- ఈ నెల 21 నుంచి ఓటర్ల జాబితాా సవరణ కార్యక్రమం జరుగుతుందన్న చంద్రబాబు
- ఇంటింటికీ వచ్చి బూత్ స్థాయి అధికారులు వెరిఫికేషన్ చేపడతారని వెల్లడి
- మీ ఓటు ఉందో, లేదో చెక్ చేసుకోవాలని సూచన
తమ పార్టీలకు చెందిన ఓట్లను అధికార వైసీపీ పెద్ద సంఖ్యలో తొలగిస్తోందంటూ విపక్ష నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు చేసింది. మరోవైపు ఓట్లకు సంబంధించి రాష్ట్ర ప్రజలను ఉద్దేశిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు.
ఓటు మన బాధ్యత అని, ఓటుతోనే భద్రత అని, ఓటుతోనే భవిష్యత్తుకు భరోసా అని చంద్రబాబు తెలిపారు. ఈ నెల 21 నుంచి నెల రోజుల పాటు ఏపీ వ్యాప్తంగా ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ వచ్చి ఓటర్ వెరిఫికేషన్ చేపడతారని తెలిపారు. ఈ సందర్భంగా ఓటర్ల జాబితాలో మీ ఓటు ఉందో, లేదో చెక్ చేసుకోండని సూచించారు. ఓటు లేకపోతే వెంటనే ఓటరుగా మీ పేరును నమోదు చేసుకోవాలని కోరారు.