A place where you need to follow for what happening in world cup

అందాల కోనలో రాతి రాక్షసులు..

0 32,529

 

 • కొండ చిన్నబోయింది..లోయ మూగబోయింది
 • మెటల్ మాఫియా పడగ నీడలో తోగ్గూడెం
 • బొందల గడ్డగా మారిన ఆదివాసీ గ్రామం
 • రూ. వందల కోట్ల విలువ చేసే సంపద మాఫియా పాలు
 • అనుమతులు లేకుండా ఎనిమిది క్వారీల నిర్వహణ
 • 6 అక్రమ క్రషర్లతో ఏడాదికి 70 లక్షల
  క్యూబిక్ మీటర్ల రాయి తరలింపు
 • పర్యావరణ అనుమతులు లేకుండానే చీకటి దందా
 • రూ. కోట్లాది రూపాయల సీనరేజి, రాయల్టీ ఎగవేత
 • మామూళ్ళ మత్తులో అధికార యంత్రాంగం

కొండలు, కోనలు సెలయేళ్ళ గలగలలు, పక్షుల కిల కిలా రావాల మధ్య ఒకప్పుడు అలరారిన ఆ ప్రాంతం ఇప్పుడు బొందల గడ్డగా మారిపోయింది. కొండలు కరిగిపోయి పోగా పచ్చదనం అంతరించి పోయి ఎక్కడ చూసినా రాతి పొరలు దర్శనమిస్తున్నాయి. మెటల్ మాఫియా పడగ నీడలో అందాల లోయ రాక్షసి కోనగా మారిపోయింది. పచ్చటి పొలాలతో ఒకప్పడు కళ కళలాడిన ఆ గ్రామం చుట్టూ ఇప్పడు యంత్ర భూతాల చప్పడు మాత్రమే మిగిలింది. భూమి పుత్రులైన ఆదివాసీలకు దక్కాల్సిన ప్రకృతి సంపద తమ ముందే తరలించుకు పోతున్నా వారు నోరు మెదపలేక పోతున్నారు. చట్టాలను కాపాడాల్సిన అధికార యంత్రాంగం కాసుల కక్కుర్తితో మాఫియాకు దాసోహమయ్యింది. ఇది తోగ్గూడెం కథ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని ఈ చిన్న ఆదివాసీ గ్రామం ఏండ్ల తరబడి రాళ్ళ మాఫియా కబంధ హస్తాల్లో చిక్కుకుంది.

తరతరాలకు తరగని సంపద..

పూర్వపు ఖమ్మం జిల్లాలోనే అత్యంత విలువైన మెటల్ లభ్యమయ్యే కొండలు తోగ్గూడెం గ్రామంలో ఉన్నట్టు
కనుగొన్నారు. మాఫియా కన్ను వీటిపై పడింది. రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూలులో ఉన్న ఏజెన్సీలో తొగ్గూడెం గ్రామం ఉంది. భూమి బదలాయింపు నిషేధిత చట్టం 1/70తో పాటు, పీసా చట్టం పరిధిలో ఈ గ్రామం ఉంది. అక్కడి భూములన్నీ ఆదివాసీలవి కావడంతో నేరుగా తమ పేర్లతో లీజులు తీసుకునే అవకాశం లేదని గ్రహించిన బడా కాంట్రాక్టర్లు ఇతర ప్రాంతాలకు చెందిన కొందరు మైదాన ప్రాంత గిరిజనుల పేర్లతో భూములను కొనుగోలు చేశారు. ఎకరానికి కేవలం ఐదు నుంచి పదివేల రూపాయలకే ఆ భూములు కొనుగోలు చేసి మైనింగ్ లీజులు పొందారు.

 

45 ఏండ్ల కాలం నామమాత్రంగా నడిచిన క్వారీలకు ఇటీవల డిమాండ్ మరింతగా పెరిగింది. గనులు చేతులు మారాయి. మూడేండ్ల క్రితం నాటికే అనేక అక్రమాలు బయట పడ్డాయి. లీజులు పొందిన ప్రదేశంలో కాక ఎక్కడ పడితే అక్కడ కొండలను తవ్వి కోట్లాది రూపాయల సంపదను అక్రమార్కులు తరలించుకు పోయారు. పర్యావరణ అనుమతులు లేక పోవడం, నిబంధలను అతిక్రమించడం, సీనరేజి, రాయల్టీ చెల్లించక పోవడం వంటి ఆరోపణలతో మైనింగ్ శాఖ లీజులను పొడిగించలేదు. అయినప్పటికీ మాఫియా తమ పని చేసుకుంటూ పోతూనే ఉన్నది. అనుమతులు లేక పోయినా మైనింగ్ ఆపలేదు. గత మూడేండ్ల కాలంలో వీరి అక్రమాలకు అంతు లేకుండా పోయింది. ఒకప్పడు కేవలం వంద ఎకరాల లోపు మైనింగ్ లీజులు ఉంటే ఇప్పడు అనధికారికంగా మూడు రెట్లు విస్తీర్ణంలో అక్రమ మైనింగ్ జరుగుతున్నది. నీరు పైకి రావడంతో రెండు గనులు మూత పడగా మరో 8 గనుల్లో అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి.

 

ఏడాదికి వంద కోట్ల మెటల్ తరలింపు…

రాతి తవ్వకాలకు, మెటల్, చిప్స్ క్రషింగ్ కు ఎటువంటి అనుమతులు లేక పోయినా మాఫియాను అడ్డుకునే వారు లేక పోవడం విశేషం. ఎనిమిది గనుల వద్ద అక్రమంగా ఆరు స్టోన్ క్రషర్లను ఏర్పాటు చేసి కోట్లాది రూపాయల విలువ చేసే
రాయిని తరలిస్తున్నారు. రోజుకు మూడు వందల లారీల మెటల్, చిప్స్ ఎటువంటి వే బిల్లులు లేకుండా తరలి పోతున్నా వాటిని పట్టుకునే వారే లేరంటే మాఫియా పలుకుబడి ఏ మేరకు ఉన్నదో స్పష్టమవుతోంది. సంవత్సరానికి 75 లక్షల క్యూబిక్ మీటర్ల రాయి ఇక్కడి నుంచి తరలిపోతున్నట్టు స్థానికులు చెప్తున్నారు. రెండు తాటి చెట్ల లోతులో భూగర్భంలో బాహాటంగా మైనింగ్ జరుగుతున్నది. అనుమతులు లేకుండానే బ్లాస్టింగ్ చేస్తూ జేసీబీలు టిప్పర్లతో రాతిని తరలిస్తున్నారు. పేలుళ్ళతో తోగ్గూడెం పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. గనుల వద్ద ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేయక పోవడంతో అటు వైపు వెళ్ళే మనుషులకు, పశువులకు ప్రమాదం పొంచి ఉంది.

పర్యావరణానికి విఘాతం..

అక్రమ రాతి గనులతో పరిసర ప్రాంతాల్లో పచ్చదనం అంతరించిపోతున్నది. చెట్లను భారీగా నరికి వేయడం, వందల మీటర్ల లోతుకు గనులు తవ్వడంతో పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు కూడా అంతరించి పోయే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. స్టోన్ క్రషర్ల ద్వారా వచ్చే రజను గాలికి గ్రామాల వైపు వెళ్ళడంతో ఆదివాసీలకు ఊపరితిత్తుల వ్యాధులు సంక్రమించే అవకాశం ఉన్నది. నాగారం నుంచి తోగ్గూడెం వెళ్ళే రహదారులన్నీ మెటల్ చిప్స్ తో నిండి పోవడంతో ఆటోలు, టూ వీలర్స్ కదిలే పరిస్థితి లేదు. తరచుగా పంచర్లు పడుతున్నాయని స్థానికులు తెలిపారు. గర్భిణీ స్త్రీలను, పిల్లలను, అత్యవసర వైద్యం అవసరమైన వారిని ఈ రహదారుల ద్వారానే అతి కష్టం మీద తరలించాల్సి వస్తున్నది.

అక్రమాలకు అడ్డుకట్ట వేయరా?

వందల కోట్ల అక్రమ మైనింగ్, రవాణా జరుగుతున్నా, ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం వాటిల్లుతున్నా కోట్లాది రూపాయలు చేతులు మారడం తోనే వీటిని రెవిన్యూ, మైనింగ్, పోలీస్, రవాణా అధికారులెవరూ పట్టించు కోవడం లేదనే విమర్శలు పెల్లుబుకుతున్నాయి. మైనింగ్ శాఖ లోని విజిలెన్స్ విభాగం అధికారులు వస్తున్నారని తెలిస్తే ముందుగానే కాంట్రాక్టర్లకు స్థానిక మైనింగ్ అధికారి సమాచారం అందిస్తున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం దర్యాప్తు చేస్తే కోట్లాది రూపాయల అక్రమాలు వెలుగు చూసే అవకాశం ఉన్నది.

కొండూరి రమేష్ బాబు

Leave A Reply

Your email address will not be published.