- ఏటూరునాగారం స్వయం కృషి గ్రూపునకు అధికారుల సహాయ నిరాకరణ
- చిరు ధాన్యాల యూనిట్ కు గ్రహణం
- అంగన్ వాడీ పిల్లలకు పౌష్ఠికాహారం దూరం
- హాస్టల్ విద్యార్ధలకూ అందని వైనం
- కలెక్టర్ చెప్పినా వినని ఐటీడీఏ అధికారులు
మేడారం సమ్మక్క దర్శనానికి మంత్రులు ఉన్నతాధికారులు బారులు తీరారు. సమ్మక్క వారసులైన ఆదివాసీ మహిళల విషయంలో అడుగడుగునా వివక్ష చూపిస్తున్నారు. సాధికారిత, స్వయం ఉపాథి పేరుతో అట్టహాసంగా ప్రారంభించిన స్వయం కృషి డ్రై మిక్స్ యూనిట్ ను నీరు కారుస్తున్నారు. అంగన్ వాడీ పిల్లలు, హాస్టల్ విద్యార్థులకు అందాల్సిన పౌష్ఠికాహారానికి అడ్డు పడుతున్నారు. ఆదివాసీల సాంప్రదాయ ఆహారమైన జొన్నలు, కొర్రలు తదితర చిరుధాన్యాలతో చేసిన ఆహారాన్ని అందించాలనే విధానంలో భాగంగా డ్రైమిక్స్ యూనిట్లను భ్రదాచలం, ఉట్నూరు, ఏటూరునాగారం ఐటీడీఏ ల పరిధిలో ఏర్పాటు చేయాలని గిరిజన సంక్షేమ శాఖ గత సంవత్సరం నిర్ణయించింది. సాంప్రదాయ ఆహార అలవాట్ల ప్రకారం అంగన్ వాడీ పిల్లలకు స్థానికంగా లభ్యమయ్యే చిరుధాన్యాలతో చేసిన వంటకాలను పెట్టాలని కేంద్ర ప్రభుత్వం కూడా సూచించింది. ఈ ఆహారానికి సంబంధించిన ముడి సరుకును సరఫరా చేసే బాధ్యతను ఆదివాసీ మహిళా సంఘాలకు అప్పగించాలని నిర్ణయించారు. ఫలితంగా మూడు యూనిట్లు మంజూరయ్యాయి. కేంద్ర ప్రభుత్వ పథకమైన ‘మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ ప్రైజెస్’ (ఎంఎస్ఎమ్ఇ)కింద ట్రైకార్ ద్వారా యూనిట్లు ఏర్పాటు చేసి వాటి నిర్వహణ బాధ్యతలను స్థానికి మహిళా సంఘాలకు అప్పగించారు.
ఆరంభ శూరత్వం..
ఏటూరునాగారంలో స్వయం కృషి సంఘానికి మిల్లెట్స్ మిక్సింగ్ యూనిట్ ను అప్పగించారు. రూ. 25 లక్షల వ్యయంతో యంత్రపరికరాలను ట్రైకార్ సమకూర్చింది. గత సంవత్సరం మే 4 న అట్టహాసంగా ఈ యూనిట్ ను ప్రారంభించారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఆ శాఖ కమిషనర్ క్రిస్టినా, జిల్లా కలెక్టర్ క్రిష్ణ ఆదిత్య తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. యంత్రాలపై మిల్లెట్స్ మిక్సింగ్, రవ్వల తయారీ, ప్యాకింగ్ వంటి పనులు చేయడానికి మహిళలకు శిక్షణ ఇచ్చారు. అంగన్ వాడీ పిల్లలకు పోషకాహారం తయారు చేసే మూడు రకాల ఫార్ములాలను ఇక్రిశాట్ ఇచ్చింది. పైలట్ ప్రాజెక్టుగా రెండు మండలాల్లోని అంగన్ వాడీ కేంద్రాలకు జొవార్, మల్టీ గ్రైన్, కొర్రల స్వీట్ సరఫరా చేయాలని అధికారులు ఆదేశించారు. గ్రూపు సభ్యులైన ఆదివాసీ మహిళలు మార్జిన్ మనీ కింద రూ. 4,00,000 జమ చేస్తే బ్యాంకు ద్వారా రూ. 12,00,000 వర్కింగ్ క్యాపిటల్ వస్తుందని అధికారులు చెప్పడంతో గ్రూపు సభ్యులు ఈ మొత్తాన్ని జమ చేశారు.
ఏటూరునాగారంలోని పంజాబ్ నేషనల్ బ్యాంకు ఈ మొత్తాన్ని మంజూరు చేయాల్సి ఉండగా సంవత్సరం గడచినా అది మంజూరు కాలేదు. ఆదివాసీ మహిళలు చెప్పులు అరిగేలా తిరిగి అలసి పోయారు. అయినప్పటికీ అధిక వడ్డీలకు బయటి రుణాలు తెచ్చి యూనిట్ ను నడిపించారు. డిసెంబర్ నెల వరకూ అంగన్ వాడీ కేంద్రాలకు ఆహారం సరఫరా చేశారు. అంగన్ వాడీ కేంద్రాలకు చిరు ధాన్యాల ఆహారం అందచేయడానికి నితి ఆయోగ్ నుంచి ఏటూరునాగారం ఐటీడీఏ కు రూ. 10 లక్షలు వచ్చాయి. నిధులు వచ్చిన తర్వాత కూడా స్వయం కృషి గ్రూపునకు సకాలంలో బిల్లులు చెల్లించకుండా ఐటీడీఏ అధికారులు ముప్పు తిప్పలు పెట్టారు. ఈ వ్యవహారం జిల్లా కలెక్టర్, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ దృష్టికి వెళ్ళడంతో మూడు నెలల కొకసారి చెల్లింపులు చేశారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులు అయిపోయాయంటూ జనవరి నెల నుంచి అంగన్ వాడీ కేంద్రాలకు మిల్లెట్స్ ఆహారం సరఫరా చేయవద్దంటూ ఇటీవల ఐటీడీఏ అధికారులు చెప్పడంతో స్వయం కృషి గ్రూపు మహిళలు అయోమయంలో పడి పోయారు. భద్రాచలం ఐటీడీఏ పరిధిలో గిరిపోషణ కార్యక్రమం కింద రాష్ట్ర ప్రభుత్వ నిధులతో మిల్లెట్స్ ఆహారం కొనసాగిస్తున్నారు.
హాస్టళ్ళకు సరఫరా చేసే ఫైల్ పెండింగ్…
స్వయం కృషి గ్రూపు ద్వారా ములుగు జిల్లా లోని సంక్షేమ హాస్టళ్ళకు మిల్లెట్స్ ఆహారం సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారని మూడు నెలల క్రితం ఐటీడీఏ అధికారులు చెప్పారు. మూడు నెలల నుంచి గ్రూపు సభ్యులు ఐటీడీఏ చుట్టూ తిరుగుతున్నాసంబంధిత ఫైల్ పై కలెక్టర్ సంతకం పెట్టలేదంటూ అధికారులు చెప్తూ వచ్చారు. అటు అంగన్ వాడీకి ఆహార సరఫరా ఆగిపోయే సూచనలు ఉండటం, హాస్టళ్ళకు సరఫరా చేసే ఉత్తర్వులు రాక పోవడంతో యూనిట్ ను మూసి వేసే ప్రమాదం ఉందని ఆదివాసీ మహిళలు వాపోతున్నారు. ఇదే సమయంలో భద్రాచలంలోని స్వయం కృషి గ్రూపుకు హాస్టళ్ళకు ఆహారం సరఫరా చేసే ఆర్డర్ వచ్చేసింది.
మేడారం జాతర పేరుతో మరో దగా…
మేడారం జాతరలో పని చేసే పారిశుధ్య కార్మికులు, వాలంటీర్లు, ఇతర సిబ్బందికి మిల్లెట్స్ ఆహారం సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారంటూ ఐటీడీఏ అధికారులు హడావుడి చేశారు. దాదాపు ఐదు రోజుల పాటు రోజుకు ఐదు వేల మందికి ఉపాహారంగా అందించాలని వారు తెలపడంతో స్వయం కృషి గ్రూపు లక్షలాది రూపాయలు అప్పు చేసి మిల్లెట్స్, తదితర 18 రకాల సరకులను సమకూర్చుకున్నారు. ముందుగా ఆరు క్వింటాళ్ళ ప్యాకెట్లను అందచేశారు. వీటిని మేడారం చేర్చిన తర్వాత కూడా వీటి విషయాన్ని కలెక్టర్ కు చెప్పకుండా కింది స్థాయి అధికారులు కొత్త నాటకానికి తెర లేపారు. సిబ్బంది ఈ ఆహారం తినడానికి ఇష్టపడడం లేదంటూ సరఫరా చేసిన ప్యాకెట్లను కూడా వినియోగించలేదు. ఇప్పుడు వీటి బిల్లు ఇస్తారో లేదో అని స్వయం కృషి గ్రూపు మహిళలు ఆందోళన చెందుతున్నారు.
ముగ్గురు అధికారులదే పెత్తనం..
ఏటూరునాగారం ఐటీడీఏకు పూర్తి స్థాయి ప్రాజెక్టు అధికారి లేక పోవడంతో జిల్లా కలెక్టర్ కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. రెవిన్యూ, ఇతర పాలనా వ్యవహారాలు, మేడారం ఏర్పాట్లు వంటి కార్యక్రమాల్లో తలమునకలైన కలెక్టర్ ఐటీడీఏ వ్యవహారాలపై దృష్టి కేంద్రీకరించలేదని అంటున్నారు. సుదీర్ఘ కాలంగా ఐటీడీఏలో పాతుకు పోయిన ముగ్గురు అధికారులు అవినీతికి, రెడ్ టేపిజంకి కేరాఫ్ గా మారిపోయారు. ఇక్కడికి వచ్చిన పీవోలను పక్కదారి పట్టించడం వీరికి పరిపాటిగా మారిపోయింది. ఐటీడీఏ అధికారుల అవినీతిపై ఆదివాసీ సంఘాలే అనేక మార్లు ఆందోళన బాట పట్టాయి. మావోయిస్టులు కూడా ఐటీడీఏ అధికారులపై ప్రకటనలు ఇవ్వడం విశేషం. ఇక్కడ చక్రం తిప్పుతున్న అవినీతి అధికారులను బదిలీ చేయిస్తేనే ఆదివాసీలకు న్యాయం జరుగుతుందని ఆదివాసీలు అంటున్నారు. స్వయం కృషి గ్రూపు ఆదివాసీలది కావడంతో వారు తమకు లంచాలు ఇవ్వలేరని ఆ యూనిట్ మూత వేయించడానికి ఈ అధికారులు విశ్వప్రయత్నం చేస్తున్నారు. స్వయం కృషి గ్రూపును నిర్వీర్యం చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని, ఐటీడీఏను ప్రక్షాళణ చేయాలని తుడుందెబ్బ నేతలు గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ ను, జిల్లా కలెక్టర్ ను కోరుతున్నారు.
కొండూరి రమేష్ బాబు