- ఎస్వీబీసీ సలహాదారుగా నియామకంపై ఒక న్యూస్ ఛానల్ రచ్చ..
శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సలహాదారుగా బంజారా యువతి మంగ్లీని ఏపీ ప్రభుత్వం నియమించడాన్ని ఒక తెలుగు న్యూస్ ఛానల్ తప్పు పట్టింది. తెలుగు రాష్ట్రాల్లో నెంబర్ 1 ఛానల్ గా చెప్పుకుంటున్న సదరు ఛానల్ మంగ్లీ అర్హతలు, అనుభవంపై విమర్శలు గుప్పించింది. గురువారం సాయంత్రం ఐదు గంటల బులెటిన్ లో దాదాపు పావు గంట సేపు ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది. ఈ కథనాన్ని ప్రసారం చేసిన న్యూస్ ఛానల్ కు అనుబంధంగా ఒక భక్తి టీవీ కూడా ఉండటం విశేషం. ముందుగా మంగ్లీ అర్హతల గురించి తెలుసుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది. ఏపీ లోని
వెనుకబడిన కరవు ప్రాంతంగా పేరుగాంచిన అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని బసినేపల్లి తండాలో ఒక బంజారా కుటుంబంలో మంగ్లి జన్మించింది. ఆమె అసలు పేరు సత్యవతి రాథోడ్. కళాశాల విద్య తర్వాత శ్రీ వెంకటేశ్వరం విశ్వ విద్యాలయంలో కర్నాటక సంగీతంలో డిప్లొమా పొందింది. జానపద, సినీ గాయనిగా పేరుగాంచింది. 25 సినిమా పాటలు, 100 కు పైగా జానపద పాటలు పాడి తెలుగు ప్రజల మనస్సులు గెలుచుకుంది. రాయలసీమ, తెలంగాణ యాసలో అనేక పాటలు పాడింది. ఆమె పాడిన భక్తి గీతాలు, బతుకమ్మ పాటలు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయి. కోట్లాది మంది యువత పాలోయింగ్ మంగ్లికి ఉంది. 2013 లో వి 6 ఛానల్ లో మాటకారి మంగ్లీ పేరుతో ప్రజెంటర్ గా సాంప్రదాయ దుస్తుల్లో ఇంటర్యూలు చేయడంతో మంగ్లీకి ఎంతో ప్రజాదరణ లభించింది.
స్వేచ్ఛ సినిమాలో మంగ్లీ ఒక కీలక పాత్రలో నటించి అందరినీ మెప్పించింది. ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2020 లో జరిగిన శివరాత్రి వేడుకల్లో సద్గురు జగ్గీ వాసుదేవ్ సహా 2 లక్షల మంది సమక్షంలో పాడిన శివుడి పాటలు అక్కడి సభికులతో పాటు దేశ విదేశాల భక్తులను ఉర్రూత లూగించాయి. శ్రీ వెంకటేశ్వరుడికి సేవ చేయడానికి ఇంత కంటే అర్హతలు ఏమి కావాలి?.
వెంకటేశ్వరుడు పరవశించే గొంతు..
భక్తి పాటలో తెలుగు ప్రజలను మెప్పిస్తున్న మంగ్లీ గొంతు వింటే సంగీత ప్రియుడైన శ్రీ వెంకటేశ్వరుడు కూడా పరవశిస్తాడనడంలో సందేహం లేదు. ప్రత్యక్షంగా ఎస్వీబీసీ ఛానల్ కు, పరోక్షంగా శ్రీ వెంకటేశ్వరుడికి సేవ చేసుకునే భాగ్యం మంగ్లీకి కలగింది. మంగ్లీకి నెల జీతంగా రూ. 1,00,000 చెల్లించే విధంగా ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడాన్ని కూడా నెంబర్ 1 న్యూస్ ఛానల్ తప్పు పట్టింది. అంత కంటే ఎక్కువ మొత్తంలోనే ఆమె కళాకారిణిగా బయట సంపాదించుకుంటున్న విషయం ఆ ఛానల్ వారికి తెలయదా? రియల్ ఎస్టేట్ వ్యాపారులను, సంపన్నులను టీటీడీ మెంబర్లుగా నియమిస్తున్నప్పుడు తప్పు పట్టని వార్తా ఛానళ్ళు అన్ని అర్హతలు ఉన్న ఒక బంజారా యువతి నియామకాన్ని భూతద్దంలో చూడడం ఏ ప్రయోజనాలను ఆశించో అందరూ అర్థం చేసుకోగలరు. వెంకటేశ్వరుడి భక్తాగ్రేసరుడిగా ఉండి స్వామి వారితో పాచికలు ఆడిన హతీరాం బాబా కూడా బంజారా జాతికి చెందిన వాడేనని గుర్తు చేసుకుంటే మంచిది.
కొండూరి రమేష్ బాబు