A place where you need to follow for what happening in world cup

ఎవరి కోసం? ఎందుకోసం?..

  • ఆదివాసీల ఆదాయానికి ప్రభుత్వ గండి
  • ఇసుక సొసైటీలపై పాలక పెద్దల వివక్ష
  • సాంకేతిక అనుమతులు పొందినా కేటాయింపుల్లో జాప్యం
  • ఇద్దరు కలెక్టర్ల వద్ద మూలుగుతున్న దస్త్రాలు
  • ఉన్నతాధికారి చెప్పినా గప్ చుప్
  • ఎన్నికల షెడ్యూల్ రాబోతున్నా కదలని వైనం
  • న్యాయ పోరాటానికి ఆదివాసీ సంఘాల నిర్ణయం

ఏజెన్సీ ప్రాంతంలో ఇసుక తవ్వకాలకు అనుమతుల విషయంలో జరుగుతున్న జాప్యంపై ఆదివాసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాంకేతిక అనుమతులు వచ్చిన తర్వాత కూడా ఆదివాసీ సొసైటీలకు తుది ఉత్తర్వులు ఇవ్వకుండా ఇద్దరు కలెక్టర్లు చేస్తున్న జాప్యం వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉన్నదని ప్రచారం జరుగుతున్నది. ఇసుక తవ్వకాల వ్యవహారంలో ప్రభుత్వ తీరు చూస్తే కొండ నాలుక్కి మందేస్తే అసలు నాలుక పోయిందనే చందంగా తయారైంది. ఇసుక తవ్వకాల కోసం రాష్ట్రంలో కొత్త విధానం అమల్లోకి తెస్తారని ఊహాగానాలు చెలరేగినప్పటికీ గత రెండు నెలలుగా ఈ దిశగా ప్రభుత్వం ఎటువంటి అడుగులూ వేయలేదు.

‘పీసా’ చట్టం ప్రకారమే ఇసుక తవ్వకాలు..

ఏజెన్సీ ప్రాంతంలో అమల్లో ఉన్న ‘పీసా’ చట్టం ప్రకారం ఇసుక సహా చిన్న తరహా ఖనిజాలపై ఆదివాసీలకు పూర్తి హక్కు ఉన్నది. ఈ ప్రాంతంలో ఇసుక తవ్వకాలను చట్ట ప్రకారం ఆదివాసీ సహకార సంఘాలకు కేటాయించాలని 2014 వరకూ అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించగా అదే విధానాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కొనసాగించింది. ఈ మేరకు 2014 లో జీవో నంబర్ 38 (పరిశ్రమలు మరియు ఖనిజాలు) ద్వారా కొత్త ఇసుక విధానాన్నిఅమల్లోకి తీసుకురాగా జీవో నంబర్ 3 ద్వారా విధివిధానాలను కూడా జారీ చేసింది. ఇదే విధానం ప్రస్తుతం కూడా అమల్లో ఉన్నది.

ఇసుక తవ్వకాలను ఆదివాసీ సహకార సంఘాలకు కేటాయించినప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వం 2020 నుంచీ బిల్లులు చెల్లించకుండా జాప్యం చేయడంతో ఆదివాసీలకు రావలసిన కనీస ఆదాయం కూడా రాకుండా పోయింది. ఇసుక ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఇతర అవసరాల కోసం గులాబీ ప్రభుత్వం మళ్ళించి కొండంత అపకీర్తి కూడగట్టుకుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పాత బకాయిలు చెల్లిస్తారని ఆశించిన అదివాసీ సంఘాలకు మళ్ళీ నిరాశే మిగిలింది. పాత బకాయిలు చెల్లించక పోగా కొత్త ఇసుక రీచ్ ల తుది అనుమతులకు సంబంధించిన ఫైళ్లను తొక్కి పెట్టడం వివాదాస్పదంగా మారింది.

కాలపరిమితి ముగుస్తున్నా..

ఏజెన్సీ ప్రాంతంలో 26 కొత్త ఇసుక రీచ్ లకు గత సంవత్సరమే పర్యావరణ అనుమతులు వచ్చాయి. వీటిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 14, ములుగు జిల్లాలో 12 ఉన్నాయి. పర్యావరణ అనుమతుల కాలపరిమితి కూడా మే, జూన్ నెలల్లో ముగుస్తుంది. ఇప్పుడు అనుమతులు ఇచ్చినా కేవలం రెండు నెలల కాలంలో ఇసుక తవ్వకాలను పూర్తి చేయాలి. ఈ దశలో కూడా ప్రభుత్వం స్పందించక పోవడంతో ఆదివాసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సోమవారం కొత్తగూడెం, ములుగు జిల్లాల కలెక్టర్ల వద్దకు వెళ్ళి మొర పెట్టుకుంటున్నా వారు నోరు మెదపక పోవడం విశేషం.

మంత్రి పేరుతో ప్రచారం..

ఖమ్మం జిల్లాకు చెందిన ఒక మంత్రి భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో గిరిజన సహకార సంఘాలకు సంబంధించిన ఇసుక రీచ్ ల అనుమతులను అడ్డుకుంటున్నారని అధికారులే బాహాటంగా చెప్తున్నారు. అనుమతులు ఇవ్వకుండా ఆయన ఎందుకు అడ్డకుంటున్నారో ఎవరికీ అంతుపట్టడం లేదు. కొన్ని గిరిజన సంఘాల ప్రతినిధులు ఇటీవల సదరు మంత్రిని కలిసి అనుమతులను ఇప్పించ వలసిందిగా కోరారు. ఇటీవల భద్రాద్రి జిల్లాలో పర్యటించిన ఆ మంత్రిని కలిసిన అధికారులు కూడా ఆదివాసీ ఇసుక సంఘాలకు అనుమతుల విషయాన్ని ఆయన దృష్టికి తీసుకు వెళ్ళారు. అయినా మంత్రి స్పందన శూన్యం. రాష్టంలో ఇసుక కొరత ఉండటంతో మైనింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి బెన్హర్ మహేశ్ దత్ ఎక్కా భద్రాద్రి కొత్తగూడెం, ములుగు కలెక్టర్లకు ఫోన్ చేసి పెండింగ్ ఫైళ్ళను క్లియర్ చేయల్సిందిగా ఆదేశించారు. అయినా ఫైళ్ళు పరిష్కారానికి నోచుకోలేదు.

కలెక్టర్ల తీరుపైనా విమర్శలు..

ప్రభుత్వ నిబంధల ప్రకారం చర్యలు తీసుకోవాల్సిన భద్రాద్రి, ములుగు జిల్లాల కలెక్టర్ల పనితీరుపైనా విమర్శలు పెల్లుబుకుతున్నాయి. గత సంవత్సరం సెప్టెంబర్ నెలలోనే ఆదివాసీ ఇసుక సొసైటీలకు ఇసుక తవ్వకాలు కేటాయించే ఫైళ్ళు వారి ముందుకు వచ్చాయి. జిల్లా ఇసుక కమిటీల చైర్ పర్సన్ లుగా వ్యవహరిస్తున్న కలెక్టర్లు పెండింగ్ ఫైళ్ళను పరిష్కరించలేదు. పర్యావరణ అనుమతులతోపాటు అన్ని అనుమతులు వచ్చిన ఫైళ్ళను తొక్కి పెట్టడం ద్వారా తమకు అన్యాయం చేశారని ఆదివాసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి. అక్టోబర్ 10 న అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రావడంతో ఇసుక ఫైళ్ళను పక్కన పడేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా కలెక్టర్లు నిబంధనల ప్రకారం వ్యవహరించలేదు.

భద్రాద్రి కలెక్టర్ సెప్టెంబర్ నెలలో చార్జి తీసుకోగానే మూడు పట్టా భూములు, మూడు ఆదివాసీ సహకార సంఘాల ఇసుక తవ్వకాలకు అనుమతులను ఇచ్చారు. మిగిలిన పెండింగ్ ఫైళ్ళను పట్టించుకోలేదు. పెండింగ్ లో ఉన్న ఆదివాసీ సహకార సంఘాల ఇసుక ఫైళ్ళ పరిష్కారం కోసం అక్టోబర్ 7 న జిల్లా ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. పెండింగ్ లో ఉన్న ఫైళ్ళకు అనుమతులు ఇవ్వాలను జిల్లా ఇసుక కమిటీ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది.
వెంటనే ఫైనల్ ప్రొసీడింగ్ ఇవ్వకుండా కలెక్టర్ ఫైల్ ను తన వద్దే పెట్టుకున్నారు. మరో మూడు రోజుల్లో షెడ్యూల్ వస్తున్నదని తెలిసి కూడా ఉత్త్వర్వులు ఇవ్వకుండా జాప్యం చేశారు.

ఉన్నతాధికారి వసూళ్ళ పర్వం…

సందట్లో సవేమియా అన్నట్లుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక అనుమతుల కోసం జిల్లాలో ద్వితీయ స్థాయిలో ఉన్న ఒక ఉన్నతాధికారి ఆదివాసీ సహకార సంఘాలను కూడా వదలి పెట్టకుండా భారీగా వసూళ్ళకు పాల్పడ్డారు. ఈ వ్యవహారం కలెక్టర్ దృష్టికి వెళ్ళినా దర్యాప్తునకు ఆదేశించలేదు. అనుమతులు రాక పోవడంతో అధికారి వసూలు చేసిన డబ్బును తిరిగి ఇప్పించాలని ఆదివాసీ సంఘాలు కోరుతున్నాయి.

న్యాయ పోరాటం తప్పదా?

చట్ట ప్రకారం అన్ని అనుమతులూ వచ్చిన తర్వాత కూడా ఇసుక తవ్వకాలను అనుమతి ఇవ్వక పోవడంతో ప్రభుత్వంపై న్యాయ పోరాటం చేయాలని ఆదివాసీ సంఘాలు సమాయ త్తమవుతున్నాయి. ఈ మేరకు త్వరలో హై కోర్టును ఆశ్రయిస్తామని ఇసుక సహకార సంఘాల ప్రతినిధులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.