- అనుచరులకి 17 రీచ్ ల కేటాయింపు
- అమాత్యుడి సన్నిధిలో పంపకాలు
- భద్రాద్రి జిల్లాలో బినామీల అవతారం ఎత్తిన అస్మదీయులు
- నలుగురు ఎమ్మెల్యేలకు వాటా
- ఆదివాసీ సహకార సంఘాల పేరుతో భారీగా అక్రమ వ్యాపారం
- మాఫియా టార్గెట్ రూ. 100 కోట్లు
- గులాబీ కాంట్రాక్టర్ కూ పెద్దపీట
- అధికార యంత్రాంగం దాసోహం
అసలే ఇసుక రుచి తెలిసిన కాంట్రాక్టర్.. కీలక శాఖకు చెందిన మంత్రి..ఇక ఆయనకు అడ్డు అదుపు ఏముంది. గత సంత్సర కాలంగా తన అనుచరులకు ఇసుక రీచ్ లను కట్టబెట్టే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఆదివాసీ సహకార సంఘాలు నిర్వహించుకోవలసిన ఏజెన్సీ ఇసుక క్వారీలపై అమాత్యుడి కన్ను పడింది. పర్యావరణ అనుమతులు లేక పోవడంతో జాతీయ హరిత ట్రిబ్యునల్ నిలిపివేసిన సీతమ్మ సాగర్ బ్యారేజీ పూడిక పేరుతో కోట్లాది రూపాయల ఇసుకను మంత్రి అనుచరులే దక్కించుకోగా తాజాగా భద్రాద్రి జిల్లాలోని 17 ఇసుక క్వారీలను మరికొందరికి కట్టబెట్టడం ద్వారా తన పవర్ ఏంటో చూపించారు.
అన్ని అనుమతులు వచ్చిన ఇసుక రీచ్ లను మూడు నెలల పాటు పెండింగ్ లో ఉంచి చివరికి అవి ఎవరికి కేటాయించాలో ఖమ్మంలో సెటిల్మెంట్ చేశారు. నలుగురు ఎమ్మెల్యేలు వాటా దారులుగా కాగా పది మంది అనుచరులకు వీటిని పంపకాలు చేశారు. ఒక గులాబీ కాంట్రాక్టర్ కి కూడా ఎక్కువ రీచ్ లను కేటాయించడం ద్వారా మంత్రి రాజకీయ సమానత్వం చాటుకున్నారు. అధికార పార్టీతో అంటకాగుతున్న ఒక ఎర్ర పార్టీ నాయకుడికి కూడా ఒక ఇసుక రీచ్ ని కేటాయించడం విశేషం. ఇసుక రీచ్ ల వ్యవహారం ముఖ్యమంత్రి వరకూ వెళ్ళినా మంత్రి మాత్రం ఏమాత్రం తగ్గేదేలే అనే పద్దతిలో ముందుకు వెళ్తున్నారు. ఇసుక మాఫియాతో అంటకాగడంతోనే గత ప్రభుత్వం అపఖ్యాతి పాలైన విషయం తెలిసి కూడా కాంగ్రెస్ మంత్రి అదే ఊబిలో కూరుకుపోవడం వెనుక కేవలం ఆర్థిక ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టమవుతున్నది.
రూ. 100 కోట్లు టార్గెట్..
సీతమ్మసాగర్ పూడిక పేరుతో రూ. 50 కోట్లు టార్గెట్ గా పెట్టుకున్న మంత్రి మనుషులు కొత్త రీచ్ ల ద్వారా మరో రూ. 100 కోట్లు సంపాదించడానికి పావులు కదుపుతున్నారు. 17 రీచ్ లు నిర్వహించడం ద్వారా అధికారికంగా బిల్లుల రూపంలో రూ. 30.6 కోట్లు వస్తుంది. కానీ ఓవర్ లోడింగ్, జీరో వ్యాపారం, నకిలీ వేబిల్లులతో మరో 70 కోట్లు సంపాదించే దిశగా మాఫియా పన్నాగం పన్నింది.
మంత్రి పేరుతో జిల్లాలో నడుస్తున్న ఇసుక క్వారీల వైపు అధికారులు కన్నెత్తికూడా చూడడం లేదు. లారీలను తనిఖీ చేయడం లేదు. ప్రభుత్వ ఖజానాకు చిల్లు పడుతున్నా పట్టించుకునే నాధుడే లేడు. తెలంగాణ ఖనిజాభివృద్థి సంస్థ అధికారులు మంత్రికి దాసోహం అయిపోయి ఆయన సేవలో తరిస్తున్నారు. ఇసుక ఫైళ్లను మోసుకుంటూ జిల్లా కలెక్టర్ మంత్రి చుట్టూ తిరుగుతున్నారు.
అడుగడుగునా అక్రమాలు..
‘పీసా’ చట్టం ప్రకారం ఏజెన్సీ ప్రాంతంలోని ఇసుక రీచ్ లను స్థానిక ఆదివాసీ సహకార సంఘాలకు కేటాయించాలి. సహకార సంఘం ఎన్నిక ప్రక్రియను గ్రామసభల ద్వారా పూర్తి చేయాలి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గ్రామసభలను నిర్వహించకుండానే ఇసుక రీచ్ లను కేటాయిస్తున్నారు. ఆదివాసీ సహకార సంఘంతో తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ ఒప్పందం చేసుకుంటున్నది. ఇసుక తవ్వకాలు, డంపింగ్ యార్డు వరకూ రవాణా, లోడింగ్ పనులను సహకార సంఘాలే చేయాలి. ఎటువంటి థర్డ్ పార్టీ ఒప్పందాలు చేసుకోవద్దని కూడా టీజీఎండీసీ నిబంధనల్లో పేర్కొంటున్నది.
ఇదంతా కేవలం కాగితాలకే పరిమితం. సహకార సంఘాలు రాజకీయ ఒత్తిడితో బినామీ కాంట్రాక్టర్లకు పనులను అప్పగించినా జిల్లా యంత్రాంగం పట్టించుకోదు. టీజీఎండీసీ అధికారులు ఇసుక రీచ్ లను కాంట్రాక్టర్ల చేతుల్లో పెట్టి భారీగా ముడుపులు తీసుకుంటున్నారు. కింది స్థాయి ఉద్యోగులు లారీల వద్ద డబ్బు వసూలు చేసుకుంటున్నారు. ఆదివాసీ సహకార సంఘాలకు రుణ సౌకర్యం కల్సించడం ద్వారా సాధికారిత పెంచవలసిన జిల్లా కలెక్టర్ ఆ పని చేయకుండా పరోక్షంగా బినామీ కాంట్రాక్టర్లకు సహకరిస్తున్నారు. బినామీ కాంట్రాక్టర్లు గత పదేండ్లుగా జీఎస్టీ ఎగవేస్తున్నారు. ఇసుక తవ్వకాలకు యంత్ర పరికరాలను వినియోగించవద్దని పర్యావరణ అనుమతుల్లో పేర్కొంటున్నప్పటికీ ఇసుక మాఫియా భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేస్తున్నది. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ సహా అధికార యంత్రాంగానికి ఎన్ని ఫిర్యాదులు అందినా వాటిని బుట్టదాఖలు చేస్తున్నారు.
పర్యావరణ జీవన విధ్వంసం..
ఏజెన్సీ ప్రాంతం నుంచి అధిక లోడ్ లతో వెళ్తున్న లారీలతో ప్రధాన రహదారులన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి వెళ్తున్న ఇసుక లారీల ధాటికి ఇటీవల ఒక వంతెన పూర్తిగా కుంగిపోగా మరో నాలుగు వంతెనలు దెబ్బతిన్నాయి.
ఇసుక లారీలతో వచ్చే దుమ్ము ధూళితో ఏజెన్సీ ప్రాంతంలోని గ్రామాలన్నీ బూడిద మయం అయిపోయాయి. మిర్చి, జొన్న, వరి చేలు దుమ్ముతో నిండిపోతున్నాయి. ఆదివాసీలు తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారు. ప్రజారోగ్యం, పర్యావరణం గురించి పట్టించుకోని అధికార యంత్రాంగం మంత్రికి జీ హుజూర్ అంటూ కాలం గడుపుతున్నది.
నాలుగు నియోజకవర్గాల్లో పడిపోతున్న కాంగ్రెస్ గ్రాఫ్..
ఇసుక మాఫియాతో అంటకాగడంతో ఒక మంత్రి పూర్తిగా అపఖ్యాతి పాలవగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంతో పాటు మరో మూడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోతున్నది.
అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అక్కడి ఎమ్మెల్యేలు ఓటమి పాలవుతారని ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ఇటీవల నివేదిక పంపినట్లు తెలిసింది. పంచాయితీ ఎన్నికల్లో కూడా ఇసుక ప్రభావం కనిపించే అవకాశం ఉన్నదని స్థానిక కాంగ్రెస్ నేతలే అంటున్నారు.