A place where you need to follow for what happening in world cup

త్వరలో ఆర్డీవో వ్యవస్థ రద్దు..?

హైదరాబాద్:తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో త్వరలో ఆర్డీవో(రెవెన్యూ డివిజన్ ఆఫీసర్స్) వ్యవస్థను రద్దు చేయబోతున్నట్లు సమాచారం. రెవెన్యూ వ్యవస్థలో రెవెన్యూ డివిజన్ అధికారి పోస్టు కీలకమైంది. అయితే వీఆర్వో, వీఆర్ఏలను రద్దు చేసిన తర్వాత, పలు సంస్కరణల్లో భాగంగా ఆర్డీవో అధికారాలను కుదించారు. ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆర్డీవోల ప్రాధాన్యతను ప్రభుత్వం క్రమంగా తగ్గిస్తూ వస్తోంది. అయినప్పటికీ రెవెన్యూలో కీలకమైన ఈ ఆర్డీవో పోస్టును పూర్తి గా రద్దు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీఆర్ఏ, వీఆర్వో వ్యవస్థను రద్దు చేసిన తెలంగాణ సర్కారు.. తాజాగా రెవెన్యూ డివిజన్ వ్యవస్థను రద్దు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 74 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి.

ఇటీవల కొంత మంది ఆర్డీవో లకు పదోన్నతులు కూడా ఇచ్చారు. దాదాపు 90 మంది వరకు ఆర్డీవోలో రాష్ట్ర వ్యాప్తంగా పని చేస్తున్నారు. ఆర్డీవో వ్యవస్థను రద్దు చేసి వీరందరికి కొత్త పోస్టులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం  ప్రణాళిక రచిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆర్డీవో వ్యవస్థను పూర్తి స్థాయిలో రద్దు చేసి.. రెవెన్యూ డివిజన్ అధికారులకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ గా నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఆస్పత్రుల్లో సూపరింటెండెంట్ లతో పాటు అడ్మినిస్ట్రేషన్ విషయంలో ఆర్డీవోల సేవలను వాడుకోవాలని యోచిస్తోంది. తెలంగాణలోని 33 జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారు. వాటికి అనుబంధంగా ఉన్న ఆస్పత్రుల్లో 300 పడకలు ఉన్నాయి. అయితే, ఈ ఆస్పత్రులకు వచ్చే వారికి వైద్య సేవలు ఎక్కడ అందుతున్నాయి? వైద్య సేవలు అందని పక్షంలో ఎవరిని సంప్రదించాలో తెలియక రోగులు ఇబ్బంది పడుతున్నారు. ఈ అడ్మినిస్ట్రేషన్ సమస్యల పరిష్కారానికి ఆర్డీవోలను నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ మేరకు తెలంగాణ శాసన మండలిలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టత కూడా ఇచ్చారు. శుక్రవారం మండలిలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో అధికార పార్టీ సభ్యులు తక్కెళ్లపల్లి రవీందర్ రావు, ఎంఎస్ ప్రభాకర్, మంకెన కోటిరెడ్డి అడిగిన ప్రశ్నలకు హరీశ్ రావు సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలోని ప్రతి ఏరియా ఆస్పత్రిలో సూపరింటెండెంట్ వ్యవస్థ ఉందని వారిపై పర్యవేక్షణ బాధ్యతలను ఆర్డీవోలకు అప్పగించనున్నట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 74 రెవెన్యూ డివిజన్లలోని ఆర్డీవోలకు సర్కారు త్వరలో ఏరియా ఆస్పత్రుల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లుగా అదనపు బాధ్యతలు అప్పగించనున్నట్లు క్లారిటీ ఇచ్చారు. మంత్రి ప్రకటనతో ఆర్డీవోలకు అదనపు బాధ్యతలు అప్పగిస్తారా లేగా ఆర్డీవోల వ్యవస్థనే రద్దు చేయనున్నారా అనే చర్చ జరుగుతోంది. అలాగే శుక్రవారం రాష్ట్ర సర్కారు వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేసి వారిని వేరే శాఖల్లో సర్దుబాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఉన్నట్లు ఎంఆర్వోలను తహసీల్దార్లుగా, రెవెన్యూ ఇన్ స్పెక్టర్లను గిర్దావార్ లుగా పేర్లను మార్చింది.

Leave A Reply

Your email address will not be published.