- సీతమ్మసాగర్ పూడిక లో నిబంధనలు బేఖాతర్..
- పర్యావరణ అనుమతుల మినహాయింపు దుర్వినియోగం
- జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాలను పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం
- కేంద్ర పర్యావరణ జలశక్తి శాఖల మార్గదర్శకాలనూ లెక్కచేయని వైనం
- రాష్ట్రస్థాయి సాంకేతిక సలహా కమిటీ నియామకంలో జాప్యం
పూడిక పేరుతో సీతమ్మసాగర్ లో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఇసుక తవ్వకాల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఎటువంటి సాంకేతిక అధ్యయనం చేయకుండా పర్యావరణ అనుమతులు తీసుకోకుండా దొడ్డిదారిన జరుగుతున్న ఈ అక్రమ తవ్వకాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం న్యాయ వివాదంలో కూడా చిక్కుకుంది. నదులు, రిజర్వాయర్లలో పూడిక తీయడానికి పర్యావరణ అనుమతులు అవసరం లేదంటూ గతంలో కేంద్ర పర్యావరణ శాఖ S.O. No. 1224 (E) dated 28.03.2020 ఇచ్చిన మినహాయింపును దుర్వినియోగం చేస్తున్నారంటూ దాఖలైన దరఖాస్తులో జాతీయ హరిత ట్రిబ్యునల్ ఢిల్లీ ప్రిన్సిపల్ బెంచ్ స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. ‘‘ మినహాయింపు అనేది విచక్షణా రహితమైన సంపూర్ణ మినహాయింపుగా ఉండకూడదు. దానికి బదులుగా తవ్వకాల విధానం మరియు అనుమతించే తవ్వకాల పరిమాణానికి సంబంధించిన తగిన రక్షణాత్మక షరతులు , నియంత్రణలతో కూడి ఉండాలి’’ అని ఎన్టీటీ స్పష్టం చేసింది. నోబుల్ ఎమ్. పైకాడ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ అదర్స్ దాఖలు చేసిన దరఖాస్తు నంబర్ 190/2020 లో పర్యావరణ శాఖ జారీ చేసిన మినహాయింపు ఉత్తర్వులను పునస్సమీక్షించాలని కూడా ఆదేశించింది.
MOEF Letterఎన్జీటీ ప్రిన్సిపల్ బెంచ్ ఆదేశాల తర్వాత రిజర్వాయర్లు, నదుల పూడికపై కేంద్ర జలశక్తి శాఖ, కేంద్ర పర్యావరణ శాఖ సంయుక్తంగా ఒక జాతీయ విధాన పత్రాన్ని (National Frame Work for Sediment Management) తయారు చేశారు. ఈ విధాన పత్రాన్ని పరిశీలించిన నిపుణుల కమిటీ కీలకమైన సూచనలను చేసింది. నదులు, రిజర్వాయర్ల పూడిక కోసం చేసే తవ్వకాల సందర్భంగా పర్యావరణ సంబంధిత అంశాలను పరిగణలోకి తీసుకోవాలని అభిప్రాయపడింది. పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన అన్ని అంశాలను పరిగణలోకి తీసుకునే సమగ్ర విధానాన్ని రూపొందించాలని నిపుణుల కమిటీ సూచించింది. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాలతో పాటూ సాంకేతిక నిపుణుల కమిటీ సూచనల మేరకు కేంద్ర పర్యావరణ, జలశక్తి శాఖలు నదులు, రిజర్వాయర్ల పూడిక సందర్భంలో పర్యావరణ పరిరక్షణ కోసం అనుసరించాల్సిన విధివిధానాలను రూపొందించారు.

జలశక్తి శాఖ నిబంధనలు..
1. నిర్మాణం పూర్తయిన కొన్ని సంవత్సరాల తర్వాత రిజర్వాయర్లలో పూడికతో నీటి నిల్వ సామర్ధ్యం తగ్గిపోతే పూడికను తీయడానికి తగిన సాంకేతిక అధ్యయనం చేయాలి.
2. నదుల్లోనూ, రిజర్వాయర్ల ఎగువ భాగంలోనూ ప్రతి సంవత్సరం ఏ మేరకు పూడిక చేరుతోందో అంచనా వేయాలి. (Sediment Study).
3. ప్రధాన నదితో పాటూ ఉపనదుల పరీవాహక ప్రాంతంలో వాటర్ షెడ్ కార్యక్రమం అమలు చేయడం ద్వారా దీర్ఘకాలిక పూడిక సమస్యను అధిగమించాలి.
4. తీర ప్రాంతం కోతకు గురికాకుండా తగిన చర్యలు తీసుకోవాలి.
5. నదీ తీరంలోని గట్లపై చెట్లు నాటాలి.
6. పూడిక పేరుతో ఇసుక తీయాలంటే జిల్లా ఇసుక నివేదిక (డీఎస్ఆర్) తయారు చేయాలి.
7. పూడిక ద్వారా జరిగే పర్యావరణ నష్టంపై (ఎన్విరాన్ మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్) మదింపు నివేదిక తయారు చేయాలి.
8. పర్యావరణ నష్టాన్ని అధిగమించడానికి పర్యావరణ నిర్వహణ నివేదిక (ఎన్విరాన్మెంట్ మేనేజ్ మెంట్ ప్లాన్) తయారు చేయాలి.
9. వాణిజ్య అవసరాల కోసం ఇసుక తవ్వితే 2016, 2020 సంవత్సరాల్లో కేంద్ర పర్యావరణ శాఖ జారీ చేసిన Sustainable Sand Mining Rules విధిగా పాటించాలి.
10. నదుల్లో, రిజర్వాయర్లలో పూడిక తీయడానికి రాష్ట్ర స్థాయిలో నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో ఒక సాంకేతిక సలహా కమిటి నియమించాలి. నీటిపారుదల, మైనింగ్, భూగర్భజలాలు, కాలుష్య నియంత్రణ మండలి తదితర ఉన్నతాధికారులు ఈ కమిటీలో సభ్యులుగా ఉండాలి. కేంద్ర జలశక్తి శాఖకు చెందిన ప్రాంతీయ చీఫ్ ఇంజనీర్ ఈ కమిటీలో సభ్యుడిగా ఉండాలి. ఏదైనా నది లేదా రిజర్వాయర్ లోపూడిక తీయడానికి ముందుగా సాంకేతిక, పర్యావరణ నివేదికలను తయారు చేసి రాష్ట్ర స్థాయి సాంకేతిక సలహా కమిటీ ముందుంచాలి. ఈ కమిటీ ఆమోదిస్తేనే పూడిక పనులు చేపట్టాలి.
సీతమ్మసాగర్ పూడికలో అన్నీ అక్రమాలే..
జాతీయ హరిత ట్రిబ్యునల్, కేంద్ర పర్యావరణ, జలశక్తి శాఖల ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం తుంగలోకి తొక్కి యథేచ్ఛగా పూడిక పేరుతో దొడ్డిదారిన ఇసుక తవ్వకాలను కొనసాగిస్తున్నది. పూడికను సమర్ధించుకునే సాంకేతిక నివేదికలు కానీ, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన ప్రణాళికలను కానీ తయారు చేయలేదు. వేల కోట్ల రూపాయల విలువ చేసే కోట్లాది క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వకాల కోసం అనుమతుల నిచ్చి పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతున్నది. నదులను, ప్రాజెక్టులను రక్షించ వలసిన నీటిపారుదల శాఖ అధికారులు భక్షకులుగా మారి పోయారు. సీతమ్మసాగర్ ఇసుక తవ్వకాలను సవాలు చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాలకు చెందిన పలువురు రైతులు ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరడానికి ఆదివాసీ సంఘాలు సమాయత్తమయ్యాయి.

మేడిగడ్డ అన్నారం బ్యారేజీల పూడికపైనా ఎన్టీటీ ఆగ్రహం
మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల వద్ద కూడా డీసిల్టేషన్ పేరుతో గతంలో భారీగా ఇసుక తవ్వకాలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఎన్జీటీ, హైకోర్టు తప్పుపట్టాయి. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఢిలీ ప్రిన్సిపల్ బెంచ్ లో ’రేలా‘ స్వచ్ఛంద సంస్థ వేసిన పిటీషన్ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. జిల్లా ఇసుక నివేదిక, పర్యావరణ మదింపు, పర్యావరణ నిర్వహణ ప్రణాళిక వంటి నివేదికలను తయారు చేసింది. సీతమ్మసాగర్ పూడిక విషయంలో ఇటువంటి చర్యలు చేపట్టకుండానే రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తున్నది.