A place where you need to follow for what happening in world cup

తిరుమల వ్యవహారంతో తెలంగాణ‌ అప్ర‌మ‌త్తం..

ఆలయాల్లో ప్రసాదాల నాణ్యతపై ఆరా
విజయ నెయ్యినే వాడాలని దేవాదాయ శాఖ ఆదేశాలు

తిరుమల లడ్డూ ప్రసాదం క‌ల్తీ  అయినట్లు తేలిన‌ నేపథ్యంలో తెలంగాణ దేవాదాయ శాఖ అప్రమత్తమైంది. రాష్ట్రంలో పలు ప్రధాన ఆలయాల్లోని లడ్డూల నాణ్యతపై ప‌రీక్ష‌లు చేపట్టింది. ప్రముఖ దేవాలయాల్లోని నెయ్యి, ఇతర పదార్థాల శాంపిల్స్‌ను అధికారులు ల్యాబ్‌కు పంపించారు. అన్ని టెంపుల్స్‌లో తనిఖీలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఇకపై ప్రసాదాల తయారీకి విజయ నెయ్యి, పాలనే వాడాలని దేవాదాయశాఖ ఆదేశించింది. భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం కావడంతో ఎలాంటి అపోహలకు తావివ్వకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. లడ్డూలు, పులిహోర తయారీలో వాడే నెయ్యి, యాలకుల పొడి, జీడిపప్పు, చక్కెర పాకం, బూందీ ఇతర ముడి సరుకుల నాణ్యతను పరిశీలించాలని అధికారులను రాష్ట్ర‌  దేవాదాయ శాఖ ఆదేశించింది.

దీంతో ఈవోలు ఆలయాల్లో తనిఖీలు చేపట్టారు. నెయ్యి శాంపిల్స్‌ను హైదరాబాద్‌ ‌లోని ల్యాబ్‌కు పరీక్షల నిమిత్తం పంపించారు. కొన్ని ఆలయాల్లో ప్రత్యేకంగా టెస్టింగ్‌ ‌కమిటీల ఆధ్వర్యంలో లడ్డూలను తయారుచేస్తున్నారు. వేములవాడ, యాదగిరిగుట్ట, భద్రాచలం, బాసర, హనుమకొండ భద్రకాళి ప్రసాదాల్లో వినియోగిస్తున్న నెయ్యి, ఇతర పదార్థాలను పరీక్షల కోసం ఇప్పటికే హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు అధికారులు పంపించారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ప్రసాదంలో వినియోగిస్తున్న నెయ్యి శాంపిల్స్‌ను సేకరించి హైదరాబాద్‌లోని  చర్లపల్లిలోని ల్యాబ్‌కు తరలించారు. యాదాద్రిలో పదేళ్లుగా మదర్‌ ‌డెయిరీ నెయ్యిని వినియోగిస్తున్నారు. నెలకు సుమారు 20 వేల నుంచి 25 వేల కిలోల నెయ్యిని వాడుతున్న‌రు. ఇక భద్రాచలంలో ప్రసాదాల తయారీకి ప్రత్యేక కమిటీని నియమించారు.

కాగా.. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి ఘటన ఎంతటి దుమారం రేపిందో అందరికీ తెలిసిందే. వైసీపీ హయాంలో శ్రీవారి లడ్డూల తయారీలో జంతువుల కొవ్వు కలిసినట్లు నిర్దారణ అయ్యింది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. తిరుమలలో కల్తీ నెయ్యి వాడకం, తిరుమలలో అపచారాలు జరిగాయని, తదితర ఆరోపణలపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు సంస్థను( సిట్‌) ఏర్పాటు చేసింది.

Leave A Reply

Your email address will not be published.