూబిక్ మీటర్లు పైలట్ ప్రాజెక్టు పేరుతో దళారులు లేకుండా నడిపించాలని అధికారులు నిర్ణయించారు. అయినప్పటికీ వారికి ప్రభుత్వం తరపున పెట్టుబడి కానీ యంత్రాలు కానీ ఇప్పించలేదు. రామానుజపురం ఇసుక రీచ్ లో పైలట్ ప్రాజెక్టు అమలుకు నోచుకోలేదు.

గొమ్ముగూడెంలో బినామీల హల్ చల్..
దళారుల ప్రమేయం లేకుండా నిర్వహించాలని నిర్ణయించిన చర్ల మండలంలోని గొమ్ముగూడెం ఇసుక రీచ్ ని గత సంవత్సరం భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్ ప్రారంభించారు. కానీ అక్కడ కూడా బినామీలే హల్ చల్ చేశారు. యంత్ర పరికకాలు వేరే సమకూర్చారు. ప్రారంభోత్సవ ఏర్పాట్లను కూడా వారే పర్యవేక్షించారు. చివరికి ప్రారంభోత్సవంలో కూడా వారే ప్రత్యక్షమయ్యారు. ఈ రీచ్ ని కూడా బినామీల కనుసన్నల్లోనే నడిపించారు. లక్ష్యం నెరవేరక పోగా అధికారులు విమర్శలపాలయ్యారు.

యంత్రాల ఎంపానెల్మంట్ కు బ్రేక్ వేసిందెవరు? ఆదివాసీ ఇసుక సహకార సంఘాల్లో దళారుల ప్రమేయాన్ని తగ్గించడం కోసం వారికి యంత్ర పరికరాలను సమకూర్చాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ నిర్ణయించగా దీనిలో భాగంగా ఇసుకను తవ్వి లోడింగ్ చేయడానికి ప్రొక్లెయనర్లు, జెసీబీలు, టిప్పర్ల కాంట్రాక్టు కోసం ఐటీడీఏ ద్వారా ప్రకటన ఇచ్చారు. అర్హులైన గిరిజన కాంట్రాక్టర్లు ఎంపానెల్మెంట్ ప్రక్రియలో కేవలం గిరిజనులు నిర్వహించే సంస్థలు పాల్లగొనాలని కోరారు. ఎంపానెల్మెంట్ కోసం కాంట్రాక్టర్లకు నిర్ణయించిన అర్హతలు గిరిజన కాంట్రాక్టర్లకు ఉండక పోవడంతో ఎక్కువ మంది పాల్గొన లేదు.

గిట్టుబాటు కాని ధరలతో కొటేషన్లు నిర్ణయించడంతో అధికారులు విమర్శల పాలయ్యారు. అధికారులు చేసిన ప్రయత్నాలన్నీ పరోక్షంగా బినామీ కాంట్రాక్టర్లకు మేలు చేసే విధంగా ఉన్నాయని గిరిజన సంఘాలు విమర్శించాయి. ఎంపానెల్మంట్ ప్రక్రియను పూర్తి చేయకుండానే దీనిని మధ్యలోనే నిలిపివేశారు. ఇసుక మాఫియా ఒత్తిడితోనే ఇదంతా జరిగిందని తెలిసింది. మాఫియాకు మేలు చేయడానికి అధికార పార్టీ నేతలు తలదూర్చడంతో ఆదివాసీ సాధికారిత అటకెక్కింది. అధికారులు నవ్వులపాలయ్యారు. ములుగు జిల్లాలో సాధికారిత కేలం శిక్షనా కార్యక్రమాలకే పరిమితమయ్యింది.

Leave A Reply

Your email address will not be published.