A place where you need to follow for what happening in world cup

ఆదివాసీల ఆత్మబంధువు బిడి శర్మ

0 36,072

well wisher

  • బస్తర్ నుంచి షిల్లాంగ్ వరకూ చెరగని ముద్ర
  • కీలక చట్టాల కోసం అలుపెరుగని పోరాటం
  • నేటి తరం ఐఏఎస్ లకు మార్గదర్శకుడు

అది 2010 వ సంవత్సరం డిసెంబర్ 17 వ తేది. ఆదివాసీల ఆత్మబంధువు డాక్టర్ బిడి శర్మను కలవడానికి నేను, ఆదివాసీ మిత్రులు దాట్ల నాగేశ్వరరావు, సున్నం వెంకట రమణ ఢిల్లీ వెళ్ళాము. ల్యాండ్ లైన్ కి ఫోన్ చేస్తే శర్మ గారు మాట్లాడారు. మీకు హిందీ వచ్చా అని అడిగారు. నేను భయపడుతూనే ఇంగ్లీష్ లో మాట్లాడాను. ‘మిమ్మల్ని కలవడానికి ఏపీ నుంచి వచ్చాము’ అన్నాను. రమ్మని ఆహ్వానిస్తూ చిరునామా రాసుకోమని చెప్పారు. ఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి హజ్రత్ నిజాముద్ధీన్ చేరుకున్నాము. స్టేషన్ సమీపంలోని చిన్న మురికి వాడలో ఆయన నివసించే ఇంటిని కనిపెట్టడం కొంచెం కష్టమే అయింది. ఒక టీ స్టీస్టాల్ వద్ద అడిగాము. పక్కనే ఉన్న సందులోకి వెళ్ళి మెట్లు ఎక్కితే శర్మ ఉంటారని అతను చెప్పాడు. మురికి కాల్వ పక్క నుంచి వెళ్ళి సన్నటి మెట్లు ఎక్కాము. ఒక చిన్న గదిలో పరుపుపై కింద కూర్చుని ఏదో రాసుకుంటున్న శర్మ గారు మమ్మల్ని చూసి బయటికి వచ్చారు. బల్లపై కూర్చోమన్నారు. మేము పరిచయాలు చేసుకున్న తర్వాత చిన్న వంట గదిలోకి వెళ్ళి చాయ్ పెట్టుకుని తెచ్చి ఇచ్చారు. రాష్ట్రంలోని ఆదివాసీల స్థితిగతుల గురించి అడిగారు. అప్పటికే జరుగుతున్న పోలవరం వ్యతిరేక పోరాటం గురించి ఆరా తీసారు. తాను రాస్తున్న ‘అమలు కాని హామీల చరిత్ర’ (Unbroken History of Broken Promises) పుస్తకం ప్రూఫ్ దిద్దుతున్నానని చెప్పారు. దేశంలో ఆదివాసీ ప్రాంతాల్లో ప్రత్యేకించి బస్తర్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి నమూనాతో ఆదివాసీలు ఏ విధంగా నష్ట పోతున్నారో వివరించారు. దాదాపు రెండు గంటలు మాట్లాడినన తర్వాత ఆయన స్వదస్తూరీతో ప్రూఫ్ దిద్దిన పుస్తకాన్ని ‘With best wishes to my young friends’ అని రాసి సంతకం చేసిచ్చారు. మేము తిరిగి వచ్చిన కొన్ని రోజుల తర్వాత ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పోలవరం ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. 2015 డిసెంబర్ 7 న 86 ఏండ్ల వయస్సులో మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో ఆయన మరణించారు. ఆయన మరణ వార్త విని దేశంలోని ఆదివాసీలు ఎంతగానో బాధపడ్డారు. శర్మ గారిని కలిసి 11 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ఆయన సేవలను మరొక సారి స్మరించుకుంటున్నాము.

దేశం గర్వించ తగిన అధికారి..

well wisher

గ్వాలియర్ లో ఉన్నత మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన బ్రహ్మదేవ్ శర్మ గణిత శాస్త్రంలో డాక్టరేట్ చేశారు. 1956లో సివిల్ సర్వీసెస్ కు ఎంపికై అప్పటి మధ్యప్రదేశ్ కేడర్ లో చేరారు. దేశంలోనే అతిపెద్ద జిల్లాగా ఉన్న ఉమ్మడి బస్తర్ కలెక్టర్ గా నియమితులయ్యారు. మధ్య భారత దేశంలోనే దట్టమైన అడవులు కలిగి పెద్ద సంఖ్యలో ఆదివాసీలు నివసించే దండకారణ్యంలో జిల్లా కలెక్టర్ గా పనిచేయడం ఎంతో కష్టమైన పనే. రహదారులు కానీ కమ్యూనికేషన్ సౌకర్యాలు కూడా లేని ప్రాంతమది. అభుజమాడ్ వంటి ప్రాంతం ఎలా ఉంటుందో కూడా ఎవరికీ తెలియదు. కాలి నడకన రోజుల తరబడి ప్రయాణం చేస్తూ ఆదివాసీ గ్రామాల్లో బస చేస్తూ వారి బాధలను స్వయంగా తెలుసుకుని అక్కడి కక్కడే నిర్ణయాలు తీసుకునే శర్మ నడిచే కార్యాలయంగా పేరు తెచ్చుకున్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్య్రక్రమాలు ఢిల్లీ కోణంలో కాకుండా స్థానిక అవసరాలకు అనుగుణంగా ఉండాలని భావించే శర్మ కార్యరూపంలో వాటిని నిరూపించారు. అతిథి ఎంత పెద్ద వాడైనా తన కంటే ఎత్తులో కూర్చోడానికి ఆదివాసీలు ఇష్టపడరనే విషయాన్ని గ్రహించిన శర్మ కింద కూర్చుని వారితో మాట్లాడే వారు. ఆదివాసీ మహిళలు, పిల్లల్లో పౌష్ఠికాహార లోపం పోగొట్టడానికి ఆయన ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించారు. మారుమూల అటవీ ప్రాంతంలో అక్షరాస్యత శాతం పెంచాలంటే అక్కడ అధ్యాపకులు నివాసం ఉండాలని దీని కోసం వారి సతీమణులకు కూడా అక్కడే ఉద్యోగం ఇవ్వాలని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు ప్రభుత్వ ఆమోదం లభించలేదు. బస్తర్ ప్రాంతంలో తీవ్రమైన కరవు కాటకాలు నెలకొన్న సందర్భంగా డాక్టర్ శర్మ అసాధారణ నిర్ణయం తీసుకున్నారు. భారత ఆహార సంస్థ గోదాముల్లో నిరుపయోగంగా ఉన్న బియ్యం, గోధుమలను ఆదివాసీలకు ఉచితంగా పంచాలని నిర్ణయించారు. సంస్థ అధికారులు అంగీకరించక పోయినా తాళాలు పగులగొట్టించి ఆహార ధాన్యాలను పంచిపెట్టారు. ఈ సంఘటన అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఆయనపై క్రిమినల్ కేసు నమోదైంది. తయ నిర్ణయాన్ని సమర్ధించుకుంటూ తన వాదనలు వినిపించి విజయం సాధించారు. బ్యూరోక్రాట్లు చట్ట పరిధిలో నిబంధనల మేరకు పని చేయాల్సి ఉ;న్నా కొన్ని సందర్భాల్లో స్థానిక అవసరాలకు అనుగుణంగా విచక్షణాధికారాలు వినియోగించాలని శర్మ అంటూ ఉండేవారు. కొన్ని విధాన పరమైన అంశాల్లో ప్రభుత్వంతో విభేదించిన శర్మ 1981 లో ఐఏఎస్ ఉద్యోగానికి రాజీనామా చేశారు.

చట్టాల రూపకల్పనలో తనదైన ముద్ర

ఐఏఎస్ కు రాజీనామా చేసిన తర్వాత డాక్టర్ శర్మ తన పరిధిని మరింత పెంచుకున్నారు. షెడూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల కమిషనర్ గా శర్మను 1986లో కేంద్ర ప్రభుత్వం నియమించింది. 1991 వరకూ ఈ పదవిలో పనిచేసిన శర్మ అనేక కీలకమైన ఆదేశాలను జారీ చేశారు. ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వలస వచ్చే ఆదివాసీలపై ఎటువంటి చర్యలను తీసుకోరాదని, వారికి రాజ్యాంగ బద్ధంగా అన్ని హక్కులు ఉంటాయని శర్మ స్పష్టం చేశారు. ఈశాన్య రాష్ట్రాల కోసం షిల్లాంగ్ లో ఏర్పాటు చేసిన నార్త్ ఈస్ర్టన్ హిల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా ఆయన పనిచేశారు. రాజ్యాంగంలోని ఐదు, ఆరు షెడ్యూల్స్ పరిధిలోని ఆదివాసీల స్థితి గతులు, చట్టాల గురించి శర్మ అధ్యయనం చేశారు. వీటికి సంబంధించి అనేక పుస్తకాలను రచించారు. గణిత శాస్త్రంలో కూడా అనేక పాఠ్య పుస్తకాలను రాశారు. ఆదివాసీల అభివృద్ధి కోసం కేంద్రం నియమించిన భూరియా కమిటి సభ్యుడిగా కీలక సిఫారసులను చేయడం, నివేదికను రాయడంలో కీలక భూమిక పోషించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ తో పాటు ‘పీసా’, అటవీ హక్కుల చట్టం రూపకల్పనలో డాక్టర్ శర్మ ఎంతో కృషి చేశారు. రెండవ శ్రేణి స్లీపర్ కోచ్ లోనే ఆదివాసీ ప్రాంతాలకు వెళ్ళేవారు. లక్షలాది ఆదివాసీల జీవన విధ్వంసానికి కారణమయ్యే నర్మద, పోలవరం ప్రాజెక్టులకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో పిటిషన్లు వేశారు. 2012 లో సుక్మా కలెక్టర్ అలెక్స్ పాల్ మీనన్ ను మావోయిస్టులు కిడ్నాప్ చేసినప్పుడు చర్చలకు ప్రతినిధిగా వెళ్ళి ఆయనను విడిపించారు. అనారోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా 80 ఏండ్ల వయస్సులో కూడా ఆదివాసీ ప్రాంతాల్లో తరచుగా పర్యటించే వారు. అందుకే దేశంలోని ఆదివాసీలకు అయన ఆరాధ్య దైవంగా నిలిచారు. నేటి తరం ఐఏఎస్ అధికారులకు ఆదర్శప్రాయుడిగా నిలిచారు.

కొండూరి రమేష్ బాబు

Leave A Reply

Your email address will not be published.