- మర్రి చెట్టు మాత్రం స్వల్పంగా కాలిపోయి సజీవంగాఉన్న మర్రి చెట్టు
- 1873లో ప్రొటెస్టాంట్ మిషన్ వార్సికోత్సవం సందర్భంగా ఇండియా గిఫ్ట్
అమెరికాలోని హవాయి ద్వీపంలో వచ్చిన కార్చిచ్చు రాత్రికి రాత్రే లహైనా పట్టణాన్ని బుగ్గి చేసేసింది. ఆ దావానలం ధాటికి ఆ పట్టణంలో ఉన్న బిల్డింగ్‌లన్నీ కాలిపోయాయి. మహా వృక్షాలు కూడా దగ్ధం అయ్యాయి. అయితే లహైనా కోర్ట్‌హౌజ్ ముందు నాటిని మర్రి చెట్టు మాత్రం స్వల్పంగా కాలిపోయింది. ఆ మర్రి చెట్టు ఊడలు కొన్ని ఇంకా సజీవంగా ఉన్నాయి.ఈ మర్రి వృక్షానికి పెద్ద స్టోరీ ఉంది. 1873లో ఇండియా నుంచి ఈ మర్రి వృక్షానికి చెందిన మొక్కను తీసుకువెళ్లి అక్కడ నాటారు. 150 ఏళ్లుగా ఆ చెట్టు తన శాఖలను విస్తరిస్తూ పోయింది. లహైనా హార్బర్ సమీపంలో ఆ వృక్షం ఓ సుందర ప్రదేశంగా మారింది. స్థానిక పర్యాటకుల్ని ఆ వృక్షం ఆకర్షిస్తోంది.అయితే ఆగస్టు 10వ తేదీన ఆకస్మికంగా దాడి చేసిన దావానలంలో ఆ బోధి వృక్షం స్వల్పంగా కాలిపోయింది. యావత్ అమెరికాలోనే ఈ మర్రి వృక్షం పెద్దదన్న వాదన కూడా ఉంది.
శాటిలైట్ ఇమేజ్‌లో ఆ వృక్షం పూర్తిగా కాలిపోయినట్లు అనిపిస్తోంది. కానీ ఆ వృక్షంలో జీవం ఉన్నట్లు కొన్ని వీడియోలు రిలీజ్ అయ్యాయి.హవాయి టూరిజం శాఖ ప్రకారం ఈ మర్రి వృక్షం సిటీ బ్లాక్ మొత్తం విస్తరించి ఉంటుందని తెలుస్తోంది. ఆ వృక్షం దాదాపు 60 ఫీట్ల ఎత్తు వరకు ఉంటుందని హవాయి టూరిజం శాఖ తెలిపింది. ఈ చెట్టు కిందే స్థానిక ప్రజలు ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేవారు.1873లో ఈ వృక్షాన్ని నాటిన సమయంలో అది కేవలం రెండు మీటర్ల ఎత్తులో మాత్రమే ఉంది. లహైనాలో ప్రొటెస్టాంట్ మిషన్ వార్సికోత్సవం సందర్భంగా ఆ మర్రి మొక్కను ఇండియా గిఫ్ట్‌గా ఇచ్చినట్లు తెలుస్తోంది. హవాయి దీవులు అమెరికాలో చేరడానికి 25 ఏళ్ల ముందే ఈ వృక్షాన్ని నాటారు.
తాజా దావానలంలో ఆ చెట్టు ఆకులు, చిన్న చిన్న కొమ్మలు కాలిపోయాయి. కానీ ఆ మహావృక్షానికి చెందిన కాండాలు మాత్రం కాలిపోలేదు. ఆ చెట్టు వేళ్లకు కూడా ఏమీకాలేదు. అంటే ఆ వృక్షంలో జీవం ఉందని, మళ్లీ లహైనా పట్టణం జీవం పోసుకుంటుందని స్థానికులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.లహైనాలో కార్చిచ్చులో ఎలా స్టార్ట్ అయ్యిందో తెలియదు. కానీ మంగళవారం రాత్రి ఆ పట్టణంలో బీభీత్సం సృష్టించింది. బలమైన గాలుల ధాటికి ఆ పట్టణంలో ఉన్న వృక్షాలన్నీ దగ్దం అయ్యాయి. ఇక బిల్డింగ్‌లు ధ్వంసం అయ్యాయి. కార్లు కూడా ఆ మంటల్లో కాలిబూడిదయ్యాయి. కార్లలో కూర్చుకున్న కొందరు ఆ వేడి తట్టుకోలేక వెళ్లి సముద్రంలో దూకారు. గాలిలో లేచి వస్తున్న అగ్ని కీలల వల్ల కూడా ప్రజలు ఇబ్బందులు పడ్డారు. తెల్లవారేలోగా ఆ పట్టణం ఓ మరుభూమిలా మారింది. తాజా సమాచారం ప్రకారం హవాయి ద్వీప అగ్ని ప్రమాదంలో మృతిచెందిన వారి సంఖ్య 53కి చేరింది.