- పంటలు పండించాల్సిన ప్రాజెక్టుతో ఇసుకను పండిస్తున్న ప్రభుత్వం
- ఇసుక కోసం ముంపును పెంచిన నీటిపారుదల శాఖ
- సీతమ్మసాగర్ డీపీఆర్ లో లేని ఎగువ ప్రాంతంలో డిసిల్టేషన్
- శాస్త్రీయ అధ్యయనం లేకుండానే ఫీజిబిలిటీ ఇచ్చిన ఇంజనీర్లు
- కేంద్ర పర్యావరణ జలవనరుల శాఖల మార్గదర్శకాలు బేఖాతర్
శిథిల సౌధంలో కాసుల వేట..7
గోదావరి నది యుగయుగాల తరతరాల వారసత్వ సంపద. ఈ నదీ తీరంలో ఆదివాసీ సంస్కృతి పరిఢవిల్లింది. నాగరికత వెల్లివిరిసింది. ప్రఖ్యాత ఆంగ్ల కవి ఆల్ ఫ్రెడ్ లార్డ్ టెన్నిసన్ నదిపై రాసిన The Brook ఆంగ్ల పద్యం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. “Men may come and men may go..but I go on forever”. మనుషులు వస్తుంటారు, పోతుంటారు. కానీ నేను ఎప్పటికీ ప్రవహిస్తూనే ఉంటాను అని దీనర్థం. మరి ఇటువంటి జీవనదిలో ఇసుక తవ్వకాల రూపంలో పర్యావరణ విధ్వంసం, తీర ప్రాంతంలో జీవన విధ్యంసం జరుగుతుంటే ప్రజలు చూస్తూ ఊరుకోవాలా? ప్రజలను కాపాడవలసిన ప్రభుత్వమే ఆదాయం కోసం అక్రమాలు చేస్తుంటే దీనిని సంక్షేమ రాజ్యం అనాలా?

జీవనది గోదావరి పక్కనే ప్రవహిస్తున్నా గుక్కెడు మంచినీరు కూడా అందక పోవడంతో పాటూ సాగునీరు లేక జీవం లేని భూములతో తీర ప్రాంతవాసులు అలమటిస్తుంటే అక్కడ ఇసుక పండించే పనిలో ప్రభుత్వం నిమగ్నం కావడాన్ని ఆదివాసీలు జీర్ణించుకోలేక పోతున్నారు. పర్యావరణ అనుమతులు లేక పోవడంతో సీతమ్మసాగర్ బ్యారీజీ నిర్మాణాన్ని జాతీయ హరిత ట్రిబ్యునల్ నిలిపివేసి నాలుగు సంవత్సరాలైంది. గోదావరి ప్రాజెక్టులకు రీడిజైన్ చేసే సందర్భంలో గత ప్రభుత్వం నదీ తీర ప్రాంతంలో రాడార్, హెలికాప్టర్ తో లైడార్ సర్వే చేయించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా ఉన్న మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలతో పాటూ సమ్మక్క (దేవాదుల), సీతమ్మసాగర్ బ్యారేజీల నిర్మాణాన్ని దృష్టిలో పెట్టకుని ముంపు నిర్ధారణ కోసం ఈ సర్వే జరిగింది. కాంటూర్ లెక్కలతో టోపో షీట్ల ఆధారంగా అత్యంత ఖచ్చితత్వంతో జరిగిన ఈ సర్వేతో మహారాష్ట్ర, చత్తీసగఢ్ రాష్ట్రాలు కూడా ఏకీభవించాయి.
సీతమ్మసాగర్ ముంపు వివరాలు..
లైడార్ సర్వే ప్రకారం సీతమ్మసాగర్ బ్యారేజీ బ్యాక్ వాటర్ ప్రభావాన్ని మదింపు చేసి ముంపు ప్రాంతాన్ని నిర్ధారణ చేశారు. 37 టీఎంసీల నీటిని నిల్వ చేసే సామర్ధ్యం కల ఈ బ్యారేజీ ఎడమ గట్టువైపు చర్ల మండలంలోని సుబ్బంపేట వరకూ గల 55.82 కిలోమీటర్ల దూరం వరకు, కుడి గట్టు వైపు మణుగూరు మండలంలోని రామానుజవరం వరకూ 40.60 కిలోమీటర్ల దూరం వరకూ బ్యాక్ వాటర్ ప్రభావం ఉంటుందని నిర్ధారించారు. దీని ఆధారంగానే బ్యారేజీతో పాటు రెండు వైపులా వరద నివారణ కోసం కరకట్టల నిర్మాణం చేపట్టారు. ముంపునకు గురయ్యే రైతులకు నష్టపరిహారం కూడా చెల్లించారు.

ఇసుక కోసం ముంపును పెంచిన నీటిపారుదల అధికారులు..
పర్యావరణ అనుమతులు లేకుండా దొడ్డిదారిన డీసిల్టేషన్ పేరుతో సీతమ్మ బ్యారేజీ వెనుక భాగంలో భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలకు ప్రభుత్వం పూనుకున్నది. గత సంవత్సరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు, చర్ల మండలాల్లో పూడిక పేరుతో రూ. 1,300 కోట్లు ఆదాయం వచ్చే 18 ఇసుక రీచ్ లను మంజూరు చేసింది. తక్కువ ఖర్చతో ఎక్కువ ఆదాయం వచ్చే ఈ ప్రక్రియ రాబోయే కాలంలో కూడా కొనసాగించాలని కొందరు ఉన్నతాధికారులు నిర్ణయించి సీఎం ను కూడా పక్కదారి పట్టించారు. ఈ రీచ్ లను తమ అనుయాయులకు ఇప్పించడానికి అధికార పార్టీ ప్రముఖులు పావులు కదిపారు.
బ్యారీజికి 70 కిలోమీటర్ల ఎగువన పూడిక పేరుతో ఇసుక తవ్వకాలు
సీతారామసాగర్ బ్యారేజీ బ్యాక్ వాటర్ ప్రభువం ఎంత దూరం ఉంటుందో శాస్త్రీయంగా నిర్ధారణ చేసి డీపీఆర్ ను కేంద్ర ప్రభుత్వానికి పంపి కొన్ని అనుమతులను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. రాత్రికి రాత్రే నీటిపారుదల శాఖ అధికారులు రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గి బ్యారేజీ బ్యాక్ వాటర్ ప్రభావం ఎవమ వైపు 70 కిలోమీటర్ల దూరంలోని ఆలుబాక వరకు, కుడి వైపు 70 కిలోమీటర్ల దూరంలోని మంగపేట మండలం వరకూ ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఈ ప్రాంతంలో కూడా పూడిక తీయవచ్చని ఫీజిబిలిటీ నివేదిక ఇచ్చారు. ఎటువంటి సాంకేతిక అధ్యయనం లేకుండా ఇటువంటి నివేదికను తయారు చేశారు.

ఈ నివేదిక ఆధారంగా ములుగు జిల్లా కలెక్టర్ చైర్మన్ గా ఏర్పాటైన జిల్లా ఇసుక కమిటీ మంగపేట మండలంలోని మూడు గ్రామాల్లో రూ. 650 కోట్ల విలువ చేసే ఒక కోటి క్యూబిక్ మీటర్ల ఇసుకను పూడిక పేరుతో తవ్వడానికి అనుమతులనిచ్చింది. అంతటితో ఆగకుండా ఎవమవైపున ఉన్న వెంకటాపురం మండలంలో మరో కోటి క్యూబిక్ మీటర్ల ఇసుకను పూడిక పేరుతో తీయడానికి సర్వే చేసి అధికారులు జిల్లా కలెక్టర్ కు నివేదికను ఇచ్చారు. ముందుగా నీటిపారుదల శాఖ కి చెందిన భద్రాచలం ఎగ్జికూటివ్ ఇంజనీర్ ఫీజిబిలిటీ నివేదిక ఇచ్చి వివాదంలో చిక్కుకున్నారు. పూడిక ఫీజిబిలిటీ తనకు తెలియకుండా ఇచ్చారని సీతమ్మసాగర్ ఎగ్గికూటివ్ ఇంజనీర్ అభ్యంతరం తెలిపారు. ఇదంతా కాంట్రాక్టర్లు ఇచ్చే ముడుపుల కోసమే తప్ప సాంకేతికంగా పూడిక అవసరమో లేదో ఎవరూ నిర్ధారించలేదు. బ్యారేజీల పూడిక విషయంలో జాతీయ హరిత ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను కానీ కేంద్ర ప్రభుత్వ పర్యావరణ, జలశక్తి శాఖల మార్గదర్శకాలను కానీ పరిగణలోకి తీసుకోలేదు. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం పీకల్లోతు వివాదంలో ఇరుక్కుపోయింది. జాతీయ స్థాయిలో పూడిక వ్యవహారం వివాదాస్పదం కానున్నది.
జవాబు రాని ప్రశ్నలు..
సీతమ్మసాగర్ బ్యారేజీ బ్యాక్ వాటర్ ప్రభావాన్ని ఇసుక కోసం పెంచారా లేక దీని వెనుక సరైన అధ్యయనం జరిగిందా అనేది ప్రజలకు ప్రభుత్వం చెప్పాలి. ముంపును అధికారికంగా నిర్దారిస్తే మరో 30 కిలోమీటర్ల ఎగువభాగంలో భూములు మునిగిపోయే రైతులకు నష్ట పరిహారం ఇవ్వాలి. ఎగువ ప్రాంతంలో కూడా కరకట్టలు నిర్మించాలి. ఇసుక మీద వచ్చే ఆదాయం కన్నా నష్టపరిహారం, కరకట్టల ఖర్చు పెరిగే అవకాశం ఉంది. ఈ విషయంలో రైతులు, తీరప్రాంతవాసులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు. ప్రస్తుతానికి ఇవి జవాబు రాని ప్రశ్నలుగానే మిగిలిపోయాయి.
(జాతీయ హరిత ట్రిబ్యునల్, పర్యావరణ జలశక్తి శాఖల మార్గదర్శకాలు రేపటి కథనంలో..)