A place where you need to follow for what happening in world cup

కంచె మేసిన చేను…

0 20,743

కొండూరి రమేష్ బాబు

  • ఆదివాసేతరుల చేతుల్లో రాముడి భూములు
  • హైకోర్టులో ఓడిపోయిన వారికే కట్టబెట్టిన వైనం
  • ఉమ్మడి రాష్ట్రం లో అక్రమ జీవో 2166 జారీ
  • భూమి బదలాయింపు నిషేధిత చట్టానికి తూట్లు
  • సంప్రదింపుల పేరుతో లీజుల క్రమబద్ధీకరణ
  • ఆదివాసీలకు కేటాయించడంలో నిర్లక్ష్యం

భద్రాచల రాముడి విగ్రహాలను ముందుగా చూసి సేవలందించి తరించిన ఆదివాసీ మహిళ పోకల దమ్మక్క కావడం విశేషం. అందుకే ఆదివాసీలు శ్రీరాముడిని ఇష్ట దైవంగా కొలుస్తారు. కానీ దేవాలయ భూములను సాగు చేసుకునే భాగ్యం మాత్రం ఆదివాసీలకు దక్కడం లేదు. రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూలు పరిధిలో ఉన్న భద్రాచలం ప్రాంతంలో భూమి బదలాయింపు నిషేధిత చట్టాలు 1959, 1/70, 2/70 అమల్లో ఉన్నాయి. 2/70 ప్రకారం గిరిజనేతరులకు భూములు లీజుకు ఇవ్వడం చెల్లదు. భద్రాచలం దేవాలయానికి పురుషోత్తమ పట్నంలోని సర్వే నంబర్ 17 లో 917 ఎకరాల భూమి ఉండగా ఈ భూములను ఏండ్ల తరబడి గిరిజనేతరులకే నామమాత్రపు లీజులకు దేవాదాయ శాఖ కట్టబెడుతున్నది. ఆదివాసీ చట్టాలను అపహాస్యం చేస్తున్నది. ఏపీ పునర్విభజన చట్టంలో భాగంగా దేవాలయ భూములు ఉన్న పురుషోత్తమపట్నం గ్రామాన్ని ఆంధ్రప్రదేశ్ లో కలిపారు. ఏపీలో కూడా భూమి బదలాయింపు నిషేధిత చట్టాలు అమల్లో ఉన్నాయి.

దేవాలయ భూముల చరిత్ర ఇదీ..

కొండూరి రమేష్ బాబు
భద్రాచలం దేవాలయం భూములకు దాదాపు 144 ఏండ్ల చరిత్ర ఉంది. 1878 అక్టోబర్ 12 వ తేదీన సోమరాజు పురుషోత్తమ దాసు రిజిస్టర్డ్ గిఫ్ట్ డీడ్ ద్వారా 917 ఎకరాల భూమిని భద్రాచలం దేవాలయానికి ఇచ్చారు. ఆనాటి నుంచి ఈ భూములు పరాధీనంలో ఉన్నాయి. దాదాపు వందేండ్ల కాలం ఈ భూమిలో దేవాలయానికి ఒక్క రూపాయి కూడా ఆదాయం రాలేదు. భూముల ఆక్రమణదారులైన గిరిజనేతరులు వీటిని సాగు చేసుకుంటూ వచ్చారు. తాము ఏండ్ల తరబడి భూములను సాగు చేసుకుంటున్నందున రైత్వారీ పట్టాలు ఇవ్వాలంటూ ప్రభుత్వంపై అనేక మార్లు ఒత్తిడి తెచ్చారు. కానీ భూమి బదలాయింపు నిషేధిత చట్టాలు అమల్లో ఉండటంతో ఇది సాధ్యం కాలేదు. హైకోర్టులో కూడా గిరిజనేతర రైతులకు చుక్కెదురైంది.

ఆక్రమణలో ఉన్న భూములను ఖాళీ చేయించాలంటూ భద్రాచలం దేవస్థానం ఈఓ 1999 జూన్ 10 న రాష్ట్ర హైకోర్టులో సెక్షన్ 85 ప్రకారం రిట్ పిటిషన్ వేశారు. దీనితో రైతులు దేవస్థానంతోనూ రాష్ట్ర ప్రభుత్వంతోనూ లాబీయింగ్ మొదలు పెట్టారు. తమ పేరుతో ఈ భూములను క్రమబద్ధీకరించాలంటూ కోరారు. రైతులతో చర్చలు జరపడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించాలని మెమో నంబర్ 21201 ఎండోమెంట్స్ (2) 2002/1, తేది 13.06.2002 ద్వారా ప్రభుత్వం అప్పటి దేవాదాయ శాఖ కమిషనర్ ను ఆదేశించింది. ఈ అంశంపై తగిన ప్రతిపానలు పంపాల్పిందిగా అప్పటి ఖమ్మం జిల్లా కలెక్టర్ ను ప్రభుత్వం కోరింది. ఇదే సమయంలో ఆక్రమణదారులైన రైతులు రిట్ పిటిషన్ నంబర్ 26056/2008 ద్వారా మరొక సారి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను హైకోర్టు 21.04.2010 న డిస్మిస్ చేసింది.

కోనేరు రంగారావు కమిషన్ నివేదిక…
మావోయిస్టులతో చర్చల సందర్భంగా రాష్టంలోని భూములపై విచారణ జరిపించడానికి కోనేరు రంగారావు కమిషన్ ను కాంగ్రెస్ ప్రభుత్వం నియమించింది. ఈ కమిషన్ నివేదికలోని తొమ్మిదవ చాప్టర్ లో భద్రాచలం దేవస్థానం భూముల గురించి కమిషన్ అభిప్రాయాన్ని పొందుపరచారు. ఈ భూములను సాగుచేసుకుంటున్న గిరిజనేతర ఆక్రమణదారులను ఖాళీ చేయించి వీటిని ఆదివాసీలకు కేటాయించాలని కమిషన్ ప్రభుత్వానికి సూచించింది. కోనేరు రంగారావు కమిషన్ నివేదికను యధాతథంగా రాష్ట్ర శాసనసభ ఆమోదించింది. కమిషన్ నివేదిక తర్వాత ఆర్వోఆర్ చట్టం కింద రెవిన్యూ శాఖ భద్రాచలం రాముడి పేరుతో 722.75 ఎకరాలకు పట్టాదారు పాస్ పుస్తకాలను 2009 జూన్ 22 న జారీ చేసింది.

చీకటి అధ్యాయానికి తెరలేపిన ఎమ్మెల్యే..
చట్ట విరుద్ధంగా దేవాయలం భూములను ఆక్రమించిన ఆదివాసేతరులతో అప్పటి అధికార పార్టీకి చెందిన ఆదివాసీ ఎమ్మెల్యే కుంజ సత్యవతి కుమ్మక్కై చీకటి అధ్యాయానికి తెరలేపారు. భూములు ఆదివాసీలకు దక్కకుండా చక్రం తిప్పారు. ఈ భూములపై గిరిజనేతరులకు హక్కులను కల్పించడం ద్వారా జీవన భద్రత కల్పించాలంటూ అప్పటి దేవాదాయ శాఖ మంత్రికి 14.07.2010 న ఒక వినతి పత్రం అందచేశారు. గిరిజనేతరులు బ్రిటీష్ కాలం నుంచే ఈ భూములను సాగు చేసుకుంటున్నారని, ఆర్థిక కారణాలతో తగిన న్యాయం పొందలేక పోయారని ఎమ్మెల్యే తన లేఖలో పేర్కొన్నారు. కడు బీదరికంతో కాలం గడుపుతున్న గిరిజనేతరులకు దేవాలయం భూములపై హక్కులు కల్పించాలంటూ కోరారు. ఈ లేఖతో ఆదివాసీలకు అన్యాయం చేసిన ఆదివాసీ ఎమ్మెల్యేగా కుంజ సత్యవతి కళంకం తెచ్చుకున్నారు. ఎమ్మెల్యే లేఖపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా అప్పటి దేవాదాయ శాఖ మంత్రి గాదె వెంకటరెడ్డి ఆ శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు.

చట్ట వ్యతిరేకంగా జీవో విడుదల..
భద్రాచలం ఎమ్మెల్యే లేఖతో గిరిజనేతరుల లీజ్ ఫైల్ చకా చకా కదిలింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు అప్పటి దేవాదాయ శాఖ కమిషనర్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. అప్పటి భద్రాచలం దేవస్థానం ఈవో ఆక్రమణ దారులైన రైతులతో చర్చలు జరిపి భూముల లీజు ప్రతిపాదనలు పంపించారని కమిషనర్ తన లేఖలో పేర్కొన్నారు. అప్పటి వరకూ కౌలు కూడా చెల్లించకుండా ఏండ్ల తరబడి వ్యవసాయం చేసుకుంటున్న రైతులతో చర్చల పేరుతో అక్రమ ఒప్పందం చేసుకోవడం సంచలనం కలిగించింది. 2005-06 నుంచి ఎకరానికి సంవత్సరానికి రూ. 1,000, 2010-11 సంవత్సరం నుంచి ఎకరానికి రూ. 1,200 చెల్లించడానికి రైతులు అంగీకరించారంటూ అప్పటి ఈవో దేవాదాయ శాఖ కమిషనర్ కు పంపిన ప్రతిపాదనల్లో తెలిపారు. ఈ ప్రతిపాదనలను దేవాదాయ కమిషనర్ రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు. ఈ ప్రతిపాదనల తర్వాత అసలు కథ మొదలైంది. కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసిన పొన్నాల లక్ష్మయ్యకు ఫైల్ చేరింది. ఈ సందర్భంగా ప్రభుత్వ పెద్దలకు, ఉన్నతాధికారులకు భారీగా ముడుపులు ముట్టాయని అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. న్యాయ వివాదాలున్న లీజు క్రమబద్దీకరణ ఫైల్ ను బిజినెస్ రూల్స్ ప్రకారం న్యాయ శాఖకు, గిరిజన సంక్షేమ శాఖకు పంపి వారి అభిప్రాయాలు కోరాల్సి ఉండగా దీనికి భిన్నంగా రెవిన్యూ ఎండోమెంట్స్ శాఖ ఫైల్ ను కిందకి పైకి తిప్పింది.

ఫైల్ పై సంతకం పెట్టిన అసిస్టెంట్ సెక్రటరీ, డిప్యూటీ సెక్రటరీ ఎటువంటి అభిప్రాయాలు రాయకుండానే ఫైల్ ను అప్పటి ముఖ్య కార్యదర్శి కేవీ రమణాచారికి పంపించారు. దేవాలయం భూములు ఏజెన్సీ ప్రాంతంలో ఉడంటం, భూమి బదలాయింపు నిషేధిత చట్టాలు ఆ ప్రాంతంలో అమల్లో ఉన్నాయని, లీజులు చెల్లవని తెలిసి కూడా ఆయన గుడ్డిగా సంతకం పెట్టడం సంచలనం కలిగించింది. దేవాదాయ భూములను గిరిజనేతర ప్రాంతాల్లో లీజుకు ఇవ్వడానికి జారీ చేసిన జీవో నంబర్ 379 ప్రకారం భద్రాచలం దేవాలయం భూములను కూడా లీజుకు ఇస్తున్నట్టు నోట్ ఫైల్ లో పేర్కొన్నారు. ఈ జీవో ఏజెన్సీ ప్రాంతంలో చెల్లక పోవడంతోనే హై కోర్టు పలుమార్లు ఆక్రమణదారుల పిటిషన్లను డిస్మిస్ చేసింది. ప్రభుత్వ పెద్దల చొరవ, ఉన్నతాధికారుల బాధ్యతారాహిత్యంతో మరో అక్రమ జీవో పురుడు పోసుకుంది. భద్రాచలం దేవాలయ భూములను ఆక్రమణదారులకే లీజుకు ఇచ్చే జీవో ఎమ్ ఎస్ నంబర్ 2166, తేది 2.11.2011 జారీ అయ్యింది. ఈ జీవో విడుదలతో అటు గిరిజన సంక్షేమ శాఖ, న్యాయ శాఖ ముక్కు మీద వేలేసుకున్నాయి. ఈ అక్రమ జీవోపై ఉన్నత న్యాయస్థానాన్నిఎవరు ఆశ్రయించినా అది కొట్టివేస్తారని న్యాయ నిపుణులు, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు అభప్రాయపడుతున్నారు. ఎంతో సారవంతమైన నల్లరేగడి భూముల్లో ఆక్రమణదారులు మిర్చి వంటి వాణిజ్య పంటలను పండించడమే కాక భూగర్భ జలాలు ఇంకిపోయే జామాయిల్ తోటలను కూడా పెంచుతున్నారు.

కొండూరి రమేష్ బాబు

Leave A Reply

Your email address will not be published.