బెంగాల్ సిఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు
పశ్చిమ బెంగాల్ హత్యాచార ఘటనకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగిస్తున్న జూనియర్ వైద్యులకు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య చర్చల విషయమై ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల ప్రయోజనం కోసం అవసరమైతే తాను రాజీనామా చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఆర్జీ కర్ ఘటనలో బాధితురాలికి న్యాయం చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. వైద్యులతో సమావేశం కోసం గురువారం దాదాపు రెండు గంటలపాటు ఎదురుచూశానని, అయినప్పటికీ వారి నుంచి స్పందన లేకుండా పోయిందన్నారు.
‘ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిధిలో ఉంది. అందువల్ల.. జూనియర్ వైద్యులు డిమాండ్ చేసినట్లు చర్చలను ప్రత్యక్ష ప్రసారం చేయలేం. అయితే.. ఈ భేటీని వీడియో రికార్డింగ్‌కు అనుమతిస్తాం. సుప్రీంకోర్టు అనుమతితో ఆ ఫుటేజీని వైద్యులకు అందజేస్తాం. చర్చలు జరిపేందుకు ఇప్పటికే మూడుసార్లు యత్నించాను. వైద్యులు విధులకు దూరంగా ఉండటంతో ఏడు లక్షల మంది రోగులు ఇబ్బందులు పడుతున్నారు. 27 మంది మృతి చెందారు. ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్లపై ఎలాంటి చర్యలు తీసుకోను. పెద్దవాళ్లం కాబట్టి వారిని క్షమిస్తాను‘ అని మమతా బెనర్జీ చెప్పారు.