- పచ్చని అడవిలో ఇసుక తుఫాన్
- బంధువులే విరోధులుగా మారుతున్న వైనం
- బినామీ కాంట్రాక్టర్ల ఆగడాలతో అట్టుడుకున్న ఏజెన్సీ
- అధికార యంత్రాంగం మౌనం
- శాంతి భధ్రతలపైనా ప్రభావం
పచ్చని అడవుల్లో ఇసుక తుఫాన్ చెలరేగుతున్నది. కలో గంజో తాగి ప్రశాంత జీవితం గడిపే ఆదివాసీల మధ్య మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి. నిన్న మొన్నటి వరకూ కలసి మెలసి జీవించి పండుగలు, జాతరలు చేసుకునే ఆదివాసీలు ఇప్పుడు పరస్పరం కలహించుకుని దాడులకు పాల్పడుతున్నారు. ఎదురు పడినా ముఖం తిప్పుకుని పోతున్నారు. ఈ అలజడికి, అశాంతికి ఇసుక ర్యాంపులే కారణమని ఇటీవలి పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.ఇసుక రీచ్ లను దక్కించుకోవడానికి ఏజెన్సీలో తిష్ఠ వేసిన కొందరు బినామీ కాంట్రాక్టర్ల ప్రలోభాలతో ప్రతి గ్రామంలోఆదివాసీలు గ్రూపులుగా చీలి పోయారు. ములుగు జిల్లాలో వెంకటాపురం మండలంలో బినామీ కాంట్రాక్టర్ల ఆగడాలు పెరిగిపోవడంతో తరచూ శాంతిభద్రతలసమస్యకూడాతలెత్తుతోంది.నిబంధనలకు విరుద్ధంగా బినామీ కాంట్రాక్టర్లకు సహకారం అందిస్తున్న అధికార యంత్రాంగం తమకేమీ పట్టనట్టుగా వ్యవహరించడం కొసమెరుపు.
షెడ్యూల్డు ప్రాంతాలకు పంచాయితీరాజ్ విస్తరణ (పీసా) చట్టం ప్రకారం ఏజెన్సీ ప్రాంతంలోని ఇసుక రీచులు ఆదివాసీ సహకార సంఘాలకే కేటాయించాలి. గ్రామసభల తీర్మానంతో ఇసుక రీచ్ లను సహకార సంఘాలకే కేటాయిస్తున్నప్పటికీ ఆ సంఘాల వద్ద పెట్టుబడులు లేక పోవడంతో బినామీ కాంట్రాక్టర్లు రంగ ప్రవేశం చేశారు. సహకార సంఘాలకు పెట్టుబడులను సమకూర్చడానికి ట్రైకార్ తో పాటూ బ్యాంకుల సహకారం తీసుకునే అవకాశం ఉంది. సహకార సంఘాలతో ఒప్పందం చేసుకునే తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ కూడా బ్యాంకులకు కౌంటర్ గ్యారంటీ ఇచ్చే వీలుంది. ఈ దిశగా అధికార యంత్రాంగం ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. ఆదివాసీ సహకార సంఘాలను పరిపుష్టం చేయడానికి ఏ అధికారీ చొరవ తీసుకోలేదు. బినామీ కాంట్రాక్టర్లు చెల్లించే ముడుపుల కోసమే అధికార యంత్రాంగం వారిని అడుగడుగునా ప్రోత్సహిస్తున్నదని ఆదివాసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి.
కండిషన్స్ కాగితాలకే పరిమితం…
అనుమతులు పొందిన రీచ్ లలో ఇసుక తవ్వకాల కోసం ఆదివాసీ సహకార సంఘాలతో ఖనిజాభివృద్ధి సంస్థ ఒప్పందాలు చేసుకుంటున్నది. ఈ ఒప్పంద పత్రాల్లో రైజింగ్ కాంట్రాక్టర్లుగా సహకార సంఘాలను పేర్కొంటున్నది. నిబంధనల ప్రకారం ఇసుక తవ్వకాలు, డంపింగ్ యార్డు వరకూ రవాణా సహకార సంఘాలే చేయాల్సి ఉంది. కాంట్రాక్టర్లను నియమించవద్దని, థర్డ్ పార్టీ అగ్రిమెంట్లు చెల్లవని కూడా టీఎస్ఎండీసీ నిబంధనల్లో స్పష్టంగా పేర్కొంటున్నారు. ఈ నిబంధనల గురించి తెలియని ఆదివాసీ సహకార సంఘాలు బినామీ కాంట్రాక్టర్లతో అగ్రిమెంట్లు చేసుకుంటున్నాయి. ఇదంతా అధికారుల కనుసన్నల్లోనే జరుగుతున్నది.
అడుగడుగునా అవినీతి…
కీలక శాఖల అధికారుల అవినీతి కారణంగానే బినామీ కాంట్రాక్టర్లు చెలరేగిపోతున్నారు. బినామీ కాంట్రాక్టర్లవ్యవస్థను బహిరంగంగా అధికారులే ప్రొత్సహిస్తుండడంతో ఏజెన్సీ ఇసుక రీచ్ లను దక్కించుకునేందుకుకాంట్రాక్టర్లు పోటీ పడుతున్నారు. సహకార సంఘాలను నమోదు చేయించటం మొదలు ఇసుక రీచ్ లను మంజూరు చేయించే వరకూ అడుగడుగునా వారు చక్రం తిప్పుతున్నారు. రీచ్ ల కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాతవివిధ శాఖల అధికారులు చేసే జాయింట్ సర్వే కీలకం కావడంతో ఈ సందర్భంగానే భారీగా డబ్బు చేతులు మారుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సర్వే కోసం వచ్చే రెవిన్యూ, మైనింగ్, గ్రౌండ్ వాటర్, ఇరిగేషన్, శాఖల అధికారులకు భారీగా లంచాలు ఇస్తున్నట్టు కాంట్రాక్టర్లు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ఇసుక క్వాంటిటీని నిర్ణయించే భూగర్భ జల శాఖ అధికారులు క్యూబిక్ మీటర్ కు నిర్ణీతధరనిర్ణయించిముడుపులుతీసుకోవడంచర్చనీయాంశమైంది. ఫైల్ నడిపినందుకు మైనింగ్ శాఖ అధికారులకు, పట్టా భూములైతే రెవిన్యూ, వ్యవసాయ, ఇరిగేషన్ అధికారులకు లక్షలాది రూపాయలు చెల్లిస్తున్నామని కాంట్రాక్టర్లు చెప్పుకుంటున్నారు. కొందరు అధికారుల వాయిస్ ను కూడా కాంట్రాక్టర్లు రికార్డు చేసి బెదిరింపులకు పాల్పడుతున్నట్టు ప్రచారం జరుగుతున్నది.
సహకార శాఖ అధికారుల తీరు కూడా ములుగు జిల్లాలో ప్రశ్నార్థకమైంది. కాంట్రాక్టర్లు కోరిన విధంగా ఎక్కడ పడితే అక్కడ ఇసుక సొసైటీలు నమోదు చేశారు. పలు సంఘాల్లో గతంలో సభ్యులుగా ఉన్న వారితో కొత్త సొసైటీలు నమోదు చేసి భారీగా అక్రమాలకు పాల్పడ్డారు. గ్రామాల్లో అర్హులైన వారందరికీ సభ్యత్వం ఇవ్వకుండా తమకు అనుకూలంగా ఉండే ఆదివాసీలకే సభ్యత్వం ఇప్పించడం, ఎదురు తిరిగిన వారి సభ్యత్వాలను తొలగించడం, నిబంధనల ప్రకారం ఎన్నికలు నిర్వహించక పోవడం సర్వసాధారణమై పోయింది. ప్రతి పనికీ ఒక రేటు నిర్ణయించి కాంట్రాక్టర్ల వద్ద ముడుపులు తీసుకుని వివాదాస్పదంగా సహకార శాఖ అధికారులు మారిపోయారు. వీరి వైఖరితోనే ఆదివాసీగ్రామాల్లోగొడవలుప్రారంభమయ్యాయి. ఖనిజాభివృద్ధి శాఖ అధికారులు కూడా ఇసుక రీచ్ లను బినామీ కాంట్రాక్టర్లకు అప్పగించినందుకు భారీగా లబ్ది పొందుతున్నారు. అగ్రిమెంట్, ఆన్ లైన్, బిల్లులు చేసే సందర్భంలోనూ, అక్రమంగా మిషన్లు పెట్టినందుకూ వారు కాంట్రాక్టర్ల వద్ద భారీగా ముడుపులు తీసుకుంటున్నారని కాంట్రాక్టర్లు ఆధారాలతో సహా చూపిస్తున్నారు.
బినామీ కాంట్రాక్టర్లతో కలహాలు..
ఇసుక రీచ్ ల కోసం పోటీపడే కాంట్రాక్టర్లతో ఆదివాసీ గ్రామాలు అట్టుడుకుతున్నాయి. ఆదివాసీలను గ్రూపులుగా మార్చి తమకు అనుకూలంగా తిప్పుకోవడంతో ప్రతి రోజూ వివిధ గ్రామాల ఆదివాసీలు భౌతిక దాడులకు దిగుతున్నారు. ఇటీవల వెంకటాపురం మండలంలోని వివిధ గ్రామాల్లో ఇటువంటి సంఘటనలు జరిగినా అధికార యంత్రాంగం అటువైపు కన్నెత్తి చూడలేదు. ఇసుక రీచ్ ల ద్వారా ఆదివాసీలకు వచ్చేది నామ మాత్రం కాగా కాంట్రాక్టర్లు, అధికారుల వైఖరితో నష్టం ఎక్కువ జరుగుతున్నది.