A place where you need to follow for what happening in world cup

ములుగు జిల్లాలో ఇసుక భూకంపం..

  • అవినీతి రాక్షసుడిగా మారిన అధికారి
  • కాసుల కక్కుర్తితో మళ్ళీ సర్వే
  • మాఫియా కోరిన ప్రదేశాల్లో కొత్త రీచ్ లు
  • కలెక్టర్ కి చెప్పకుండానే నిర్ణయాలు
  • రెండు మండలాల్లో 73 క్వారీలు టార్గెట్
  • సీఎం దృష్టికి ఇసుక వ్యవహారం

భూకంపంతో గోదావరి లోయ వణికి పోతుంటే అవినీతి రాక్షసుడిగా మారిన ఒక అధికారి మాఫియా కోరిన ప్రదేశాల్లో కొత్త రీచ్ ల కోసం సర్వే చేస్తున్నాడు. భూకంప ప్రమాద ప్రాంతంగా గుర్తించిన గోదావరి లోయలో మరిన్ని భూకంపాలు వచ్చే అవకాశం ఉన్నదని భూభౌతిక శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మరో వైపు విచక్షణా రహితంగా జరుగుతున్న ఇసుక తవ్వకాల ప్రభావం భూకంపంపై ఎంతవరకూ ఉండవచ్చనని కూడా వారు అధ్యయనం చేస్తున్నారు. ఇదంతా పట్టించుకోని అవినీతి అధికారి తన పని తాను చక్కపెట్టుకుంటున్నాడు. ములుగు జిల్లాలోని కేవలం రెండు మండలాల్లో ఇప్పటికే 58 ఇసుక రీచ్ ల కోసం సర్వే చేసి వివాదాల్లో ఇరుక్కున్న అధికారి మరో 15 రీచ్ ల కోసం ధరకాస్తు పెట్టించి సర్వేల పేరుతో హంగామా చేస్తున్నాడు. 2022, 2023 సంవత్సరాల్లో సర్వే చేసిన కొన్ని రీచ్ లను అప్పటి కలెక్టర్ పక్కన పెట్టినా కొత్త కలెక్టర్ రాగానే వాటిని జిల్లా ఇసుక కమిటీ ముందు పెట్టి అనుమతులు తీసుకోవడానికి పావులు కదిపాడు. ఇసుక మాఫియాకు సలహాలు ఇస్తూ ఒక్కొక్క రీచ్ కి రూ. 5 లక్షల వరకూ తీసుకుంటున్న ఆ అధికారి అవినీతి భాగోతం సీఎం కార్యాలయం వరకూ చేరింది.

ములుగు జిల్లాలో గోదావరి తీరంలో కన్నాయిగూడెం, ఏటూరునాగారం, మంగపేట, వాజేడు, వెంకటాపురం మండలాల్లో ఉండగా వీటిలో మూడు మండలాలు పూర్తిగానూ, రెండు మండలాలు పాక్షికంగానూ వన్యప్రాణుల అభయారణ్యానికి సంబంధించిన ఎకో సెన్సిటివ్ జోన్ లో ఉన్నాయి. ఫలితంగా వెంకటాపురం, మంగపేట మండలాల్లోని కొంత ప్రాంతంలో మాత్రమే ఇసుక రీచ్ లకు అనుమతులు ఇచ్చే అవకాశం ఉన్నది. ఈ రెండు మండలాలపై ఇసుక మాఫియా కన్ను పడింది. కాసులు కురిపిస్తున్న ఇసుక రీచ్ లకు అనుమతులు ఇచ్చే కీలక శాఖ అధికారి అడుగడుగునా అక్రమాలకు పాల్పడుతూ లెక్కకు మించిన ఇసుక రీచ్ లను మంజూరు చేయించే పనిలో పడ్డాడు. జిల్లా ఇసుక కమిటీ చైర్మన్ గా వ్యవహరిస్తున్న జిల్లా కలెక్టర్ ని కూడా పక్కదారి పట్టిస్తున్నాడు.

గత నెలలో టీజీఎండీసీకి ప్రాథమిక అనుమతులనిచ్చిన 30 ఇసుక రీచ్ ల వ్యవహారం వివాదాస్పదమైంది. ఇసుక రీచ్ ల మధ్య 500 మీటర్ల దూరం లేక పోవడం, గోదావరి వెడల్పులో ఐదవ వంతు దూరం పాటించక పోవడంతో జిల్లా యంత్రాంగం విమర్శల పాలయింది. ఈ వివాదం సమసి పోక ముందే గత శనివారం జిల్లా ఇసుక కమిటీ ముందుకు మరో 28 ఇసుక ఫైళ్లను పెట్టడం ద్వారా అవినీతి అధికారి నిజస్వరూపం బయట పడింది. ములుగు కేంద్రంగా ఏర్పడిన ఇసుక సిండికేట్ పావులు కదిపింది. అయినప్పటికీ జిల్లా కలెక్టర్ దిద్దుబాటు చర్యలు తీసుకోవడంతో అవినీతి అధికారికి, మాఫియాకు గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. 28 ప్రతిపాదనల్లో నిబంధనల ప్రకారం ఉన్న ఆరు రీచ్ ల కు అనుమతి ఇవ్వడానికి అంగీకరించిన కలెక్టర్ మిగిలిన 22 ఫైళ్లను తిరస్కరించారు. అయినా అంతటితో ఆగకుండా అవినీతి అధికారి మళ్ళీ సర్వేల ప్రహసనానికి తెర లేపారు.

మంత్రుల పేరుతో కలెక్టర్ పై ఒత్తిడి..
ఇసుక రీచ్ ల కోసం ఇసుక మాఫియా చేస్తున్న ప్రయత్నాలకు కొందరు మంత్రుల సహకారం లభించడం విశేషం. మంత్రులతో ఫోన్ చేయిస్తే కలెక్టర్ వింటారంటూ అవినీతి అధికారి తన వద్దకు వచ్చే కాంట్రాక్టర్లకు సలహా ఇస్తున్నాడు. సమావేశాల్లో తనకేమీ తెలియనట్లు మౌనం వహించడం, వీలైతే ఇతర శాఖల అధికారులపైకి నెపం నెట్టడం వంటి విద్యలతో సదరు అధికారి కాలం గడుపుతున్నాడు. ఇదంతా గమనించని కలెక్టర్ అతనిపై నమ్మకం పెట్టుకోవడంతో వివాదాలు తలెత్తుతున్నాయి. అవినీతి అధికారి కేవలం ఒక సంవత్సర కాలంలో రెండు కోట్ల రూపాయలు సంపాదించాడనే ఆరోపణలు వచ్చాయి. ఆ అధికారి గతంలో పనిచేసిన ప్రాంతంలో కూడా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ములుగు జిల్లా కేంద్రంలోని ఆ అధికారి కార్యాలయంలో పనిచేయడానికి మైనింగ్ శాఖకు చెందిన ఆర్ఐ లు ముందుకు రావడం లేదు. మంగపేట ప్రాంతంలో పట్టాభూముల్లో జరిగిన ఇసుక తవ్వకాలపై వచ్చిన ఆరోపణలపై విజిలెన్స్ దర్యాప్తు జరగగా వారికి అవినీతి అధికారి తప్పుడు నివేదిక ఇవ్వడమే కాక సర్వే కోసం మహబూబాబాద్ నుంచి వచ్చిన ఆర్ఐ పై కూడా ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది.

ఎన్నికల సమయంలోనూ సర్వేలు..
ములుగు జిల్లా కలెక్టర్ గా ఇలా త్రిపాఠీ పనిచేసిన కాలంలో లోక్ సభ ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో కూడా కలెక్టర్ కి చెప్పకుండా ఇసుక రీచ్ ల కోసం అవినీతి అధికారి సర్వేలు చేయించాడు. సర్వేల విషయం ప్రస్తుత జిల్లా కలెక్టర్ కి కూడా ముందుగా చెప్పకపోవడంతో ఇతర శాఖల అధికారులు భయపడుతున్నారు. జిల్లా ఇసుక కమిటీ సమావేశంలో కూడా ఎన్ని దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయో చెప్పకుండా అవినీతి అధికారి కొత్తగా సర్వేలు మొదలు పెట్టాడు.

ఇంటెలిజెన్స్ డీజీ దర్యాప్తు..
ములుగు జిల్లాలో ఇసుక మాఫియా ఆగడాలతో పాటూ అవినీతి అధికారుల పాత్రపై ముఖ్యమంత్రి దృష్టి సారించారు. ఇటీవల వచ్చిన వార్తా కథనాలపై ఇంటెలిజెన్స్ డీజీ శివధరరెడ్డి దర్యాప్తు జరిపి సీఎం కు నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. మైనింగ్ శాఖను సీఎం స్వయంగా నిర్వహిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇసుక మాఫియా పాత్ర గురించి పలు సమావేశాల్లో విమర్శించిన రేవంత్ రెడ్డి అటువంటి వ్యవహారాలు పునరావృతం కాకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సిరిసిల్ల నియోజకవర్గంలోని నేరెళ్ళ దళితులపై జరిగిన దాడులు అప్పట్లో సంచలనం కలిగించడమే కాక ప్రతిపక్షాలకు ఆయుధంగా మారాయి.

Leave A Reply

Your email address will not be published.