- గోదావరి తీరంలో మురుగునీటి కంపు
- జీవనదిలో కలుస్తున్న డ్రైనేజి నీరు
- డంపింగ్ యార్డుతో భక్తుల విల విల
- అడుగడుగునా పందుల కళేబరాలు
- గ్రామ పంచాయితీ నిర్వాకం
- మూలన పడిన మురుగునీటి శుద్ధి కేంద్రం
- దృష్టి సారించని జిల్లా యంత్రాంగం
శ్రీరాముడు కొలువైన చారిత్రక పుణ్యక్షేత్రం వద్ద గోదావరి నది కాలుష్య కాసారంగా మారిపోయింది. వేలాది మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచిరించే ప్రదేశంలో ఒక వైపు మురుగునీరు, మరొక వైపు డంపింగ్ యార్డు వారిని తీవ్ర అసౌకర్యానికి గురి చేస్తున్నాయి. కంచె చేను మేసినట్టు పర్యావరణ చట్టాలను కాలరాస్తూ ప్రభుత్వమే నదీ కాలుష్యానికి పాల్పడడం ఆశ్యర్యం కలిగిస్తున్నది. రామాలయానికి ఆవలి తీరంలో ఐటీసీ పేపర్ మిల్లు పారిశ్రామిక వ్యర్థాలను గోదావరిలోకి వదులుతుంటే వారిపై చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వ యంత్రాంగం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తూ మరొక వైపు యధేచ్ఛగా మురుగునీటిని జీవనదిలోకి వదలడం పట్టణ ప్రజలతో పాటు పరీవాహక ప్రాంత వాసులను కలవరానికి గురి చేస్తున్నది.
ఏజెన్సీ ప్రాంతానికి కేంద్రంగా దిన దినాభివృద్ధి చెందుతున్న భద్రాచలం పట్టణ జనాభా 70 వేలకు దాటిపోయింది. మరో వైపు పంచాయితీ అధికారుల అవినీతి కూడా పరాకాష్ఠకు చేరుకున్నది. ప్రణాళికా బద్ధంగా తీర్చి దిద్దాల్సిన పట్టణంలో అక్రమ కట్టడాలు పెరిగి పోవడం వెనుక మాఫియాతో చేతులు కలిపిన అధికారుల పాత్ర కూడా విమర్శలకు తావిస్తున్నది. భూమి బదలాయింపు నిషేధిత చట్టం 1/70 అమల్లో ఉన్నా అక్రమ లావాదేవీలకు పాల్పడిన భవన నిర్మాణదారులకు వెన్ను దన్నుగా అధికారులు నిలుస్తున్నారు.
ఎటువంటి అనుమతులు లేకుండా భవనాలు నిర్మిస్తున్నా కనీసం డ్రైనీజీ సౌకర్యం కల్పించక పోయినా బహుళ అంతస్తుల భవనాలకు ఇంటి నంబర్లు కేటాయిస్తూ తమ బొక్కసాలు నింపుకుంటున్నారు. పట్టణంలో పెరిగిపోతున్న మురుగునీటిని కరకట్ట స్లూయిజ్ ద్వారా గోదావరి నదిలోకి వదులుతున్నారు.
ఈ నీరు స్నాన ఘట్టాల వద్ద చేరడంతో కలుషిత నీటితోనే భక్తులు స్నానాలు ఆచరిస్తున్నారు. మురుగు నీటిని గొట్టాలు, కాల్వల ద్వారా కొంత దూరం మళ్ళించినప్పటికీ గోదావరిలో కలిసే ఈ నీటిని తీర ప్రాంత వాసులు తాగుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు స్లూయిజ్ ద్వారా వదిలిన మురుగునీరు స్నాన ఘట్టాల వద్ద కలుస్తున్న దృశ్యాలు కనిపించాయి.
పడకేసిన మురుగునీటి శుద్థి కేంద్రం..
మురుగు నీరు గోదావరిలో వదలకుండా శుద్థి చేసి పొలాలకు మళ్ళించాలనే ఆశయంతో గతంలో రూ. 2 కోట్లతో మంజూరు చేసిన శుద్థి కేంద్రం ప్రారంభించకుండానే పడకేసింది. మురుగునీటిని ఐటీడీఏ సమీపంలో నిర్మించిన శుద్థి కేంద్రానికి మళ్ళించి అక్కడ శుద్థి చేసిన నీటిని పాండ్స్ లోకి మళ్ళించడానికి ఏర్పాట్లు చేసినా అవి ఆచరణకు నోచుకోలేదు. ఫలితంగా అక్కడ ఏర్పాటు చేసిన మోటర్లు కూడా శిథిలావస్థకు చేరుకున్నాయి. కట్టడాలు వృధాగా పడి ఉన్నాయి. దీని కోసం ప్రజారోగ్య శాఖ ఖర్చు పెట్టిన నిధులు పూర్తిగా దుర్వినియోగమయ్యాయి.
గోదావరిలోనే డంపింగ్ యార్డు…
గోదావరి నదీ తీరం వద్ద లోపలి భాగంలో గ్రామ పంచాయితీ డంపింగ్ యార్డు ఏర్పాటు చేయడం పర్యావరణ విధ్వంసానికి పరాకాష్ఠగా చెప్పవచ్చు. భక్తులు స్నానాలు ఆచరించి సేద తీరే ప్రాంతంలోనే ఏర్పాటు చేసిన
డంపింగ్ యార్డులో పట్టణం నుంచి తెచ్చే తడి, పొడి చెత్తను వేయడంతో ఆ ప్రాంతమంతా దుర్గంధంతో నిండి పోయింది. గోదావరికి వరదలు వచ్చినప్పుడు డంపింగ్ యార్డులోకి నీరు వచ్చి చెత్తతో నిండి కుళ్ళి పోయిన పదార్థం నీటిలో కలిసి నది మొత్తం కలుషితమవుతున్నది.
పట్టణం లోని సెప్టిక్ ట్యాంకుల నుంచి సేకరించే దుర్గంధం కూడా గోదావరి తీరంలోనే పడవేయడం కూడా పట్టణ వాసులతో పాటు రామాలయానికి వచ్చే భక్తులను కూడా కలవర పెడుతున్నది. డంపింగ్ యార్డును అను నిత్యం తగల బెట్టడంతో పొగ, వాసన పట్టణమంతా వ్యాపిస్తున్నది. మృతి చెందిన పందులను కూడా డంపింగ్ యార్డు వద్దే పడవేయడంతో వాటి కళేబరాలు అడుగడుగునా దర్శనమిస్తున్నాయి. కరకట్ట మీదకు వెళ్ళిన వారు అక్కడ నిలవలేనంత వాసన వస్తున్నది. ఇప్పటి కైనా జిల్లా యంత్రాంగం స్పందించి గోదావరి కాలుష్యాన్ని నివారించడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
కొండూరి రమేష్ బాబు..