A place where you need to follow for what happening in world cup

ఇది దేశ ముఖ చిత్రాన్ని మార్చే సమావేశం: డీకే శివకుమార్

  • ఈరోజు, రేపు బెంగళూరులో జరగనున్న విపక్షాల సమావేశం
  • ఒక మంచి ప్రారంభం కోసం విపక్షాలు ఏకమవుతున్నాయన్న డీకే
  • కర్ణాటక ఫలితాలు దేశ వ్యాప్తంగా వస్తాయని ధీమా

బెంగళూరులోని తాజ్ వెస్ట్ ఎండ్ హోటల్ లో ఈరోజు, రేపు దేశంలోని ప్రధాన విపక్షాలు సమావేశం కానున్నాయి. దాదాపు 24 విపక్ష పార్టీలు ఈ సమావేశంలో పాల్గొనబోతున్నాయి. ఆయా పార్టీలకు చెందిన అగ్ర నేతలు ఈ భేటీకి హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ… కొన్ని పార్టీలు మినహా దేశంలోని అన్ని విపక్ష పార్టీలు ఈ సమావేశానికి హాజరుకాబోతున్నాయని చెప్పారు. ఒక మంచి ప్రారంభం కోసం విపక్షాలు ఏకం అవుతున్నాయని అన్నారు.

ఈ సమావేశం ఏ ఒక్క పార్టీకి చెందినది కాదని… ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటున్న 140 కోట్ల ప్రజల భవిష్యత్తును నిర్ణయించే, దేశ ముఖ చిత్రాన్ని మార్చే సమావేశమని డీకే చెప్పారు. ఐక్యతా స్ఫూర్తితో అన్ని పార్టీలు ముందడుగు వేస్తాయని… కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు దేశ వ్యాప్తంగా వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. 2024లో దేశ ప్రజలు తమకు అధికారాన్ని కట్టబెడతారని చెప్పారు.

కలవడం అనేది ప్రారంభమని, కలిసి ఆలోచించడం పురోగతి అని, కలిసి పని చేయడం విజయమని తాను ఎప్పుడూ చెపుతుంటానని డీకే అన్నారు. ఈ సమావేశాన్ని కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తోందని చెప్పారు. పీసీసీ తరపున తాను, ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ఈ సమావేశానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో అన్ని కీలక విషయాలపై లోతుగా చర్చించి ఒక కార్యాచరణను రూపొందించడం జరుగుతుందని అన్నారు. ఉమ్మడి కార్యాచరణతో అన్ని పార్టీలు ఎన్నికలకు సన్నద్ధమవుతాయని చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.