A place where you need to follow for what happening in world cup

అధికార నేత.. ఇసుక మేత…

  • సీతమ్మసాగర్ పూడిక పేరుతో అక్రమాలు
  • అధికారులపై అమాత్యుడి ఒత్తిడి
  • సీఎం శాఖలో జొరబడిన వైనం
  • 6 లక్షల క్యూబిక్ మీటర్ల తవ్వకాలకు తాజా అనుమతులు
  • నిబంధనలు బేఖాతర్
  • ఆదివాసీ సొసైటీలకు మొండి చెయ్యి

ఇసుక రుచి తెలిసిన కాంట్రాక్టర్ నేతగా మారి అధికార పార్టీలో కీలక స్థానంలో ఉంటే అతని ప్రభావం ఏవిధంగా ఉంటుందో ఊహించవచ్చు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇదే జరుగుతోంది. ఎన్జీటీ ఆదేశాలతో నిర్మాణమే పూర్తికాని సీతమ్మసాగర్ (దుమ్ముగూడెం) ప్రాజెక్టులో పూడిక పేరుతో కన్నేసిన బడా నేత కోసం అధికార యంత్రాంగం దాసోహం కావడం సంచలనం కలిగిస్తున్నది. ప్రజల నుంచి చీత్కారం ఎదురైనా, కార్యకర్తలు దూరమవుతున్నా పట్టించుకోని నేతలు కేవలం ఇసుక మీద వచ్చే అక్రమార్జన కోసం అర్రులు చాచడంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఒక అమాత్యుడి ఆదేశాలతో ఇటీవల జరిగిన ఇసుక కేటాయింపుల వ్యవహారం ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళినా పరిస్థితిలో ఎటువంటి మార్పు రాలేదు. ప్రాజెక్టు పూడిక పేరుతో చర్ల మండలంలోని కొత్తపల్లి వద్ద మరో ఆరు లక్షల క్యూబిక్ మీటర్ ఇసుకను తవ్వుకోవడానికి భద్రాద్రి జిల్లా ఇసుక కమిటీ ఇటీవల తీర్మానించింది. కలెక్టర్ అధ్యక్షతన పనిచేస్తున్న జిల్లా ఇసుక కమిటీ నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్న కేటాయింపుల వ్యవహారం రాష్ట్ర స్థాయిలో వివాదాస్పదంగా మారింది. మరో వైపు పర్యావరణ అనుమతుల వచ్చిన జిల్లాలోని 17 ఇసుక రీచ్ ల ఫైళ్ళను పక్కన పెట్టించడం కూడా వివాదాస్పదంగా మారింది. ఆదివాసీ రీచ్ లు నడిస్తే తమ అనుయాయుల అక్రమ వ్యాపారానికి గండి పడుతుందనే అభిప్రాయంతోనే వాటిని నిలిపివేయమని కీలక నేత కలెక్టర్ ను ఆదేశించినట్లు తెలిసింది. ఈ విషయం అధికార వర్గాల ద్వారా తెలుసుకున్న ఆదివాసీ సహకార సంఘాలు న్యాయ పోరాటానికి సన్నద్ధమవుతున్నాయి.

చట్ట విరుద్ధంగా కేటాయింపులు..
రాష్ట్రంలో అమల్లో ఉన్న ‘వాల్టా’ చట్టంతో పాటు ప్రాజెక్టుల్లో పూడిక కోసం గనుల శాఖ జారీ చేసిన జీవో నంబర్ 54 కు విరుద్ధంగా సీతమ్మసాగర్ లో ఇసుక తవ్వకాలకు అనుమతులను ఇస్తున్నారు. కనీస నిబంధనలను పాటించడం లేదు. సాగునీటి ప్రాజెక్టుల్లో తీసే ఇసుకను కేవలం ప్రాజెక్టు పనులకే కేటాయించాలని, వాణిజ్యపరమైన అవసరాల కోసం దీనిని వినియోగించవద్దని జీవోలో పేర్కొన్నారు. మైనింగ్ శాఖ పర్మిట్లతో నీటిపారుదల శాఖ మాత్రమే ఇసుక తవ్వకాలు, రవాణా చేపట్టవలసి ఉండగా దీనికి విరుద్ధంగా తెలంగాణ ఖనిజాభివృధ్థి సంస్థకు ఇసుక తవ్వకాలను కేటాయించారు. దొడ్డిదారిలో బినామీ కాంట్రాక్టర్లకు అప్పగించారు. బినామీ కాంట్రాక్టర్లంతా మంత్రి అనుచరులు కావడంతో అధికారులు వారి అడుగులకు మడుగులొత్తుతున్నారు. వాల్టా చట్టం ప్రకారం గోదావరి నదిపై ఎనిమిది మీటర్ల లోపు మందంతో ఇసుక ఉంటే ఒక మీటర్ వరకూ ఇసుకను తవ్వుకోవచ్చు. సీతమ్మ సాగర్ ముంపు ప్రాంతంలో 5 నుంచి 6 మీటర్ల మందంలో ఇసుక మేట ఉన్నదని పేర్కొన్న నీటిపారుదల శాఖ దీనిలో రెండున్నర మీటర్ల వరకూ ఇసుక తవ్వుకోవచ్చని అనుమతిచ్చింది. జీవోలోని నిబంధనలను చూసుకోని కలెక్టర్ కూడా కింది స్థాయి అధికారుల సిఫారసు ఆధారంగా లక్షలాది క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వకాలకు అనుమతులనిచ్చి వివాదంలో కూరుకుపోయారు.

అక్రమ రవాణాతో కోట్లు గడించే టార్గెట్..
రెండవ సారి ఆరు లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వకాలకు అనుమతి పొందిన బినామీ కాంట్రాక్టర్లు అక్రమ రవాణా ద్వారా రూ. కోట్లు గడించేందుకు స్కెచ్ వేశారు. నేరుగా నదిలోనే టిప్పర్లను లోడ్ చేయడం, జీరో దందా, ఒక వే బిల్లుపై రెండు సార్లు రవాణా, ఓవర్ లోడింగ్ వంటి అక్రమాలకు పాల్పడి భారీగా లబ్ది పొందలని చూస్తున్నారు. అందుకే కీలక నేతకు 40 శాతం గుడ్ విల్ వాటా ఇస్తున్నట్లు తెలిసింది.

ఆంధ్రా కాంట్రాక్టర్ తో అంటకాగిన నేత..
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన బస్వాపూర్ రిజర్వాయర్ పనులను జగన్ ప్రభుత్వంలోని మంత్రి దక్కించుకోగా అక్కడ సబ్ కాంట్రాక్టర్ గా పనిచేసిన ప్రస్తుత కాంగ్రెస్ నేత ఇసుక అక్రమ రవాణాకు పాల్పడినట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఇదే అనుభవంతో మళ్ళీ ఇసుక దందాపై సదరు నేత కన్నేసిట్లు తెలుస్తోంది. కీలక నేత ఇసుక దందాపై ఇంటెలిజెన్స్ నివేదిక సీఎంకి చేరినట్లు తెలిసింది. ఇసుక వ్యాపారం జోలికి పోవద్దని ఇప్పటికే సీఎం ఆదేశించినా వరంగల్, ఖమ్మం జిల్లాల నేతలు పెడచెవిన పెట్టడంతో వీరికి త్వరలో కౌన్సిలింగ్ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు తెలిసింది.

Leave A Reply

Your email address will not be published.