- ఇసుక ర్యాంపులతో పర్యావరణ జీవన విధ్వంసం
- భద్రాద్రి, ములుగు జిల్లాల్లో దెబ్బతిన్న ప్రధాన రహదారులు
- పంట పొలాలన్నీ ఇసుక మయం
- రోడ్డు ప్రమాదాలతో పలువురు మృతి
- విల విల్లాడుతున్న ఏజెన్సీ గ్రామాలు
గోదావరి నది ఇసుక కయ్యలుగా మారి పోయిన వేళ భద్రాద్రి, ములుగు జిల్లాల ప్రజల జీవనం నరకప్రాయంగా మారి పోయింది. రెండు జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతంలో ఎటు చూసినా ఇసుక లారీలే దర్శనమిస్తున్నాయి. వేలాది లారీల రాక పోకలతో ప్రధాన రహదారులన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయి. ఫలితంగా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతున్నది. వందేళ్ళ క్రితం బ్రిటీష్ పాలకులు నిర్మించిన వంతెనలతో పాటూ ఇటీవల నిర్మించిన వంతెనలు, కల్వర్టులు బీటలు వారడం, కుంగిపోవడం జరిగింది. ఇసుక లారీలతో వస్తున్న దుమ్ము, ధూళి ఏజెన్నీ గ్రామాలపై పడి ప్రజారోగ్యానికి పూర్తిగా ముప్పు వాటిల్లే పరిస్థితి ఏర్పడింది. ఇసుక లారీలో ఢీకొనడంతో పలువురు మృత్యువాత పడ్డారు. ఇదంతా పాలకులు సృష్టిస్తున్న పర్యావరణ జీవన విధ్వంసంగా చెప్పవచ్చు.

గోదావరి పరీవాహక ప్రాంతం భద్రాద్రి కొత్తగూడెం, ములుగు ఏజెన్సీలోనే ఉంది. ఫలితంగా ఈ ప్రాంతాన్ని ప్రభుత్వం ఆదాయ వనరుగా ఎంచుకుంది. గతంలో పర్యావరణ అనుముతులు పొందిన కొన్ని ఇసుక రీచ్ లు మాత్రమే నిబంధనల ప్రకారం నడిచేవి. కానీ గత రెండు సంవత్సరాల నుంచి దొడ్డి దారిలో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. పర్యావరణ అనుమతులు లేని కారణంగా ఎన్టీటీ ఆదేశాలతో నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయిన సీతమ్మసాగర్ (దుమ్ముగూడెం) ప్రాజెక్టు వెనుక భాగంలో పూడిక పేరుతో భారీ యంత్రాలతో చేస్తున్న ఇసుక తవ్వకాలు వివాదాస్పదంగా మారాయి. పర్యావరణాన్ని, ప్రజారోగ్యాన్ని పట్టని పాలకులు ఇసుక రీచ్ లను మాఫియా చేతికి అప్పగించి ప్రజలపై పెనుభారం మోపుతున్నారు. భద్రాచలం నుంచి వెంకటాపురం వరకు గల 100 కిలోమీటర్ల రహదారి పూర్తిగా దెబ్బతింది. ఫలితంగా అత్యవసర పరిస్థితిలో రోగులు భద్రాచలం వెళ్ళాలన్నా సాధ్యం కావడం లేదు.

ఈ రహదారిలో ఆర్టీసీ బస్సులు కానీ అంబులెన్స్ లు కానీ తిరగడం లేదు. కనీసం రూ. 100 కోట్లు కేటాయించి ఈ రహదారిని పునర్నిమ్మిస్తే తప్ప నాలుగు మండలాలకు రాక పోకలు కొనసాగించడం కష్టమేనని చెప్పవచ్చు. భద్రాచలం, పినపాక నియోజకవర్గాల్లోని అన్ని రహదారుల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. సీతమ్మ సాగర్ పూడిక పేరుతో జరుగుతున్న ఇసుక దందాతో వేలాది లారీలు చర్ల, మణుగూరు ప్రాంతాల నుంచి రోజూ హైదరాబాద్ వెళ్తున్నాయి. ఈ లారీలను చూసి వాహనదారులు భయభ్రాంతులవుటున్నారు.
సంపదను దోచి విధ్వంసాన్ని మిగిల్చి..
రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్ లో ఉన్న ఏజెన్సీ ప్రాంతంలో ‘పీసా’ చట్టం అమల్లో ఉంది. ఇసుక సహా చిన్నతరహా ఖనిజాలన్నీ ఆదివాసీలకే దక్కాల్సి ఉంది. కానీ దీనికి భిన్నంగా ప్రభుత్వం ఖజానా నింపుకుని ఆదివాసీలకు తీరని ద్రోహం చేస్తోంది. ఇసుక తవ్వకాలను రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ద్వారా ఆదివాసీ సహకార సంఘాలకు పేరుకు కేటాయిస్తున్నప్పటికీ పరోక్షంగా బినామీ కాంట్రాక్టర్ల చేతిలో పెడుతోంది. యజమానులు కావలసిన ఆదివాసీలు తమ ఇసుక రీచ్ ల లోనే కూలీలుగా కాలం గడుపుతున్నారు.

ఆదివాసీల సంపదను దళారులకు దోచి పెట్టడంలో అధికార పార్టీ పెద్దలతో పాటూ అధికారుల పాత్ర కూడా ఉంది. ఇసుక తవ్వకాలను బినామీ కాంట్రాక్టర్ల చేతిలో పెట్టిన ఖనిజాభివృద్ధి సంస్థ ప్రేక్షక పాత్ర నిర్వహిస్తుండగా మాఫియా రాజ్యమేలుతోంది. గోదావరి నదిలో నిబంధనలకు విరుద్ధంగా భారీ యంత్రాలతో 20 నుంచి 30 అడుగుల లోతులో ఇసుక తవ్వడం, లారీల వద్ద అక్రమ వసూళ్ళకు పాల్పడడం వంటి విమర్శలు ఎన్ని వచ్చినా జిల్లా కలెక్టర్లు సహా అధికారులేవరూ పట్టించుకోరు. మీడియాలో వచ్చిన కథనాలను పట్టించుకోవద్దని ఒక ఉన్నతాధికారే చెప్పారని కాంట్రాక్టర్లు బహిరంగంగా అంటున్నారు.
రాజ్యాంగ పరిధిలో చట్ట ప్రకారం పనిచేయాల్సిన అధికారులే పర్యావరణ జీవన విధ్వంసానికి కారణం కావడం విశేషం. ములుగు జిల్లాలో పర్యావరణ అనుమతులు తీసుకున్న మంగపేట, వెంకటాపురం మండలాల్లోని 9 ఇసుక రీచ్ లలో బినామీ కాంట్రాక్టర్లు భారీగా అక్రమాలకు పాల్పడినా అధికారులు అటు కన్నెత్తి చూడక పోవడంతో విమర్శల పాలయ్యారు. పర్యావరణ అనుమతులకు విరుద్ధంగా యంత్రాలతో ఇసుక తవ్వకాలు జరిపి డంపింగ్ యార్డులకు తరలించకుండా నేరుగా నదిలోనే ఇసుక లోడ్ చేయడం వంటి భారీ అక్రమాలకు కాంట్రాక్టర్లు తెరలేపారు.

పంటలకు భారీ నష్టం..
గోదావరిలో అక్రమంగా జరుగుతున్న ఇసుక తవ్వకాలతో భూగర్భ జలాలు ఇంకిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మరో వైపు ఇసుక లారీల కోసం ప్రధాన రహదారి నుంచి ర్యాంపుల వరకూ వేసిన మట్టి రోడ్లతో సమీపంలోని పంట పొలాలకు తీరని నష్టం జరుగుతోంది. మిర్చి వంటి వాణిజ్య పంటలు దెబ్బతింటున్నాయి.
అనారోగ్యం పాలవుతున్న ఆదివాసీలు..
వేలాది లారీలతో రేగుతున్న దుమ్ము ధూళి రహదారుల పక్కన ఉన్న గ్రామాలపై పడి ఆదివాసీలు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. పిల్లలకు ఊపిరితిత్తుల వ్యాధులు సోకుతున్నాయి. లారీల వెనుక వెళ్ళే ప్రయాణీకుల పరిస్థితి మరింత దుర్భరంగా ఉంటోంది. వంద కిలోమీటర్ల దూరాన్ని ఐదారు గంటలు ప్రయాణం చేయవలసి వస్తోంది.
రాత్రి వేళల్లో అత్యవసరంగా ఎక్కడికైనా వెళ్ళాలన్నా వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది.
ప్రభుత్వానికి ఆదాయం.. ఆదివాసీలకు నష్టం
ఖజానా నింపుకునే ప్రయత్నంలో ఆదివాసీలకు తీవ్ర నష్టం కలిగిస్తున్న ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు తీసుకోకపోవడం విచారకరం. గతంలో భూపాల పల్లి, పెద్దపల్లిజిల్లాల్లో భారీగా ఇసుక తవ్వకాలు జరిగేవి. గోదావరి నదిపై నిర్మించిన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల పూడిక పేరుతో ఇసుక దందా చేసిన గత ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పారు. ఇప్పుడు ఇదే పరంపరను భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో కొనసాగిస్తున్నారు.

ఆదివాసీలనే బెదిరిస్తున్న అధికారులు..
ప్రాణనష్టం, ఆస్తి నష్టం కలిగిస్తున్న ఇసుక తవ్వకాలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోక పోగా లారీలను ఆపిన వారిపై కేసులు పెడతామని పోలీసులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. రహదారులు దెబ్బతినడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఆదివాసీ గ్రామాల వారు ఇటీవల లారీలను నిలిపివేశారు. రహదారులు మరమ్మత్తులు చేస్తామంటూ తాత్కాలిక హామీలిచ్చి అధికారులు కాలయాపన చేస్తున్నారు.
ఖనిజాభివృద్ధి నిధులేవి?
ఇసుక తవ్వకాలపై వస్తున్న ఆదాయంలో కొంత భాగం జిల్లా ఖనిజాభివృద్ధి నిధికి జమ అవుతున్నాయి. భద్రాద్రి, ములుగు జిల్లాల్లో రూ. వంద కోట్లకు పైగా ఈ నిధులు ఉన్నప్పటికీ రహదారుల నిర్మాణానికి, ప్రజారోగ్యానికి వీటిని ఖర్చు పెట్టడం లేదు. ఏజెన్సీ ప్రాంతం నుంచి వెళ్తున్న ప్రతి ఇసుక లారీ నుంచి రూ. 250 రహదారి నిధి కోసం కేటాయిస్తారు. గత పదేండ్ల కాలంలో కోట్లాది రూపాయలు రహదారి నిధికి వెళ్ళినా ఆ నిధులను ఇతర ప్రాంతల్లో ఖర్చు పెడుతూ ఏజెన్సీ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు.