A place where you need to follow for what happening in world cup

నిను వీడని నీడను నేనే..

0 63,638

  • ప్రభుత్వ పెద్దలను వెంటాడుతున్న కరీంనగర్ గ్రానైట్ కుంభకోణం
  • రూ. 750 కోట్ల ఎగవేతపై సీబీ‘ఐ’
  • అక్రమార్కులకు అనుచిత లబ్ది
  • ప్రభుత్వ ఖజానాకు భారీ గండి
  • మైనింగ్ నిబంధలకు వక్రభాష్యం

వేల కోట్ల రూపాయల విలువ చేసే కరీంనగర్ గ్రానైట్ ను విదేశాలకు అక్రమ రవాణా చేసిన వ్యవహారం ఇప్పుడు ప్రభుత్వ పెద్దలకు చుట్టుకునే పరిస్థితి కనిపిస్తున్నది. అక్రమార్కులకు అనుచిత లబ్ది చేకూర్చే విధంగా నిబంధలకు విరుద్ధంగా అపరాథ రుసుమును తగ్గించిన వైనంపై కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ సీబీఐ దృష్టి సారించింది. ఢిల్లీ లోని ఆ సంస్థ కేంద్ర కార్యాలయానికి అందిన ఫిర్యాదులను తదుపరి చర్యల కోసం విశాఖపట్నం కార్యాలయానికి పంపడంతో రాష్ర్ట ప్రభుత్వం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన రూ. 750 కోట్లకు గండి కొట్టడంలో జరిగిన తతంగంపై ‘రేలా న్యూస్’ ఆధారాలను సేకరించింది.

కరీంనగర్ జిల్లా నుంచి వేల కోట్ల రూపాయల విలువ చేసే గ్రానైట్ బ్లాక్ లను విదేశాలకు అక్రమ రవాణా చేస్తున్నారని వచ్చిన ఫిర్యాదులపై రాష్ట్ర ప్రభుత్వ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం 2012 లో దర్యాప్తు ప్రారంభించింది. ప్రభుత్వానికి సీనరేజి చెల్లించకుండా 8 గ్రానైట్ రవాణా కంపెనీలు రైలు, రోడ్డు మార్గంలో వీటిని తరలించినట్టు సమాచారం అందడంతో విశాఖపట్నం, కృష్ట్నపట్నం, కాకినాడ ఓడ రేవుల వద్ద ఆకస్మిక తనిఖీలు జరిపింది. మైనింగ్ శాఖ, రైల్వే, ఓడ రేవుల రికార్డులు తనిఖీ చేసిన తర్వాత కోట్ల రూపాయల సీనరేజి చెల్లించకుండా గ్రానైట్ అక్రమ రవాణా చేస్తున్నట్టు నిర్ధారించింది. రూ. 124,94,46,147 ల సీనరేజ్ చెల్లించకుండా అక్రమ రవాణా జరిగినట్టు నివేదికలో పేర్కొన్నది. ఆంధ్రప్రదేశ్ మైనర్ మినరల్ కన్సెషన్ రూల్స్ 1966 లోని రూల్ 26(3)(i)& (ii) ప్రకారం అసలు సీనరేజ్ తో ఐదు రెట్లు అపరాథ రుసుము కలిపి రూ. 749,66,76,882 (750 కోట్లు) అక్రమార్కుల వద్ద నుంచి వసూలు చేయాలని ప్రభుత్వానికి విజిలెన్స్ విభాగం సిఫారసు చేసింది.

Granite Story

ఈ మేరకు అప్రయిజల్ లెటర్ నంబర్ 60 (C No.268 NRI/2013 తేది 29.05.2013 ను ప్రభుత్వానికి పంపింది. ఈ లేఖను రాష్ర్ట ప్రభుత్వం మైనింగ్ శాఖ డైరెక్టర్ కు పంపింది. విజిలెన్స్ నివేదికపై తదుపరి చర్యలను తీసుకోవాల్సిందిగా అప్పటి మైనింగ్ శాఖ డైరెక్టర్ కరీంనగర్ లోని అసిస్టెంట్ డైరెక్టర్, వరంగల్ లోని డిప్యూటీ డైరెక్టర్ లను ఆదేశించారు. రవాణా కంపెనీలను విచారించిన తర్వాత 63 గ్రానైట్ కంపెనీలు అక్రమ రవాణాకు పాల్పడినట్టు అధికారులు గుర్తించారు. అపరాథ రుసుముతో కలిపి రూ. 749,66,76,882 ను చెల్లించాల్సిందిగా కరీంనగర్ అసిస్టెంట్ డైరెక్టర్, వరంగల్ డిప్యూటీ డైరెక్టర్ వివిధ కంపెనీలకు విడి విడిగా డిమాండ్ నోటీసులను పంపించారు. ఇంతలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. గ్రానైట్ మాఫియా లాబీయింగ్ మొదలు పెట్టింది. బంధువుల పేర్లతో గ్రానైట్ కంపెనీలు కలిగిన ఒక మంత్రి అక్రమార్కులకు అండగా నిలిచినట్టు ఆరోపణలు వచ్చాయి.

అప్పీళ్ళ పేరుతో కాలయాపన…
ప్రభుత్వానికి సీనరేజి, అపరాథ రుసుము చెల్లించకుండా కాలయాపన చేస్తూ వచ్చిన గ్రానైట్ కంపెనీలు మైనింగ్ శాఖ ఇచ్చిన డిమాండ్ నోటీసులను ప్రభుత్వం ముందు సవాలు చేశాయి. తెలంగాణ (ఏపీ) మినరల్ కన్సెషన్ రూల్స్ లోని 35 ఏ ప్రకారం విడి విడిగా అప్పీళ్ళు దాఖలు చేశారు. రవాణా చేసిన గ్రానైట్ విషయంలో విజిలెన్స్ విభాగం వేసిన అంచనాలు అశాస్త్రీయమంటూ వాదించాయి. 63 కంపెనీలు అప్పీల్ చేసుకోవడంతో అప్పటి మైనింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ అప్పీళ్ళపై మైనింగ్ శాఖ డైరెక్టర్ నివేదికను కోరారు.

మంత్రి హరీశ్ రావు స్టే..
విజిలెన్స్ విభాగం నివేదికను సవాలు చేసిన 63 గ్రానైట్ కంపెనీల అప్పీళ్ళపై అప్పటి మైనింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు స్టే విధించారు. నోట్ ఫైల్ C.No.4191/M.I (2) /2016 లో మంత్రి స్టే విధించినట్టు ఉత్తర్వులు జారీ అయ్యాయి. స్టే కొనసాగుతుండగానే గనుల శాఖను హరీశ్ రావు నుంచి తప్పించి కేటీఆర్ కు కేటాయించారు. మళ్ళీ ఈ కేసు విచారణకు వచ్చింది. పోర్ట్ ఫోలియో మారడంతో ఫైల్ ను కేటీఆర్ కు పంపాలను మైనింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ ఆదేశించారు. నోట్ ఫైల్ కేటీఆర్ కు చేరింది.

తదుపరి చర్యలు అవసరం లేదన్న కేటీఆర్..
గ్రానైట్ సీనరేజ్, అపరాథ రుసుముకు సంబంధించిన నోట్ ఫైల్ పై మంత్రి కేటీఆర్ అదనపు పీస్ ఎండార్స్ మెంట్ చేశారు. ఈ ఫైల్ విషయంలో ఎటువంటి తదుపరి చర్యలు అవసరం లేదని మంత్రి తెలిపారని, అందువల్ల ఫైల్ ను వెనక్కి తిరిగి పంపుతున్నామని ఆయన రాశారు. దీనితో హరీశ్ రావు తీసుకున్న నిర్ణయాన్ని కేటీఆర్ కూడా పరోక్షంగా సమర్ధించినట్టయింది. నిబంధనల ప్రకారం వ్యవహరించాలని కూడా మంత్రి రాయక పోవడం విశేషం. కేటీఆర్ నర్మగర్భంగా వ్యవహరించడంతో ఫైల్ చక చకా ముందుకు కదిలింది.

Granite Story

విజిలెన్స్ నివేదికను సమర్ధించిన మైనింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్..
విజిలెన్స్ నివేదిక ప్రకారం సీనరేజి, ఐదు రెట్ల అపరాథ రుసుము చెల్లించాలని డిమాండ్ నోటీసులను జారీ చేసిన మైనింగ్ శాఖ వరంగల్ అర్బన్ డిప్యూటీ డైరెక్టర్ రాత పూర్వకమైన వాంగ్మూలాన్ని ప్రభుత్వానికి అందచేశారు. 63 కంపెనీలు చేసుకున్న అప్పీళ్ళలో పేర్కొన్న అంశాలతో ఆయన విభేదించారు. విజిలెన్స్ విభాగం గ్రానైట్ బ్లాకుల పరిమాణాన్ని టన్నులలోకి మార్చి లెక్కించడం శాస్త్రీయమే నని ఆయన తెలిపారు. క్యూబిక్ మీటర్ల యూనిట్లలో కొలవాలంటూ గ్రానైట్ కంపెనీలు వాదించడం సరికాదన్నారు. రైల్వే శాఖ కూడా గ్రానైట్ బ్లాకులను టన్నేజి లోనే కొలుస్తుందని ఆయన స్పష్టం చేశారు. మైనింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ కూడా విజిలెన్స్ నివేదికను సాంకేతికంగా సమర్ధించడంతో అక్రమార్కుల వాదన వీగి పోయింది.

కంపెనీలకు అనుకూలంగా ప్రభుత్వ ఉత్తర్వులు..
విజిలెన్స్ నివేదికను సమర్ధిస్తూ మైనింగ్ శాఖ అధికారి వాంగ్మూలం అందిన తర్వాత కూడా ఆ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ గ్రానైట్ కంపెనీలకు అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేయడం సంచలనం కలిగించింది. కంపెనీలు కోరిన విధంగా అసలు సీనరేజితో పాటు ఒక వంతు మాత్రమే అపరాథ రుసుము చెల్లించాలని ప్రభుత్వ మెమో నంబర్ 3471/M (i) (2)/2019/2 తేది 20.12.2019 ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయంతో అక్రమార్కులకు కొండంత ఊరట కలిగింది. ప్రభుత్వ ఖజానాకు రూ. 500 కోట్లు నష్టం వాటిల్లింది. సీనరేజి మొత్తంతో పాటు ఒక వంతు అపరాథ రుసుమును కొన్ని కంపెనీలు చెల్లించలేదు. పాక్షిక చెల్లింపులకు ప్రభుత్వం ఆదేశించడం కూడా తప్పు జరిగినట్టు ప్రభుత్వం ఆమోదించినట్టే నని మైనింగ్ శాఖ అధికారులు తెలిపారు.

సెక్షన్ 35 ఏ ఏమి చెప్తున్నది?
విజిలెన్స్ విభాగంతో పాటు మైనింగ్ శాఖ అధికారుల వాదన కూడా పరిగణలోకి తీసుకోకుండా తెలంగాణ మైనింగ్ మినరల్ రూల్స్ లోని 35 ఏ ప్రకారం అపరాథ రుసుము తగ్గిస్తున్నట్టు ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 35 ఏ లో అపరాథ రుసుం గురించి ఎటువంటి ప్రస్తావనా లేదని మైనింగ్ అధికారులే అంటున్నారు. డైరెక్టర్ (జాయింట్ డైరెక్టర్), డిప్యూటీ డైరెక్టర్, లేదా అసిస్టెంట్ డైరెక్టర్ నిర్ణయంతో ఏకీభవించక పోతే 90 రోజుల్లోగా అట్టి నిర్ణయాన్ని సవాలు చేస్తూ ప్రభుత్వానికి అప్పీలు చేసుకునే అవకాశం ఉన్నది. కింది స్థాయి అధికారులు చట్ట బద్దంగా వ్యవహరించారో లేదో మాత్రమే ప్రభుత్వం చూసి నిర్ణయాన్ని ప్రకటించాలి. అంతే తప్ప ప్రభుత్వ ఆదాయానికి వందల కోట్ల రూపాయలు గండి కొట్టే నిర్ణయం తీసుకునే అధికారం లేదు. అయినప్పటికీ ప్రభుత్వం అటువంటి నిర్ణయం తీసుకోవాలంటే ఈ ఫైల్ ను న్యాయ శాఖకు పంపడం కానీ మరొక ఉన్నత స్థాయి కమిటీని నియమించడం కానీ జరగాలి. ఇదంతా జరిగిన తర్వాత కూడా అపరాథ రుసుమును తగ్గించాలంటే ఫైల్ ను క్యాబినెట్ సమావేశంలో చర్చించడానికి నివేదించాలని బిజినెస్ రూల్స్ చెప్తున్నాయి. గ్రానైట్ కంపెనీల విషయంలో ప్రభుత్వం ఇదేమీ పట్టించు కోకుండా కేవలం అక్రమార్కులకు అనుచిత లబ్ది చేకూర్చడానికే ప్రాధాన్యత నిచ్చిందనే విమర్శలు వినవస్తున్నాయి.

Rule 35-A (Revision): The Government may either suomoto at any time or on any applicatiobn make within ninety days, call for and examine the record relating to any order passed or proceedings taken by the Director (Joint Director), Deputy Director or Assistant Director under these rules for the purpose of satisfying themselves as to the legality or propriety of such order or as to the regularity of such proceedings and pass such order in reference thereto as they fit.

సీబీఐకి దర్యాప్తు అధికారం ఉందా?
పర్యావరణ అనుమతులు మినహా మేజర్ మినరల్ కిందకి వచ్చే గ్రానైట్ ఖనిజం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటుంది. ఇక అవినీతి అక్రమాల విషయంలో కూడా రాష్ట్ర వ్యవహారాల్లో నేరుగా సీబీఐ తల దూర్చలేదు. కేవలం రాష్ర్ట ప్రభుత్వం కోరినప్పుడు కానీ న్యాయస్థానాలు ఆదేశించినప్పుడు కానీ అటువంటి ఆరోపణలపై దర్యాప్తు చేసే అవకాశం ఉంది. కరీంనగర్ గ్రానైట్ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు విషయంలో ఇదే వాదన వినిపిస్తున్నది. అయితే ఎగుమతుల వ్యవహారంలో కస్టమ్స్, జీఎస్టీ, ఆదాయపు పన్ను వంటి అంశాలు ముడిపడి ఉండటంతో సీబీఐ కానీ ఈడీ కానీ దర్యాప్తు చేసే అవకాశం ఉన్నదని ఒక సీనియర్ న్యాయవాది అభిప్రాయపడ్డారు.

కొండూరి రమేశ్ బాబు

 8332995398

Leave A Reply

Your email address will not be published.