బీఆర్ఎస్ నేతలతో చర్చలకు మేం సిద్ధం
కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి కేసీ జార్జ్
బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నట్లు కర్ణాటకలో కరెంట్ సమస్య అసలే లేదని ఆ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి కేజీ జార్జ్ స్పష్టం చేశారు. తొలుత అప్పుడప్పుడు అవాంతరాలు వచ్చినప్పటికీ వాటిని అధిగమించి రైతులకు అవసరమైన కరెంట్ అందిస్తున్నామని చెప్పారు. గురువారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన కర్ణాటకలో విద్యుత్ సమస్యపై బీఆర్ఎస్ నేతలతో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో విద్యుత్ సమస్య ఉందని అసత్య ప్రచారం చేసి తెలంగాణ ఓటర్లను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారంటూ సీఎం కేసీఆర్‌పై మండిపడ్డారు. తెలంగాణలో 24 గంటల విద్యుత్ సరఫరా కాంగ్రెస్ పుణ్యమే అని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో తీసుకున్న నిర్ణయాలు, ఏర్పాటు చేసిన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలతోనే నేడు తెలంగాణలో కాంతులు వెదజల్లుతున్నాయని చెప్పారు. కర్ణాటకలో తాము ప్రకటించిన ఐదు గ్యారంటీలను అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మొదటి క్యాబినెట్ సమావేశంలో వాటి అమలుపై నిర్ణయాలు తీసుకుంటామన్నారు.
కర్ణాటకలో అన్న భాగ్య పథకం కింద 10 కిలోల బియ్యం పేదలకు ఉచితంగా ఇస్తామన్నామన్న ఆయన కేంద్రం బియ్యం సరఫరా చేయకపోవడంతో తాము పేదలకు బియ్యం డబ్బులు ఇస్తున్నామని వెల్లడించారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తెలంగాణకు ఏం చేసిందని ఆరోపిస్తున్న బీఆర్ఎస్ నేతలు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. పేదల సంక్షేమం కోసం ఇందిరా అమలు చేసిన 20 సూత్రాల పథకం ఇప్పటికీ అమలవుతోందని వివరించారు. దేశంలో కాంగ్రెస్ కు అనుకూల పవనాలు వీస్తున్నాయన్న ఆయన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సోనియా, రాహుల్ గాంధీ నాయకత్వంలో అధికారంలోకి రావడం ఖాయమన్నారు. తెలంగాణలో విద్యుత్ సమస్యకు పరిష్కారం చూపామంటూ పదే పదే చెబుతోన్న సీఎం కేసీఆర్.. కరెంట్‌ను ఛత్తీస్ గఢ్ నుంచి ఎందుకు కొనుగోలు చేస్తున్నారని సీడబ్ల్యూసీ సభ్యుడు అజయ్ కుమార్ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఛత్తీస్ గఢ్ డిస్కమ్స్ కు రూ. 3వేల కోట్ల బకాయి ఉందన్నారు. వాటిని చెల్లించక పోవడంతో కరెంట్ సరఫరా ఆగిపోయిందని పేర్కొన్నారు.