A place where you need to follow for what happening in world cup

విత్తనం పేరుతో వంచన

0 13,861

  • బహుళ జాతి సంస్థల చేతిలో గోదావరి లోయ
  • విదేశీ ఎగుమతులతో రూ. కోట్లు లాభం
  • రైతులకు నామ మాత్రపు చెల్లింపులు
  • ఏజెంట్ల ఘరానా మోసం

చెట్టుకు జన్మనిస్తూ విత్తనం మరణిస్తుంది. చెట్టు అంతరిస్తూ విత్తనానికి భరోసా ఇస్తుంది. విత్తనాన్ని, చెట్టును నమ్ముకున్న రైతుకు మాత్రం ఎటువంటి భరోసా లేదు. గోదావరి లోయను చూస్తే ఇది అక్షర సత్యమనిపిస్తుంది. అందుకే అమాయక రైతులు, ఆదివాసీలు జీవిస్తున్న ఏజెన్సీ ప్రాంతంపై బహుళ జాతి విత్తన కంపెనీలు కన్నేశాయి. రెండు దశాబ్థాలుగా విత్తన వ్యాపారం చేస్తూ విదేశీ ఎగుమతుల ద్వారా రూ. వందల కోట్లు సంపాదిస్తున్నాయి. పంట దిగుబడి వచ్చిన తర్వాత కూడా దళారులగా మారిన ఏజెంట్లు సకాలంలో రైతులకు చెల్లింపులు చేయక పోవడంతో వారు ఇక్కట్ల పాలవుతున్నారు. ఏజెన్సీ చట్టాలను అపహాస్యం చేస్తూ తమ విత్తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ పోతున్నారు. పూర్వపు ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోని భద్రాచలం, ములుగు ఏజెన్సీ ప్రాంతాన్ని విత్తనోత్పత్తి కేంద్రంగా మార్చుకున్న బహుళజాతి విత్తన కంపెనీలు సింజెంటా, పయొనీర్, రెండు జిల్లాల్లో పది వేల ఎకరాల్లో మక్క జొన్న విత్తనాలను పండిస్తున్నారు. ఇక్కడ పండిన విత్తనాలను ప్యాకింగ్ చేసి విదేశాల్లో అధిక ధరలకు అమ్ముకుంటున్నారు.

కనీస మద్దతు ధర పేరుతో…

కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తున్న కనీస మద్దతు ధరను రైతులకు చెల్లిస్తున్నామంటూ బహుళజాతి కంపెనీలతో పాటు వారు నియమించిన ఏజెంట్లు ప్రచారం చేసుకుంటున్నారు. ఆహారపు పంటలకు మాత్రమే కేంద్రం మద్దతు ధరను ప్రకటిస్తుంది. గోదావరి లోయలో పండించే మక్కలు ఆహార పంటగా కాకుండా విత్తనోత్పత్తి కోసం పండిస్తున్న వాణిజ్య పంట కావడంతో రైతులకు లాభాల్లో వాటా ఇవ్వాలని, కనీస మద్దతు ధర కన్నా నాలుగు రెట్లు అధికంగా ధరను నిర్ణయించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. రైతులకు గిట్టుబాటు ధర చెల్లించక పోవడంతో పాటు పెట్టుబడులపై వడ్డీలు, క్రిమి సంహారక మందులు, ఇతర ఖర్చుల పేరుతో భారీ మొత్తాలను మినహాయించుకుని ఏజెంట్లు రైతుల నడ్డి విరుస్తున్నారు. పంట చేతికి వచ్చి కంపెనీలకు తరలించిన తర్వాత కూడా మూడు నెలలు గడచినా రైతులకు డబ్బు చెల్లించక పోవడంతో వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

‘పీసా’ చట్టం పట్టించుకోని వైనం…

ఏజెన్సీ ప్రాంతంలో అమల్లో ఉన్న షెడ్యూలు ప్రాంతాలకు పంచాయితీ రాజ్ విస్తరణ (పీసా) చట్టం ప్రకారం ఏ గ్రామంలో ఏ పంట ఎంత విస్తీర్ణంలో వేయాలో గ్రామసభల్లో నిర్ణయించాలి. గ్రామ సభల నిర్ణయం మేరకే వ్యవసాయ శాఖ కంపెనీలకు అనుమతులను ఇవ్వాలి. కానీ విత్తన కంపెనీలు దశాబ్ధ కాలంగా వేలాది ఎకరాల్లో విత్తనోత్పత్తి చేస్తున్న వ్యవసాయ శాఖ అధికారులు తమకు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. వ్యవసాయ ప్రణాళికల కోసం ‘పీసా’ గ్రామ సభలు నిర్వహించలేదు.

కాంట్రాక్టు వ్యవసాయం చట్టం చెల్లదు..

ఏజెన్నీ ప్రాంతంలో భూమి బదలాయింపు నిషేధిత చట్టం 1959, 1 ఆఫ్ 70 రెగ్యులేషన్లు అమల్లో ఉండటంతో ఈ ప్రాంతంలో వ్యవసాయదారులతో కుదుర్చుకునే ఎటువంటి ఒప్పందాలు చెల్లవు. అధికారికంగా కానీ అనధికారికంగా కానీ అటువంటి ఒప్పందాలు కుదుర్చుకుంటే ఎల్టీఆర్ చట్టం కింద కేసులు నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ దిశగా అధికారి యంత్రాంగం ఇప్పటి వరకూ ఎటువంటి అడుగులూ వేయక పోవడం విశేషం. ఏజెన్సీ ప్రాంతంలో విత్తనోత్పత్తి చేస్తున్న బహుళజాతి కంపెనీలు ఏ జిల్లాలో ఎన్ని ఎకరాల్లో ఏ పంట వేస్తున్నారో సర్వే నంబర్ల వారీగా వ్యవసాయ శాఖ వద్ద నమోదు చేసుకుని ముందస్తు అనుమతులు పొందాలి. వ్యవసాయ శాఖ వద్ద నమోదు చేసుకోక పోతే సంబంధిత కంపెనీలకు ఆ శాఖ నోటీసులు జారీ చేయాలి. కానీ ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, జిల్లాల్లో విత్తన కంపెనీలు తమ పంటల వివరాలను నమోదు చేసుకోవడం లేదు.

కంటతడి పెట్టిస్తున్న మిర్చి…

కేరళకు చెందిన ఎవిటి కంపెనీ పేరుతో ఏజెన్సీ ప్రాంతంలో వేలాది ఎకరాల్లో మిర్చి పంట వేయిస్తున్న ఏజెంట్లు కూడా చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. పంట పండిన తర్వాత సాంకేతిక సమస్యల పేరుతో కొనుగోలు చేయక పోవడంతో రైతులు లబో దిబో అంటున్నారు. విదేశీ ఎగుమతులతో అధిక లాభాలు గడిస్తున్న ఆ కంపెనీకి స్థానిక ఏజెంట్లుగా వ్యవహరిస్తున్న వ్యక్తులు అధికార పార్టీకి చెందిన వారు కావడంతో వారి ఆగడాలకు అంతులేకుండా పోయింది.

కాంట్రాక్టు వ్యవసాయ చట్టం ప్రకారం రైతులతో రాత పూర్వక ఒప్పందాలు కుదుర్చుకోవాల్సి ఉండగా ఏజెంట్లు ఆ పని చేయడం లేదు. పంటను పూర్తిగా కొనుగోలు చేయడం లేదు. గిరిజన రైతులు కోరినా వారికి పంట వేసుకునే వెసులుబాటు కల్పించటం లేదు. అనధికారిక వసూళ్ళతో రైతులపై పెను భారం వేస్తున్నారు. వీరి వ్యవహారంపై గతంలో జిల్లా యంత్రాంగం స్పందించి నోటీసులు ఇచ్చినా వారి వ్యవహార శైలి మారలేదు. సర్వే నంబర్ల వారీగా పంటల వివరాలను వ్యవసాయ శాఖకు ఇవ్వడం లేదు. మిర్చి పంట దిగుబడి రాక పోయినా వ్యవసాయ శాఖ విత్తన డీలర్లకు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నది.

కొండూరి రమేష్ బాబు

Leave A Reply

Your email address will not be published.