- వివాదాస్పదమవుతున్న ఐటీడీఏ
- ధనదాహంతో గ్రామ సభల నిర్వహణ
- అడుగడుగునా నిబంధలకు తూట్లు
- అనుమతులు రాకున్నా ఆత్రం
- కాసులు కురిపిస్తున్న ఇసుక రీచ్ లు
- ఇద్దరు అధికారుల పాత్ర కీలకం
- కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్
అది గిరిజనుల అభివృద్థి, సంక్షేమం కోసం పాటు పడవలసిన కార్యాలయం..ఐటీడీఏ పేరు కాస్తా ఇటీవల ఇసుక కార్యాలయంగా మారిపోయింది. ఆదివాసీలు వెళ్ళినా అక్కడ పనులేమీ కావు. నిధులు అంతకంటే లేవు. అనధికార గిరిజనేతర ఇసుక కాంట్రాక్టర్ల అడ్డాగా మారిపోయింది. ఇసుక రీచ్ ల అనుమతుల్లో భాగంగా గ్రామ సభల అనుమతి కావాలనే నిబంధన ప్రకారం ఐటీడీఏకి గ్రామసభల నిర్వహణ బాధ్యతలను అప్పగిస్తారు. ఇదే అదనుగా కార్యాలయంలో పనిచేసే ఇద్దరు కింది స్థాయి అధికారులు హస్త లాఘవం ప్రదర్శిస్తున్నారు. ఇసుక రీచ్ ల నిర్వహణ పేరుకు ఆదివాసీ సహకార సంఘాలకి అప్పగిస్తున్నప్పటికీ వ్యవహారలన్నీ కాంట్రాక్టర్లే చక్క దిద్దుతుంటారు. వీరు ఐటీడీఏ అధికారుల చేతులు తడిపి పనులు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా అవినీతి అధికారులు పలుమార్లు అత్యుత్సాహం చూపిస్తుంటారు. 50 వేలు లంచంగా ముట్ట చెప్తే ఫైళ్ళు చకా చకా కదిలిపోతాయి. దీనికి తాజా ఉదాహరణగా వెంకటాపురం మండలంలోని పాలెం గ్రామ సభ వ్యవహారాన్ని చెప్పవచ్చు.
అనుమతులు రాకున్నా గ్రామసభ..
ఇసుక తవ్వకాల కోసం వివిధ శాఖల అధికారులతో కూడిన జాయింట్ ఇనస్పెక్షన్ కమిటీ సిఫారసుల మేరకు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగే జిల్లా ఇసుక కమిటి ఇసుక రీచ్ లను గుర్తించి పర్యావరణం వంటి చట్టపరమైన అనుమతుల కోసం తెలంగాణ ఖనిజాభివృద్థి సంస్థకు పంపుతుంది. పర్యావరణ అనుమతులు వచ్చిన తర్వాత రీచ్ నిర్వహణ కోసం పీసా చట్టం ప్రకారం గ్రామసభ నిర్వహించి సహకార సంఘాన్ని ఎంపిక చేస్తారు. కలెక్టర్ అనుమతితో మైనింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ గ్రామసభ నిర్వహించాలని ఐటీడీఏ కు లేఖ రాస్తారు. అయితే జిల్లా కలెక్టర్ నుంచి కానీ, మైనింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కానీ ఎటువంటి లేఖ రాక పోయినా వెంకటాపురం మండలం పాలెం ఇసుక రీచ్ విషయంలో ఐటీడీఏ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. కాంట్రాక్టర్ ప్రలోభాలకు లొంగి ముందుగానే గ్రామసభ నిర్వహణ కోసం భద్రాచలం ఐటీడీఏ పీఓకు లేఖ పంపారు. గ్రామసభ నిర్వహించాలని ఒక సహకార సంఘం కోరిందని ఆ లేఖలో పేర్కొన్నారు. పాత్రాపురం గ్రామ పంచాయితీ పరిథిలో మూడు సహకార సంఘాలుండగా కేవలం ఒక సహకార సంఘం కోరితే గ్రామసభ నిర్వహించాలని నిర్ణయించడం వివాదాస్పదమైంది. గ్రామసభ నిర్వహించడానికి సహకార సంఘానికి ఎటువంటి సంబంధం లేదు. లేఖలో ఒక సహకార సంఘం పేరు రాయవద్దని గతంలోనే కలెక్టర్ సూచించారు. రీచ్ మంజూరైందో లేదో తెలియకుండా ఐటీడీఏ అధికారులు గ్రామసభ నిర్వహించాలని నిర్ణయించడం వెనుక రామచంద్రాపురం గ్రామానికి చెందిన ఒక కాంట్రాక్టర్ హస్తం ఉన్నట్లు తెలిసింది. గతంలో ఆయన నిర్వహించిన ఇసుక రీచ్ లో అవకతవకలకు పాల్పడిన సందర్భంగా జిల్లా కలెక్టర్ కొంత కాలం నిలిపివేశారు. పాలెం గ్రామ సభ వ్యవహారాన్ని కలెక్టర్ దృష్టికి గ్రామస్తులు తీసుకు వెళ్ళారు.
గుణపాఠం నేర్వని అధికారులు..
ఏటూరునాగారం ఐటీడీఏలో ఏండ్ల తరబడి తిష్ట వేసిన ఇద్దరు అధికారులు అవినీతికి చిరునామాగా మారిపోయారు. కొత్తగా వచ్చే ప్రాజెక్టు అధికారిని పక్కదారి పట్టించడం పరిపాటిగా మారిపోయింది. వీరిపై ఎన్ని విమర్శలు వచ్చినా, ఫిర్యాదులు అందినా ఎవరూ పట్టించుకోక పోవడంతో వారు ఆడిందే ఆటగా మారి పోయింది. గతంలో ఆదివాసీ సంఘాలు ఆందోళన బాట పట్టినా అవినీతి అధికారులను ఇక్కడి నుంచి పంపక పోవడం విశేషం. ముందుగా ఐటీడీఏ ను ప్రక్షాళణ చేస్తేనే తమకు న్యాయం జరుగుతుందని ఆదివాసీలు అంటున్నారు.
కొండూరి రమేష్ బాబు