ఖమ్మం:సిని నటుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ సిఎం, సీనియర్ ఎన్ టిఆర్ విగ్రహ ఆవిష్కరణకు విగ్రహ కమిటీ సభ్యులు చక చక పనులు చేస్తున్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని లకారం చెరువు మద్యలో ఎన్టిఆర్ విగ్రహాన్ని ఏర్పాటుకు సన్నాహాలు జరిగాయి. విగ్రహాన్ని నాలుగు కోట్ల రూపాయల వ్యయంతో కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు. లకారం చెరువు మద్యలో ఎన్టీఆర్ శ్రీకృష్ణుడి అవతారంలో ఉన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఎన్.ఆర్.ఐ లు , మంత్రి అజయ్ కుమార్ లు కలసి నిర్ణయం తీసుకున్నారు. మే నెల 28న ఎన్టిఆర్ శతజయంతి సందర్బంగా విగ్రహాన్ని ఆవిష్కరించాలని అనుకున్నారు. అప్పటికే విగ్రహం లకారం ట్యాంకు బండ్ వద్దకు వచ్చినప్పటికి కోర్టు వివాదాల వల్ల ప్రతిష్టాపన కార్యక్రమం నిలిచిపోయింది.
అయితే శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న విగ్రహంను పెట్ట వద్దంటూ యాదవ సంఘాలు, కొన్ని హిందు సంఘాలు కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు విగ్రహ ఆవిష్కరణను నిలిపివేసింది. దీంతో ఎన్ టిఆర్ అభిమానులు , విగ్రహ నిర్మాణ కమిటి మరోస్థలాన్ని చూడాలని నిర్ణయించుకున్నారు. లకారం ట్యాంక్ పక్కనే అనుకుని ఉన్న ప్రవేటు స్థలాన్ని ఆ స్థల యజమాని ఎన్టీఆర్ అభిమాని పెండ్యాల వెంకటేశ్వర రావు దాదాపు కోటిన్నర స్థలాన్ని ఉచితంగా ఇవ్వడంతో అక్కడ నిర్మాణ పనులు పూర్తి చేసి విగ్రహ ఆవిష్కరణకు తుది మెరుగులు దిద్దుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు వస్తే అప్పుడు విగ్రహ ఆవిష్కరణ ఉంటుందని నిర్వహకులు చెపుతున్నారు.