A place where you need to follow for what happening in world cup

బినామీల చేతుల్లో రూ 1,500 కోట్ల ఇసుక..

  • నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టు పనులు
  • అధికార పార్టీ నేతల అండదండలు
  • అధికారుల పాత్రపైనా అనుమానాలు
  • సీతమ్మసాగర్ పూడిక పేరుతో దందా
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ స్కామ్

గోదావరిలో పూడిక పేరుతో వందల కోట్ల రూపాయల భారీ ఇసుక స్కామ్ కు సర్కారు తెరలేపింది. ఎన్టీటీ ఆదేశాలతో నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయిన సీతమ్మసాగర్ (దుమ్ముగూడెం) ప్రాజెక్టు ముంపు ప్రాంతంలో 20 ఇసుక రీచ్ లను మంజూరు చేసి బినామీ కాంట్రాక్టర్ల చేతుల్లో పెట్టింది. కాంట్రాక్టు నిబంధనలకు విరుద్ధంగా ఏకపక్షంగా జరిగిన ఇసుక రీచ్ ల కేటాయింపుల్లో అధికార పార్టీ నేతల హస్తం ఉండటంతో అధికారులు కూడా వారి అడుగులకు మడుగులొత్తుతున్నారు.పూర్తి కానీ ప్రాజెక్టుకు పూడిక ఎలా వచ్చిందనే సందేహం ఎవరికైనా వస్తుంది. కానీ ఇసుక అమ్ముకోవడానికి ప్రభుత్వం కనిపెట్టిన దొడ్డిదారి వ్యవహారమే ఈ ‘పూడిక’ అని స్పష్తమవుతుంది.

సాధారణంగా నదుల్లో ఇసుక తవ్వకాలు చేపట్టాలంటే పర్యావరణ అనుమతులు అవసరం. కేంద్ర ప్రభుత్వం నియమించే పర్యావరణ కమిటీలు ఈ అనుమతులను ఇస్తాయి. కానీ అనేక నిబంధనలతో కూడిన ఈ అనుమతులతో భారీగా ఇసుక తవ్వి దానిని అమ్మడం కష్టతరమే అని చెప్పవచ్చు. పైగా ఇసుక తవ్వకాలకు యంత్రాలను వినియోగించవద్దనే నిబంధన కూడా ఉంది. ఫలితంగా ఆశించిన మేరకు ఇసుక తవ్వకాలు జరగవు. ప్రభుత్వానికి కూడా ఆదాయం తక్కువగా వస్తుంది. ఇదంతా ఎందుకని పూడిక పేరుతో అక్రమ దందాకు సర్కారు తెరలేపింది. నదుల్లో, రిజర్వాయర్లలో పూడిక తీయడానికి పర్యావరణ అనుమతులు అవసరం లేదనే కేంద్ర ప్రభుత్వ నిబంధనను తమకు అనుకూలంగా మార్చకున్న రాష్ట్ర ప్రభుత్వం అక్రమ దందాకు తెరలేపింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మేడిగడ్డ, అన్నారం ప్రాజెక్టుల వద్ద పూడిక పేరుతో అక్రమాలకు శ్రీకారం చుట్టగా ప్రభుత్వం మారిన తర్వాత కూడా ఇదే వ్యవహారం కొనసాగుతోంది.

గోదావరి నది పరీవాహక ప్రాంతమంతా ఏజెన్సీలో ఉంది. ఇసుక సహా చిన్నతరహా ఖనిజాలపై ఆదివాసీలకే పూర్తి హక్కు ఉంది. ఇసుక తవ్వకాలతో వచ్చే ఆదాయమంతా వారికే దక్కవలసి ఉండగా దీనికి భిన్నంగా ఏజెన్సీ ప్రాంతాన్ని కూడా ప్రభుత్వం ఆదాయ వనరుగా మార్చుకుంది. రాష్ట్రంలో ఇసుక తవ్వకాల కోసం తెలంగాణ ప్రభుత్వం 2014 లో కొత్త ఇసుక పాలసీ అమల్లోకి తెచ్చింది. ఈ మేరకు మైనింగ్ శాఖ జీవో నంబర్ 38, జీవో నంబర్ 3 పేరుతో రెండు జీవోలను విడుదల చేసింది. ఏజెన్సీ ప్రాంతంలోని నదుల్లో ఇసుక తవ్వకాలకు జిల్లా కలెక్టర్ చైర్మన్ గా ఉన్న జిల్లా ఇసుక కమిటీలకే అధికారం కట్టబెట్టారు. ముందుగా వివిధ శాఖలు సాంకేతిక సంయుక్త సర్వే పూర్తి చేసిన తర్వాత ఆ నివేదికల ఆధారంగా జిల్లా ఇసుక కమిటీలు ఇసుక రీచ్ లకు అనుమతుల నిస్తారు. ఏజెన్సీ ప్రాంతంలో ‘పీసా’ చట్టం అమల్లో ఉండడంతో ఇసుక రీచ్ లను ఆదివాసీ సహకార సంఘాలకే అప్పగిస్తారు. గ్రామసభల ద్వారా సహకార సంఘాలను గుర్తించవలసి ఉంది.

బినామీల రంగ ప్రవేశం..
ఆదివాసీ సహకార సంఘాలను బలోపేతం చేసి సాధికారిత కల్పించాల్సిన ప్రభుత్వం వాటిని నిర్వీర్యం చేసి పరోక్షంగా బినామీ కాంట్రాక్టర్ల వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఇదంతా ఐఏఎస్ అధికారులు చేసిన నిర్వాకమే అని చెప్పాలి. సీతమ్మసాగర్ పూడిక ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ. 1,500 కోట్లు ఆదాయం వస్తుందని భావిస్తున్న ప్రభుత్వం దీని కోసం కేటాయించిన 20 ఇసుక రీచ్ లను ఏకపక్షంగా బినామీ కాంట్రాక్టర్లకు అప్పగించింది.

పేరుకు ఆదివాసీ సహకార సంఘాలకే ఇసుక తవ్వకాలు డంపింగ్ పనులను అప్పగించామని చెప్తున్నప్పటికీ రీచ్ ల వద్ద బినామీ కాంట్రాక్టర్లే హల్ చల్ చేస్తున్నారు. తమకు అనుకూలమైన ఆదివాసీలతో సహకార సంఘాలను నమోదు చేయించుకున్న బినామీ కాంట్రాక్టర్లు సహకార సంఘాలతో అనధికారిక ఒప్పందాలను కుదుర్చుకుని ఇసుక రీచ్ లను చేజిక్కించుకుంటున్నారు.

అడుగడుగునా అక్రమాలే..
సీతమ్మసాగర్ పూడిక ద్వారా రూ. 1,500 కోట్లు ఆదాయం ఆశిస్తున్న ప్రభుత్వం క్యూబిక్ మీటర్ ఇసుక తవ్వకం, డంపింగ్ యార్డు తరలింపు కోసం 146 రూపాయలు కేటాయించగా దీనిలో బినామీ కాంట్రాక్టర్లకు రూ. 116 పోగా సహకార సంఘాలకు 30 రూపాయలు మిగులుతోంది. పూడిక పేరుతో 2.5 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక తీయడం లక్ష్యం కాగా బినామీ కాంట్రాక్టర్లకు బిల్లుల రూపంలో రూ. 174 కోట్లు చెల్లిస్తారు. టెండర్ విధానం లేకుండా ఏకపక్షంగా నిర్టీత మొత్తాన్ని బినామీ కాంట్రాక్టర్లకు చెల్లించడానికి సహకార సంఘాలు ఒప్పందాలు కుదుర్చుకోగా వీటి వెనుక ఉన్నతాధికారుల హస్తం ఉందని స్పష్టమవుతోంది. ఇసుక సహకార సంఘాలు సహకార చట్టం ప్రకారం పనిచేస్తాయి. ప్రభుత్వ టెండర్ నిబంధనలను పూర్తిగా పాటించ వలసి ఉంటుంది. టెండర్లు పిలిస్తే సహకార సంఘాలకు భారీగా నిధులు మిగిలేవి. ఏకపక్షంగా ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ఠ ధరను కాంట్రాక్టర్లకు చెల్లించడానికి నిర్ణయించడం చట్ట విరుద్ధమే అవుతుంది.

సహకార సంఘాలు పారదర్శకంగా పనిచేయాలంటే అధికారుల నియంత్రణ అవసరం. ఇసుక రీచ్ ల నిర్వహణకు సంబంధించి జిల్లా స్థాయిలో మార్గదర్శకాలు రూపొందించుకునే అధికారాన్ని జిల్లా కలెక్టర్లకు, ఐటీడీఏ పీవో లకు ప్రభుత్వం కట్టబెట్టింది. అయినప్పటికీ జిల్లా కలెక్టర్లతో పాటూ ఐఏఎస్ లు ఉన్న ఐటీడీఏ పీఓ లు కూడా రాజకీయ ఒత్తిడులకు తలొగ్గి బినామీ కాంట్రాక్టర్లకు అనుకూలంగా వ్యవహరించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇటవల బదిలీపై వెళ్ళిన జిల్లా కలెక్టర్ పాత్రపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఒక అధికార పార్టీ నేత కనుసన్నల్లోనే ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ఏజెన్సీ రీచ్ లన్నీ ఆయన నిర్ణయించిన బినామీ కాంట్రాక్టర్ల చేతుల్లోకి వెళ్ళాయి. ఇసుక రీచ్ ల కోసం నిర్వహించ వలసిన గ్రామ సభలను కూడా నిర్వహించకుండానే నిర్వహించినట్లు కొందరు కాంట్రాక్టర్లు చక్రం తిప్పారు. ఈ విషయంలో ఐటీడీఏ పీఓ పాత్ర పైనా చర్చ జరుగుతోంది. నిబంధనల ప్రకారం గోదావరి నదిలో ఇసుకను టిప్పర్ల ద్వారా రవాణా చేసి డంపింగ్ యార్డుకు తరలించవలసి ఉంది. కానీ మణుగూరు, చర్ల ప్రాంతంలోని ఇసుక రీచ్ లలో నేరుగా గోదావరిలోనే లారీలను లోడ్ చేయడం ద్వారా కాంట్రాక్టర్లు భారీగా లబ్ది పొందుతున్నారు. ఇదంతా చూసీ చూడనట్లు టీజీఎండీసీ అధికారులు వ్యవహరిస్తున్నారు.

అదనపు వసూళ్ళు..
దొడ్డి దారిలో ఇసుక రీచ్ లను దక్కించుకున్న బినామీ కాంట్రాక్టర్లు భారీగా అక్రమ వసూళ్ళకు పాల్పడుతున్నారు. ప్రతి లారీ డ్రైవర్ వద్ద రూ. 1,200 నుంచి 2,000 వరకూ వసూలు చేస్తున్నారు. అక్రమ వసూళ్ళ ద్వారా ప్రతి కాంట్రాక్టర్ కు నెలకు రూ. 30 లక్షల వరకూ అదనంగా ఆదాయం వస్తున్నది. దీనిలో టీజీఎండీసీ అధికారులకు కూడా వాటా ఉందనే విమర్శలు పెల్లుబుకుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పూడిక పేరుతో జరుగుతున్న ఇసుక దందాపై విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ లేదా సీఐడీ విభాగంతో దర్యాప్తు జరిపిస్తే నిజాలు వెలుగు చూస్తాయి.

Leave A Reply

Your email address will not be published.