- పెద్దసంఖ్యలో ద్విచక్ర వాహనాలతో ర్యాలీలో భాగస్వామ్యమైన యువత
- దేశభక్తి భావన ప్రతి ఒక్కరిలో ఉన్నప్పుడే.. దేశప్రగతి సాధ్యమవుతుందన్న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్
- దేశవ్యాప్తంగా ఇలాంటి ర్యాలీలు నిర్వహించాలన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
న్యూఢిల్లీ:దేశరాజధాని ఢిల్లీలో శుక్రవారం ఉదయం తిరంగా ర్యాలీ ఘనంగా జరిగింది. ప్రగతి మైదాన్ వద్ద కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో భారీ సంఖ్యలో కేంద్రమంత్రులు, ఎంపీలు, యువత ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. 15 ఆగస్టు నాడు దేశవ్యాప్తంగా అందరి ఇండ్లు, ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాలు, పరిశ్రమలు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు.. ఇలా ప్రతిచోటా జాతీయ జెండా ఎగరేయాలని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, దేశ ప్రజలను కోరారు.తెలుగు ప్రజలు కూడా తమ తమ ప్రాంతాల్లో జరిగే ఇలాంటి ర్యాలీల్లో స్వచ్ఛందంగా భాగస్వామ్యులై.. జాతీయభావనను ప్రదర్శించాలని కిషన్ రెడ్డి కోరారు.
అంతకుముందు, భారత ఉపరాష్ట్రతి శ్రీ జగదీప్ ధన్కర్ మాట్లాడుతూ.. వ్యక్తిగత అభిప్రాయాలు, కుల, మత, ప్రాంత అభిప్రాయ భేదాలకన్నా..జాతీయ భావనే అత్యుత్తమం అని అన్నారు. ప్రతి ఒక్కరూ..నా దేశం అని భావించినపుడే.. దేశ ప్రగతి సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా నడుచుకున్నప్పుడే.. మన స్వాతంత్ర్య సమరయోధుల ఆకాంక్షలను చేరుకోగలమన్నారు.అనంతరం ఉపరాష్ట్రపతి జెండా ఊపి.. తిరంగా ర్యాలీని ప్రారంభించారు. ప్రగతి మైదాన్ లో ప్రారంభమైన ఈ ‘తిరంగా బైక్ ర్యాలీ’.. ప్రగతి మైదాన్ టన్నెల్ – ఇండియా గేట్ సర్కిల్ గుండా కొనసాగి.. మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియం గేట్ నెంబర్ 1 వద్ద ముగిసింది.ఈ కార్యక్రమంలో.. పీయూష్ గోయల్, అనురాగ్ ఠాకూర్, గజేంద్రసింగ్ షెకావత్, అర్జున్ రామ్ మేఘ్వాల్, మీనాక్షి లేఖితోపాటు పలువురు.. కేంద్ర మంత్రులు, ఎంపీలు, బీజేవైఎం కార్యకర్తలు, ఢిల్లీలోని వివిధ విశ్వవిద్యాలయాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.