- ఆదివాసీ ఇసుక రీచ్ లకు మంత్రి మోకాలడ్డు
- అన్ని అనుమతులూ వచ్చినా నోరు మెదపని వైనం
- తమకు అప్పగించాలని అనుచరుల హుకుం
- ఇరకాటంలో ఇద్దరు ఎమ్మెల్యేలు
- అయోమయంలో కలెక్టర్
- భద్రాద్రి కొత్తగూడెంలో ఇసుక తుఫాన్
కాంట్రాక్టు వ్యవహారాలు, సెటిల్మెంట్లలో వందల కోట్ల రూపాయల ఆదాయం ఉన్నా అవి చాలనట్లు అమాత్యుడి కన్ను ఇసుకపై పడింది. మంత్రివర్గంలో నంబర్ టూ గా ప్రచారం జరుగుతున్న ఆ మంత్రికి గనుల శాఖను కట్టబెట్టక పోయినా ఆ శాఖపై పెత్తనం చేయడం కూడా సంచలనం కలిగిస్తున్నది. ఆదివాసీ సహకార సంఘాలకు కేటాయించే ఇసుక రీచ్ లను బినామీలుగా మారిన తన అనుచరులకు కట్టబెట్టాలని గత సంవత్సర కాలంగా మంత్రి ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే రీచ్ లపై భారీగా డబ్బు ఖర్చుపెట్టిన కొందరు కాంట్రాక్టర్లు ఈ రీచ్ లను మంత్రి అనుచరులకు అప్పగించడానికి ససేమిరా అనడంతో తాను చెప్పే వరకూ వాటి అనుమతులను ఇవ్వవద్దని కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేసినట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది.
ఏజెన్సీ ప్రాంతంలో ‘పీసా’ చట్టం అమల్లో ఉన్నది. ఇసుక సహా చిన్నతరహా ఖనిజాలను ఆదివాసీ సహకార సంఘాలకు కేటాయించవలసి ఉంది. గ్రామసభల ద్వారా అర్హత కలిగిన సొసైటీలను ఎంపిక చేసి ఇసుక తవ్వకాలు లోడింగ్ వ్యవహారాలను అప్పగిస్తున్నారు. గత పదేండ్లుగా ఇదే జరుగుతున్నది. ఆదివాసీ సహకార సంఘాలకు ఆర్థిక వనరులు లేక పోవడంతో బినామీ కాంట్రాక్టర్లపై ఆధార పడుతున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యేలతో అంటకాగిన కాంట్రాక్టర్లకే ఇసుక రీచ్ లు దక్కాయి. కొందరు ఎమ్మెల్యేలు పరాజయంపాలు కావడానికి ఇసుక దందా కూడా ఒక కారణమని అందరికీ తెలుసు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అధికార పార్టీ నేతల కన్ను ఇసుకపైపడింది. జిల్లాలోని చర్ల మండలంలో గోదావరిపై ఇసుక మేటల పూడిక పేరుతో 10 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక తీయడానికి అనుమతులను ఇవ్వగా వీటిని అధికార పార్టీకి చెందిన మంత్రి అనుచరులే దక్కించుకున్నారు. అడ్డు వచ్చిన గులాబీ కాంట్రాక్టర్లతో కలిపి వారు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇసుక కోసం చర్ల ప్రాంతానికి చెందిన కాంట్రాక్టర్లు పార్టీ మారడం మరొక ట్విస్ట్.
17 రీచ్ ల కోసం హస్తం చాపిన నేతలు..
భద్రాద్రి జిల్లాలోని పినపాక, మణుగూరు, అశ్వాపురం, చర్ల మండలాల్లో గత సంవత్సరం సర్వే చేసిన 17 ఇసుక రీచ్ లకు మూడు నెలల క్రితమే పర్యావరణ అనుమతులు వచ్చాయి. వీటిని ఆదివాసీ సంఘాలకు కేటాయిస్తూ కలెక్టర్ తుది ఉత్తర్వులను జారీ చేయవలసి ఉంది. అయితే మంత్రి వర్యుల గ్రీన్ సిగ్నల్ కోసం అధికార యంత్రాంగం
ఎదురు చూస్తున్నది. వీటి కేటాయింపుల వ్యవహారంలో మంత్రి అనుచరులు నేరుగా రంగంలోకి దిగి ముందుగా వచ్చిన కాంట్రాక్టర్లతో చర్చలు జరుపుతున్నారు. బేషరతుగా ఈ రీచ్ లను తమకు అప్పగించాలనేది వారి డిమాండ్. అవసరమైతే ముందు నుంచీ ఉన్న కాంట్రాక్టర్లు పెట్టిన ఖర్చులు ఇచ్చివేస్తామని లేక పోతే రీచ్ లను నిలిపివేస్తామని వారు. హెచ్చరించడంతో అటు కాంట్రాక్టర్లు, ఇటు అధికార యంత్రాంగం అయోమయంలో పడిపోయింది.
మూడు వాటాల ప్రతిపాదన..
మంత్రి మనుషులతో కాంట్రాక్టర్లు జరుపుతున్న చర్చల్లో అనేక అసక్తికరమైన అంశాలు తెరపైకి వచ్చాయి. ఇసుక రీచ్ లను మూడు వాటాలు చేసి ఇందులో 40 శాతం వాటాను
మంత్రికి, 30 శాతం తమకు కేటాయించాలని, మిగిలిన 30 శాతాన్ని స్థానిక కాంట్రాక్టర్లు తీసుకోవాలనేది ఈ చర్చల సారాంశం. ఈ ప్రతిపాదనకు స్థానిక కాంట్రాక్టర్లు అంగీకరించక పోవడంతో చర్చల్లో ప్రతిష్ఠంభన ఏర్పడింది.
ఆదివాసీ ఎమ్మెల్యేల మూగ రోదన..
పినపాక, భద్రాచలం నియోజకవర్గాల పరిథిలో గోదావరిపై మంజూరైన ఇసుక రీచ్ ల అనుమతుల విషయంలో జరుగుతున్న జాప్యంపై ఇద్దరు ఆదివాసీ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వీరిద్దరూ మంత్రి అనుచరులు కావడంతో నోరు మెదపలేని పరిస్థితి ఏర్పడింది. నియోజకవర్గానికి చెందిన ఆదివాసీ సహకార సంఘాల నుంచి
ఒత్తిడి పెరుగుతున్నా అటు వారిని సముదాయించలేక, మంత్రికి విషయం చెప్పలేక సతమతమవుతున్నారు. నిజానికి ఇసుక రీచ్ లు నడవక పోతే ఎమ్మెల్యేల ఆదాయానికి కూడా గండి పడినట్టే. గతంలో పినపాక నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేతో పాటూ భద్రాచలం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా ఇసుక మాఫియాతో అంటకాగడం వలనే అపఖ్యాతి పాలై చివరికి ఓటమి పాలయ్యారు.
పడిపోతున్న కాంగ్రెస్ గ్రాఫ్..
భద్రాచలం, పినపాక నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గ్రాఫ్ నానాటికి పడిపోతున్నది. ప్రస్తుత ఎమ్మెల్యేలకు ఇసుక షాక్ తో పాటూ మంత్రి షాక్ కూడా తగలబోతోంది. మొదటి నుంచీ కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన కార్యకర్తలు మెల్ల మెల్లగా దూరమవుతున్నారు. ఆదివాసీలు పూర్తిగా అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు. ఆదివాసీ గ్రామాలకు వచ్చే ఇసుక ఆదాయానికి మంత్రి మనుషులు బ్రేక్ వేయడమే దీనికి కారణం.
‘పవర్’ లేని ఉప ముఖ్యమంత్రి..
రాష్ట్రంలో నెంబర్ టూ ఎవరో తెలియని పరిస్థితి నెలకొని ఉండగా ఖమ్మం జిల్లాలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతున్నది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఇసుక మాఫియాను, మరో మంత్రి అనుచరుల ఆగడాలను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కట్టడి చేయలేక పోతున్నారనే విమర్శలు ఉన్నాయి. మరో సీనియర్ మంత్రి కూడా ఇసుక జోలికి రాక పోవడానికి ఆసక్తికరమైన కారణాలు ఉన్నాయి. తన అనుచరులకు ఇసుక రీచ్ లను అప్పగించాలని కోరుతున్న మంత్రి సీనియర్ మంత్రికి సన్నిహితుడు కావడంతో ఆయన నోరుమెదపడం లేదని తెలిసింది. ఇసుక వ్యవహారంలో గత ప్రభుత్వం అపఖ్యాతి పాలవగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఇదే పరిస్థితి దాపురించే వాతావరణం కనిపిస్తున్నది.