పంద్రాగస్టు వేడకలను ఘనంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. స్వాతంత్య్ర దినోత్సం సందర్భంగా గోల్కొండ కోటలో సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రెండు, మూడు రోజుల నుంచి అక్కడ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల రిహార్సల్ కూడా నిర్వహిస్తున్నారు. శుక్రవారం కూడా పోలీసులు తమ రిహార్సల్స్ ను కొనసాగించారు. అడిషనల్ డీజీపీ స్వాతిలక్రా రిహర్సల్స్ను పర్యవేక్షించారు. సుమారు 400 మంది పోలీసులు ఈ రిహార్సల్స్ లో పాల్గొన్నారు.
కోటకు చుట్టూ ఐదు కిలోమీటర్ల పొడవునా ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. కౌంటర్ ఇంటెలిజెన్స్, ఇంటెలిజెన్స్, ఆక్టోపస్, ఎస్బీ, సీఏఆర్, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్, సిఆర్పిఎఫ్, తెలంగాణ స్టేట్ పోలీస్, సిటీ సెక్యూరిటీ వింగ్ బృందాలు రెండు వారాలుగా భద్రతపై కసరత్తు చేస్తున్నాయి. కాగా, ఈ నెల 15న స్వాతంత్య్రదిన వేడుకల ఏర్పాట్లపై ఇప్పటికే సీఎస్ శాంతి కుమారి ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించి ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. వేడుకల్లో ఉదయం 10 గంటలకు సీఎం కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. అంతకు ముందు సికింద్రాబాద్ పరేడ్గ్రౌండ్లో అమరవీరుల స్మారకస్థూపం వద్ద స్వాతంత్య్ర సమరయోధులకు నివాళులు అర్పిస్తారు.