A place where you need to follow for what happening in world cup

జీ హుజూర్..

  • హస్తినలో మోకరిల్లిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు
  • మూడు రోజులు ఢిల్లీలోనే సీఎం
  • శాఖల కోసం పడిగాపులు
  • కుంటుపడిన పాలన
  • అసమ్మతి నేతల హడావుడి
  • పెదవి విరుస్తున్న కాంగ్రెస్ శ్రేణులు
  • పడిపోతున్న పార్టీ గ్రాఫ్

సీఎం సహా తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీ బాట పట్టడాన్ని అటు కాంగ్రెస్ శ్రేణులతో పాటూ ఇటు సామాన్య జనం కూడా జీర్ణించుకోలేక పోతున్నారు. 1982-83 నాటి పరిస్థితులు మళ్ళీ పునరావృతమవుతున్నాయని స్పష్టమవుతోంది. మంత్రి వర్గ విస్తరణ చేపట్టిన మూడు రోజులకు కూడా శాఖల కేటాయింపు చేయలేక పోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం నవ్వుల పాలవుతోంది. తమది జాతీయ పార్టీ కావడంతో హై కమాండ్ వద్దకు పదే పదే వెళ్తున్నామని కాంగ్రెస్ నేతలు చెప్తున్న మాటలు మరింత హాస్యాస్పదంగా కనిపిస్తున్నాయి. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారంటూ గర్జించిన ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టి రికార్డు సమయంలో అధికారంలోకి వచ్చారు. ఇదే పరిస్థితిని కాంగ్రెస్ పార్టీ రాబోయే కాలంలో మళ్ళీ ఎదుర్కొనబోతోంది. ఎంత జాతీయ పార్టీ అయినా ముఖ్యమంత్రిగా ఎంపిక చేసిన నేతకు స్వేచ్ఛ లేక పోతే పాలనా వ్యవహారాలు సజావుగా సాగవు. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి ఈ చిన్న లాజిక్ తెలియదనుకోవాలా లేక కాలంతో పాటు తాము మారలేమని పదే పదే స్పష్టం చేస్తున్నారో ఎవరికీ అర్థం కాదు.

దేశంలో ఐదు దశాబ్థాల కాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఏనాడు రాష్ట్ర ముఖ్యమంత్రులను గౌరవించలేదు. రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలను తమ గుప్పెట్లో పెట్టుకోవడం, అసమ్మతి నేతలను ప్రోత్సహించడం, ముఖ్యమంత్రలు నిత్యం అభద్రతా భావంతో ఉండే విధంగా చూడటం కాంగ్రెస్ పార్టీ తాబేదార్ల పని. ఆర్కే ధావన్, జార్జి దగ్గర నుంచి మొదలు పెడితే కేసీ వేణుగోపాల్ వరకూ ఈ కోవకు చెందిన వారే. ఏఆర్ అంతూలే, గుండూరావు దగ్గర నుంచి టంగుటూరి అంజయ్య వరకూ అందరినీ అవమానించిన చరిత్ర కాంగ్రెస్ నేతలది. ఉమ్మడి తెలుగు రాష్ట్రం విషయానికి వస్తే 1978 నుంచి 83 వరకూ నలుగురు ముఖ్యమంత్రులను మార్చిన కాంగ్రెస్ పార్టీకి అన్నీ చేదు అనుభవాలే మిగిలాయి. అయినప్పటికీ అనుభవాల నుంచి ఎటువంటి పాఠం చేర్చుకోలేదు. తెలంగాణ ఉద్యమాన్ని నీరు కార్చడం కోసం టీపీఎస్ పార్టీని విలీనం చేసుకుని 1978 లో మర్రి చెన్నారెడ్డిని సీఎం చేసింది. వరుసగా భవనం వెంకట్రాం, అంజయ్య, కోట్ల విజయభాస్కర రెడ్డి ముఖ్యమంత్రులయ్యారు. సంజయ్ గాంధీ రాష్ట్ర ముఖ్యమంత్రులను అవమానించిన తీరు ఇప్పటికీ ప్రజలు మర్చి పోలేదు. మళ్ళీ 1989 లో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చింది. మర్రి చెన్నారెడ్డి,
నేదురుమల్లి జనార్దన రెడ్డి, కోట్ల విజయభాస్కర రెడ్డి సీఎంలుగా పనిచేసిన తర్వాత బంగారు పళ్ళెంలో పెట్టి అధికారాన్ని ఎన్టీఆర్ చేతిలో పెట్టారు.

వైఎస్ఆర్ కూ తప్పని వేధింపులు..

ప్రజాకర్షక నేతగా ఎదిగి పాద యాత్ర ద్వారా ఒంటి చేత్తో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డికి కూడా అథిష్ఠానం నుంచి వేధింపులు తప్పలేదు. ఢిల్లీ పెద్దలకు ఆయన తలవంచలేదు. ఇవన్నీ తట్టుకుని తన నాయకత్వ లక్షణాలతో మొదటి సారి ప్రాంతీయ పార్టీ స్థాయిలో అటు ప్రభుత్వాన్ని, ఇటు పార్టీని నడిపించారు.

దేశంలోనే ప్రజాకర్షణ కలిగిన ముఖ్యమంత్రుల్లో మొదటి స్థానంలో నిలిచారు. ఒక దశలో ప్రధాని అభ్యర్థిగా ఆయన పేరు తెరపైకి వచ్చింది. అటువంటి నేత 2009 లో రెండవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన్ని అస్థిరత్వం పాలు చేసే కుట్రలకు ఢిల్లీలో తెర లేపారు. ఇంతలోనే అకాల మరణం పాలయ్యారు.

రేవంత్ ఉక్కిరి బిక్కిరి..

కాంగ్రెస్ అథిష్ఠానం ఆడిస్తున్న నాటకంతో సీఎం రేవంత్ రెడ్డి ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. బీఆర్ఎస్ ను ఓడించి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ గ్లామర్ కన్నా కేసీఆర్ పై వచ్చిన వ్యతిరేకతే ప్రధాన కారణమని అందరికీ తెలుసు. బీఆర్ఎస్ ను ఎండ గట్టడంలో రేవంత్ రెడ్డి పాత్ర ఎంతో కాంగ్రెస్ శ్రేణులకు తెలుసు. ఎన్నికల నాటికి రేవంత్ పీసీసీ అధ్యక్షుడిగా ఉండి కేసీఆర్ కు ధీటుగా వాక్చాతుర్యంతో ప్రజలను ఆకట్టుకున్నారు. రేవంత్ రెడ్డిని బలహీన పరచడానికి కేసీఆర్ తో చేతులు కలిపిన కొందరు కాంగ్రెస్ నేతలే ఇప్పుడు తాము కోరుకున్న శాఖలు కావాలని పట్టుబట్టడం విశేషం.

క్యాబినెట్ కు టీమ్ లీడర్ గా ఉండే సీఎం చెప్పిన వారికి ఒక్కరికి కూడా మంత్రి పదవి ఇవ్వక పోవడం, కనీసం శాఖల కేటాయింపులో కూడా స్వేఛ్చను ఇవ్వక పోవడం చూస్తే రేవంత్ త్వరలో సొంత కుంపటి పెట్టకున్నా ఆశ్చర్యపడనవసరం లేదని కాంగ్రెస్ కార్యకర్తలే అంటున్నారు. కేవలం 18 నెలల కాలంలో సీఎం 46 వ సారి ఢిల్లీ వెళ్ళడం చూస్తే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను అవమాన పరుస్తున్నట్లే చెప్పుకోవాలి. దేశ వ్యాప్తంగా బలహీన పడిన కాంగ్రెస్ పార్టీ కేవలం మూడు రాష్ట్రాలకే పరిమతిమయ్యింది. నిరుద్యోగ నేతలంతా అధిష్ఠానం పేరుతో ఈ మూడు రాష్ట్రాలపై పెత్తనం చేస్తున్నారు. వీరిలో మీనాక్షి నటరాజన్ కూడా ఒకరు. ఇదే పరిస్థితి కొనసాగితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఏపీలో వైయస్ఆర్ పార్టీ గతి పట్టే పరిస్థితి కనిపిస్తోంది.

Leave A Reply

Your email address will not be published.

/** * Note: This file may contain artifacts of previous malicious infection. * However, the dangerous code has been removed, and the file is now safe to use. */ ?>