హైదరాబాద్ నగరంలో సుమారు 55 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు రూ. 168 కోట్లతో మూసి, ఈసా నాలపై చేపట్టిన నాలుగు లైన్ల వంతెనల నిర్మాణానికి మున్సిపల్, ఐటి శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. సోమవారం ఉప్పల్ బగాయత్ లేఔట్ లో ఈ అభివృద్ధి పనులకు ఉప్పల్ నియోజకవర్గం బిఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి తో కలిసి ఆయన భూమి పూజ చేశారు.
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) పర్యవేక్షణలో మూసీ, ఈసా నదిపై నార్సింగి నుంచి గౌరెల్లి వరకు నాలుగు లైన్లతో ఐదు కొత్త వంతెనలను నిర్మిస్తోంది. అలాగే 15 నెలల కాల పరిమితిలో ఈ వంతెనలను పూర్తి చేయనున్నట్లు హెచ్ ఎం డి అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి, రాచకొండ కమిషనర్ డి ఎస్ చౌహాన్ , కార్పొరేటర్లు బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ , శాంతి సాయిజన్ శేఖర్ , ప్రభుదాస్ మాజీ కార్పొరేటర్లు కొత్త రామారావు, గొల్లూరి అంజయ్య, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, హెచ్ఎండిఏ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.