మంత్రి పదవికి రాజీనామా చేస్తా..మంత్రి కేటీఆర్ సవాల్
హైదరాబాద్ ఆగష్టు 5: తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కంటే బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో బెటర్ డెవలప్‌మెంట్ జరిగినట్లు నిరూపిస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్ధిని కేటీఆర్ వివరించారు. దేశంలో ఇంటింటికి మంచినీళ్లు ఇచ్చిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ. ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు తెలంగాణలో ఉంది. దేశంలో వరి ధాన్యం ఉత్పత్తిలో నంబర్ వన్ స్టేట్ తెలంగాణ. ఇండియాలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న స్టేట్ తెలంగాణ. దేశంలో 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్న ఒకేఒక్క రాష్ట్రం తెలంగాణ. బీడీ కార్మికులకు జీవనభృతి ఇస్తున్న ఒకేఒక్క రాష్ట్రం తెలంగాణ.
ప్రపంచంలో ఎకరానికి రూ. 10 వేల పెట్టుబడి ఇచ్చే రాష్ట్రం తెలంగాణ. రైతులకు జీవిత బీమా ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ. లక్షా నూట పదహార్ల కానుక ఇచ్చి 13 లక్షల మంది ఆడబిడ్డల పెళ్లిళ్లు చేసిన రాష్ట్రం తెలంగాణ. ఇండియాలో ఐటీ ఉద్యోగాలు అత్యధికంగా కల్పించిన రాష్ట్రం తెలంగాణ. అందుకే అంటున్నా.. జై తెలంగాణ అని. అది మా పనితనం. మీలాగా ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పాం. భట్టి విక్రమార్క, రఘునందన్ రావుకు సవాల్ చేస్తున్నా. నేను చెప్పింది తప్పయితే.. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ కంటే బెటర్‌గా ఉందని రుజువు చేస్తే రేపు పొద్దున ఫస్ట్ అవర్‌లో నా మంత్రి పదవికి రాజీనామా చేస్తాను. ఇది మా ధైర్యం. ఉన్నది ఉన్నట్టు ఒప్పుకోవడానికి సిగ్గేందుకు అని కేటీఆర్ పేర్కొన్నారు.