A place where you need to follow for what happening in world cup

కిన్నెరసాని గుండె కోత..ముర్రేడు మౌన రోదన…

0 38,800

  • గోదావరి ఉప నదుల్లో ఇసుక దొంగలు
  • రైతుల పేరుతో దళారుల ఆగడాలు
  • రీచ్ లను రూ. 2 కోట్లకు అమ్ముకున్న వైనం
  • ఆదివాసీలు, దళితులకు మొండి చేయి
  • భారీ యంత్రాలతో ప్రవాహ దిశనే మార్చిన ఘనులు
  • వాగులకు అడ్డంగా భారీ రహదారులు
  • అనుమతులు ఒక చోట..తవ్వేది మరొక చోట
  • ఏపీ భూభాగం మీదుగా అక్రమ రవాణా
  • అధికారుల సాక్షిగా కొనసాగుతున్న దందా..

జీవనది గోదావరిని పీల్చి పిప్పి చేస్తున్న ఇసుక దొంగలు చివరికి కిన్నెరసాని, ముర్రేడు వంటి వాగులను కూడా వదలడం లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పరిధిలోని సోంపల్లి, పాల్వంచ రూరల్ మండల పరిధిలోని దంతెలబోరు గ్రామాలకు చెందిన దళిత, ఆదివాసీ రైతుల భూములు భారీ వరదలతో మునిగిపోయి వాగుల్లో కలిసి పోయాయి. ఇదే అక్రమార్కుల పాలిట వరంగా మారింది. పట్టా భూముల్లో ఇసుక తవ్వకాల కోసం దళితులు, ఆదివాసీల పేరుతో దరఖాస్తులు పెట్టించి అవినీతి అధికారుల అండదండలతో రీచ్ ల ను మంజూరు చేయించుకున్నారు. ముర్రేడు, కిన్నెరసాని వాగులు కలిసే కింది భాగంలో నాలుగు ప్రదేశాల్లో 50 మందికి పైగా రైతులకు చెందిన వంద ఎకరాల భూమిలో నాలుగు ఇసుక రీచ్ లను మంజూరు చేయించుకుని రెండు లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వకాలకు తెరలేపారు. అవినీతికి చిరునామాగా మారిన గనుల శాఖ అధికారి సహాయంతో తతంగం నడిపించిన బినామీ కాంట్రాక్టర్లు ఈ ఇసుక రీచ్ లను రూ. రెండు కోట్ల రూపాయలకు ఇతర కాంట్రాక్టర్లకు అమ్ముకుని బయట పడ్డారు. వీటిని కొనుగోలు చేసిన కాంట్రాక్టర్లు గత సంవత్సరం నుంచి భారీగా ఇసుక తవ్వకాలు చేపట్టారు.

దళితులు ఆదివాసీలకు మొండి చెయ్యి..

భూముల యజమానులైన సోంపల్లి దళితులు, దంతెలబోరు ఆదివాసీలకు సర్వే సమయంలో కేవలం ఎకరానికి రూ. ఐదువేలు ముట్ట చెప్పి వంద రూపాయల స్టాంపు పేపర్లపై అగ్రిమెంట్లు చేసుకున్నారు. రీచ్ లు ప్రారంభమైన తర్వాత ఎకరానికి రూ. 50 వేలు ఇస్తామని నమ్మబలికి ఏడాది గడచినా ఇవ్వకుండా తమ పని చేసుకుంటున్నారని దళితులు, ఆదివాసీలు వాపోతున్నారు. రీచ్ లు అమ్ముకున్న కాంట్రాక్టర్లు ముఖం చాటు చేసుకోగా ప్రస్తుతం ఇసుక తవ్వకాలు జరుపుతున్న కాంట్రాక్టర్లు కూడా తమకు రావాల్సిన మొత్తాన్ని ఇవ్వకుండా రేపు మాపు అంటూ తిప్పుకుంటున్నారని రైతులు తెలిపారు. ఇప్పటికే రెండు రీచ్ లు పూర్తి చేసిన కాంట్రాక్టర్లు దళితులను, ఆదివాసీలను మోసం చేసి పరారయ్యారు. మరో రెండు రీచ్ లు నడుపుతున్న కాంట్రాక్టర్లు కూడా వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ కాలయాపన చేస్తున్నారు. సొమ్మొకడిది సోకొకడిది చందాన వారు వ్యవహరిస్తున్నారు.

అడుగడుగునా అక్రమాలు…

తమకు కేటాయించిన ప్రదేశాల్లో కాకుండా వాగుల ఈవతలి ఒడ్డు నుంచి ఆవతలి ఒడ్డు వరకూ ఎక్కడ పడితో అక్కడ ఇసక తవ్వకాలు చేస్తున్నారు. నిర్దేశించిన లోతులో కాకుండా భూమి తగిలి నీరు పైకి వచ్చే వరకూ తవ్వి మడుగులుగా మార్చి పారేశారు. ఫలితంగా భూగర్భ జలాలు ఇంకి పోతాయని సమీప రైతులు ఆందోళన చెందుతున్నారు. కిన్నెరసాని, ముర్రేడు కలిసే సంగం గ్రామానికి కింది భాగంలో వాగుపై సిమెంట్ గొట్టాలు వేసిన ఈవతలి నుంచి ఆవతలి ఒడ్డు వరకూ రహదారులు నిర్మించారు. పట్టా భూములు కేవలం ఒడ్డుకు దగ్గరిలోనే ఉంటాయి. అయినప్పటికీ సరహద్దు రాళ్ళను ఎప్పటి కప్పుడు జరుపుకుంటూ పోతున్నారని స్థానిక ఆదివాసీలు తెలిపారు. ఇసుక రీచ్ ల నుంచి ఇసుకను బూర్గంపాడు మండలంలోని తీర ప్రాంత గ్రామాల మీదుగా తరలించాల్సి ఉంది. వాగు సమీపంలో రైతుల పట్టాభూములు, యూకలిప్టస్ తోటలు ఉండటంతో అటు వైపుగా లారీలు వెళ్ళడానికి రైతులు అంగీకరించలేదు. దీనితో ఏపీలో విలీనం చేసిన బూర్గంపాడు మండలంలోని ఇతర గ్రామాల మీదుగా లారీలను పంపుతున్నారు. నిబంధనల ప్రకారం ఇతర రాష్ట్రాల మీదుగా లారీలు తిరగడానికి వీలు లేదు. అయినప్పటికీ ఏపీలోని పోలీస్, రెవిన్యూ అధికారులకు భారీగా ముడుపులు చెల్లించి లారీలను తిప్పతున్నారు. అక్రమ రవాణా కోసం మర్రేడు వాగుపై ఒక రహదారినే నిర్మించారు.

పరిమితిని మించి ఓవర్ లోడింగ్..

కిన్నెరసాని, మర్రేడు వాగులపై పట్టా భూముల పేరుతో అనుమతులు పొందిన కాంట్రాక్టర్లు ఓవర్ లోడింగ్ తో భారీగా అక్రమార్జనకు పాల్పడుతున్నారు. టీఎస్ఎండీసీ సిబ్బందికి ప్రతి బకెట్ కు రూ. 200 నుంచి రూ. 300 లంచం ఇస్తూ అదనంగా పది నుంచి 15 టన్నుల ఇసుకను ఓవర్ లోడింగ్ చేస్తున్నారు. ఇసుక కాంట్రాక్టర్ల ఆగడాలపై ఎవరెన్ని ఫిర్యాదులు చేసినా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యంత్రాంగం పట్టించుకునే పరిస్థితి లేదు. పట్టా భూముల్లో ఇసుక అనుమతులు పొందిన వాగుకు ఎడమ వైపు నీటి ప్రవాహం ఉండడంతో జెసీబీల సాయంతో నీటిని కుడి వైపుకు మళ్ళించి ప్రవాహ గతినే మార్చి వేయడం సంచలనం కలిగిస్తున్నది. ఫలితంగా నీరు దంతెల బోరు గ్రామం వైపు ప్రవహిస్తున్నది. కాంట్రాక్టర్ల అక్రమాన్ని సమర్ధిస్తున్న మైనింగ్ అధికారి దంతెల బోరు ఆదివాసీలకు నష్టం చేస్తున్నారు. దంతెల బోరు వైపు నీరు ఉందంటూ ఆదివాసీ సొసైటీకి ఇసుక రీచ్ మంజూరు చేయలేమని చెప్తున్నారని దంతెలబోరు ఆదివాసీలు తెలిపారు.

దగా పడిన ఆదివాసీలు..

కిన్నెరసాని, ముర్రేడు వాగుల సంగమ ప్రదేశం నుంచి సీతారామ ప్రాజెక్టు కోసం రెండేండ్ల క్రితం రెండు లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకకు అధికార యంత్రాంగం అనుమతుల నిచ్చింది. సమీపంలోని దంతెల బోరు నోటిఫైడ్ గిరిజన గ్రామం కావడంతో పీసా చట్టం ప్రకారం సహకార సంఘాన్ని ఏర్పాటు చేసి సీతారామ ప్రాజెక్టుకు ఇసుక సరఫరా చేయాలని గ్రామస్థులు కోరినా అధికారులు పట్టించుకోలేదు. మహిళలతో సహా ఆదివాసీలు లారీలకు అడ్డంగా పడుకుని నిలిపి వేయడం అప్పట్లో సంచలనం కలిగించింది. కేసులు పెడతామంటూ పాల్వంచ రూరల్ పోలీసులు బెదిరింపులకు కూడా పాల్పడ్డారు. ఒక దశలో ఈ వ్యవహారం సీఎం పేషీకి చేరడంతో సీఎం ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్ స్వయంగా రంగంలోకి దిగి కలెక్టర్ తో మాట్లాడారు. సీతారామ ప్రాజెక్టు కాంట్రాక్టర్ల పరపతి ఎంత స్థాయిలో ఉంటుందో ఈ సంఘటనతో తెలిసింది. సీతారామ ప్రాజెక్టుకు తరలించే ఇసుక లారీలను అడ్డుకోవద్దని అప్పటి కలెక్టర్ దంతెలబోరు ఆదివాసీలను కోరారు. ప్రత్యామ్నాయంగా అక్కడ ఒక సహకార సంఘాన్ని ఏర్పాటు చేసి ఆదివాసీలకే ఇసుక తవ్వకాలు అప్పగిస్తామని చెప్పారు. ఇది జరిగి రెండేండ్లు గడచినా వారికి ఇసుక అనుమతులు ఇవ్వలేదు. ఆదివాసీలు చెప్పులరిగేలా అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. సహకార సంఘం నమోదు చేసిన తర్వాత అనుమతులు ఇవ్వకుండా మైనింగ్ అధికారి అడ్డుపడుతున్నారు.

ముడుపులు ఇచ్చే కాంట్రాక్టర్లు ఉంటేనే ఈ జిల్లాలో ఫైళ్ళు కదులుతాయి. ఏజెన్సీ కలెక్టర్ గా పిలిచే భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి లేఖ ఇచ్చినా మైనింగ్ అధికారి పట్టించుకోవడం లేదు. కనీసం కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్ళలేదు. ముర్రేడు, కిన్నెరసాని సంగమ ప్రదేశంలో ఒక కిలో మీటర్ పరిధి దంతెలబోరు గ్రామానికి ఉంది. నాలుగు లక్షల క్యూబిక్ మీటర్లకు పైగా ఇసుక తమ పంచాయితీ పరిధిలో ఉన్నా మైనింగ్, భూగర్భ జల అధికారులు కేవలం 6 వేల క్యూబిక్ మీటర్ల ఇసుక మాత్రమే సిఫారసు చేశారని ఆదివాసీలు ఆందోళన వ్యక్తం చేశారు. మళ్ళీ సర్వే చేయాలని, కొందరు కాంట్రాక్టర్ల వాగును తమ వైపుకు మళ్ళించారని దంతెల బోరు ఆదివాసీలు చెప్పినా చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్టు అధికారులు వ్యవహరిస్తున్నారు. జిల్లా కలెక్టర్ ను కలిసినా తమకు న్యాయం జరగలేదని వారు తమ గోడు వెళ్ళబుచ్చుకున్నారు.

కొండూరి రమేష్ బాబు

Leave A Reply

Your email address will not be published.