A place where you need to follow for what happening in world cup

అంతులేని కథ.. తీరని వ్యథ… సీతమ్మసాగర్ సాక్షిగా.. గోదావరి గుండెకోత…

  • డీసిల్టేషన్ పేరుతో ఇసుక తవ్వకాలు
  • భారీ యంత్రాలతో దొడ్డిదారి దందా
  • ఇసుక కోసం ముంపును పెంచుతున్న ఇరిగేషన్ అధికారులు
  • భద్రాద్రి ములుగు జిల్లాల్లో రూ. మూడు వేల కోట్ల ఇసుక రీచ్ లు
  • ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో జిల్లా కలెక్టర్ల అనుమతులు
  • బినామీ కాంట్రాక్టర్ల చేతుల్లో కోట్లాది రూపాయల పనులు

శిథిల సౌధంలో కాసుల వేట..6

చట్టాలను వారు గౌరవించరు. పర్యావరణ జీవన విధ్వంసం అనే పదాలు వారికి రుచించవు. న్యాయస్థానాల తీర్పులు చెవికి సోకవు.  ఏదో ఒకటి చేసి గోదావరి నుంచి ఇసుకను తరలించడం, ప్రభుత్వ ఖజానా నింపుకోవడం, అస్మదీయులైన బినామీ కాంట్రాక్టర్లకు మేలు చేయడం ఇదే పాలకులు అనుసరిస్తున్న రీతి, నీతి.  జీవనది గోదావరిని ఇసుక కయ్యలుగా మార్చి స్థానిక ఆదివాసీలకు నష్టం చేస్తూ భారీగా అక్రమాలకు పాల్పడుతున్న వివిధ శాఖల అధికారులు నవ్వుల పాలవుతున్నారు. పూర్తి అధికారాలు కలిగిన ఐఏఎస్ అధికారులు కూడా ఈ పాపంలో పాల్పంచుకుంటున్నారు. సీతమ్మసాగర్ పేరుతో సాగుతున్న వేల కోట్ల రూపాయల అక్రమ దందాపై ‘రేలా న్యూస్’ ప్రత్యేక కథనం..

జీవనది గోదావరి చెంత ప్రజలు తర తరాలు సుఖ జీవనం సాగిస్తున్నారు. మనుషులు, పశు పక్షాదుల తాగునీటి అవసరాలను తీరుస్తూ  నది పారుతూనే ఉంది. పడవల ద్వారా సముద్ర తీరానికి వజ్రవైఢూర్యాలను, సంపదను తరలించడానికి బ్రిటీష్ పాలకులు దుమ్ముగూడెం వద్ద కాటన్ ఆనకట్టను నిర్మించి కాల్వ ద్వారా లాకులను ఏర్పాటు చేసి లాంచీలను నియంత్రించే వ్యవస్థ ఏర్పాటు చేశారు.  ఎందు కోసం కట్టినా కాటన్ ఆనకట్ట వద్ద ఎండాకాలం కూడా నీరు నిల్వ ఉండేది. ఈ ఆనకట్ట బ్యాక్ వాటర్ ను  ఎత్తిపోతల ద్వారా తరలించి ఏజెన్సీలోని భద్రాచలం, పినపాక నియోజకవర్గాలకు తాగు, సాగు నీరందించాలని ప్రజలు 50 ఏండ్ల పాటు పోరాటం చేశారు. అయినా నాటి పాలకులు పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గోదావరి నీటిని సద్వినియోగం చేసుకోవాలనే ప్రయత్నం ప్రారంభమైంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ, దేవాదుల బ్యారేజీలతో పాటూ దుమ్ముగూడెం వద్ద మరొక బ్యారేజీ నిర్మించడానికి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాదాపు రూ. 25 వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో సీతారామ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. దీనిలో భాగంగా మంజూరు చేసిన బ్యారేజీకి సీతమ్మ పేరు కూడా పెట్టారు. పర్యావరణ అటవీ అనుముతులు తీసుకోకుండా నిర్మాణం చేపట్టడంతో ఈ బ్యారేజి పనులను జాతీయ హరిత ట్రిబ్యునల్ నిలిపివేసింది. వేల కోట్ల రూపాయల విలువ చేసే సీతారామసాగర్ వల్ల గోదావరి తీర ప్రాంతంలోని భద్రాచలం, పినపాక నియోజకవర్గాలకు ఒక్క చుక్క నీరు కూడా అందదు. గోదావరి నీటిని మైదాన ప్రాంతానికి తరలించుకు పోయే ఈ ప్రాజెక్టుతో ఆదివాసీలకు ఏ మాత్రం ఉపయోగం లేక పోగా ఇసుక తవ్వకాల పేరుతో ఏజెన్సీ ప్రాంతాన్ని విధ్వంసానాకి గురిచేయడం, భూగర్భ జలాలు ఇంకిపోయే విధంగా భారీ యంత్రాలు వినియోగించడంతో ఇప్పడు ఈ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

ఇసుక కోసం డిసిల్టేషన్..

నదులు, డ్యామ్ లు , చెరువులు పూడికతో నిండిపోతే వీటికి పూడిక తీస్తే నీటి నిల్వ సామర్ధ్యం పెరుగుతుందనే సాధారణ అభిప్రాయం ఉంది. కానీ సీతమ్మసాగర్ బ్యారేజీ విషయానికి వస్తే బ్యారేజీ పనులు ఆగిపోయి నాలుగు సంవత్సరాలు గడచినా పర్యావరణ అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయకుండా నీటిపారుదల శాఖ తాత్సారం చేస్తున్నది. పూర్తి కాని బ్యారేజీకి పూడిక తీయాలనే ఆలోచన నీటిపారుదల శాఖ బుర్రలో పుట్టింది కాదు. గోదావరి నదిలో వేల కోట్ల విలువ చేసే ఇసుక మేటలు ఉన్నాయి. వీటిని తీయడానికి పర్యావరణ అనుమతులు అవసరం. పర్యావరణ అనుమతులు తీసుకుంటే యంత్రాల వినియోగంపై ఆంక్షలు విధిస్తున్నారు. ఇదంతా ఎందుకు? దొడ్డి దారిన ఇసుక తరలించుకుపోయి ఖజానా నింపే మార్గం ఏదైనా ఉందా అని చూస్తే ప్రభుత్వానికి ఒక ఆలోచన తట్టింది. పూడిక పనులకు పర్యావరణ అనుమతులు అవసరం లేదనే కేంద్ర ప్రభుత్వ పర్యావరణ శాఖ మినహాయింపును వినియోగించుకుందామనే నిర్ణయానికి వచ్చింది. ముందుగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల వద్ద ఇటువంటి ప్రక్రియకు అప్పటి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అక్కడ కూడా బ్యారేజీలు పూర్తి కాకముందే దాదాపు  మూడున్నర   వేల కోట్ల రూపాయల విలువచేసే 5.70 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుకను తవ్వడానికి అనుమతుల నిచ్చారు. ఈ వ్యవహారం వివాదాస్పదమైంది. ఎటువంటి శాస్త్రీయ అధ్యయనం చేయకుండా విచక్షణా రహితంగా చేసిన ఇసుక తవ్వకాలతో ఆనాటి ప్రభుత్వం విమర్శల పాలయ్యింది. దీనికి తోడు ఆ రీచ్ లను గులాబీ కాంట్రాక్టర్లు దక్కించుకోవడం, ఓవర్ లోడ్, నకిలీ బిల్లులతో ఇసుక తరలించుకు పోవడంతో దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. 

రాష్ట్రంలో ప్రభుత్వం మారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇసుక తవ్వకాల విషయంలో ఎటువంటి మార్పూ లేదు. డిసిల్టేషన్ పేరుతో ఇసుక రీచ్ లకు అనుమతుల నిస్తే ప్రభుత్వ ఖజానాకు పుష్కలంగా ఆదాయం వస్తుందని అధికార గణం చెప్పడంతో సీఎం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనితో ముందుగా అన్నారం బ్యారేజి వెనుక భాగంలోని గోదావరి, మానేరు నదులపై పూడిక పేరుతో ఇసుక తవ్వకాలు చేపట్టాలని నిర్ణయించారు. కానీ అప్పటికే మానేరు తీర ప్రాంత రైతులు ఆందోళన బాట పట్టారు. వ్యవహారం సుప్రీం కోర్టు వరకూ వెళ్ళింది. 

సీతమ్మసాగర్ పై మాఫియా కన్ను..

బీఆర్ఎస్ హయాంలోనే సీతమ్మసాగర్ పై కన్నేసిన ఇసుక మాఫియా ఫైలు కదిపింది. అధికారం మారడంతో కాంగ్రెస్ పార్టికి చెందిన ఒక కీలక మంత్రిని ప్రసన్నం చేసుకుని అనుమతుల కోసం మాఫియా చక్రం తిప్పింది. సీన్ సీతమ్మసాగర్ కు మారింది. నీటిపారుదల శాఖ ఫీజిబిలిటీ ఇవ్వడం, జాయింట్ ఇనస్పెక్షన్ కమిటి సర్వే పూర్తి చేయడం, భద్రాద్రి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగిన జిల్లా ఇసుక కమిటీ డీసిల్టేషన్ అనుమతులను జారీ చేయడం చక చకా జరిగిపోయాయి. రూ. 1,500 కోట్ల రూపాయల విలువ చేసే 18 ఇసుక రీచ్ లను మంజూరు చేసి ఎటువంటి టెండర్లు లేకుండా బినామీ కాంట్రాక్టర్లకు నామినేషన్ పద్దతిపై అప్పగించారు. ఈ వ్యవహారంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రి అనుచరులు భారీగా లబ్ది పొందారు. భద్రాచలం నియోజకవర్గం పరిథిలోని చర్ల, పినపాక నియోజకవర్గం పరిథిలోని మణుగూరు మండలాల్లో భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు లోడింగ్ జరిగాయి. గత సంవత్సరమే ప్రభుత్వానికి రూ. 1,0000 కోట్లు ఆదాయం వచ్చింది. దొడ్డి దారి వ్యవహారంలో అధికార పార్టికి చెందిన మంత్రితో పాటు ఇద్దరు ఎమ్మెల్యేలకు వాటా ఉందని ఇసుక మాఫియా బహిరంగ ప్రచారం చేసింది. బీఆర్ఎస్ హయాంలో ఇసుక అక్రమ రవాణా చేసిన గులాబీ కాంట్రాక్టర్లే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా లబ్దిదారులు కావడం కొసమెరుపు. 

(రేపు ఏడవ భాగం)

Leave A Reply

Your email address will not be published.