- అడవికి దూరంగా ఆదివాసీలు
- పోలవరంతో బతుకు ఛిద్రం
అడవి తల్లితో పెనవేసుకున్న పేగు బంధం తెగిపోతున్న వేళ బరువెక్కిన గుండెలతో వారు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. తమది కాని చోటికి తరలి వెళ్లాలనే చేదు నిజాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. కొండలు, కోనలు, దట్టమైన అడవులు, సెలయేళ్ళ గల గలలు, అడవి జంతువుల అరుపుల మధ్య ఇంత కాలం ప్రశాంత జీవితంగ డిపిన వారు మైదాన ప్రాంతాల్లో కట్టిన కాంక్రీట్ గూళ్ళలో నివసించడానికి మనసంగీకరించక గుబులు చెందుతున్నారు. తాము పూజించుకునే దేవరలను, పూర్వీకుల ఆత్మలను వదలి వెళ్ళడానికి ఇష్టం లేకున్నా జ్ఞాపకాలను పదిల పరచుకుని భారంగా కదలడానికి సిద్ధపడుతున్నారు. తమతో జీవించే వేట కుక్కలు కూడా వస్తాయో లేదో వారికి సంశయమే. పోలవరం ముంపు ప్రాంతంలో ప్రస్తుత పరిస్థితి ఇది. ఆధునిక దేవాలయం ఎవరి జీవితాల్లో వెలుగు నింపుతుందో తెలియదు కానీ ఒక లక్ష మంది ఆదివాసీ కుటుంబాల జీవితాల్లో విషాదం నింపబోతున్నది. పాలకుల ఆధునిక అభివృద్ధి నమూనా ఆదివాసీల జీవితాలను ఛిద్రం చేయబోతున్నది.
భూమి లేదు.. భుక్తి దొరకదు…
ఎంతో కొంత ఇచ్చి సాధ్యమైనంత త్వరగా ఆదివాసీలను ముంపు ప్రాంతం నుంచి వెళ్ళగొట్టాలనే ఆత్రుత తప్ప వారి భవిష్యత్తు గురించి పాలకులకు పట్టదు. కోల్పోతున్న భూమికి బదులుగా కొంత భూమి ఇవ్వాలనే ప్రతిపాదనకు స్వస్తి చెప్పిన తర్వాత భూమి లేకుండానే ఆదివాసీలు కొత్త ప్రదేశాలకు తరలి వెళ్ళాల్సి రావడం పెద్ద సమస్యగానే చెప్పవచ్చు. నామ మాత్రపు నష్ట పరిహారం, పునరావాస ప్యాకేజి డబ్బులో కొంత వరకు దళారుల పాలు కాగా మిగిలినకొద్ది మొత్తం పెండ్లిండ్లు, పండుగలకు ఖర్చయి పోతున్నది. అడవి మీద, వ్యవసాయం మీద ఆధారపడి జీవించే కోయ, కొండరెడ్డి ఆదివాసీలను అడవికి దూరం చేసి భూమి కూడా లేకుండా చేస్తే వారు కూలీలుగా మారి పోవడమో పట్టణాలకు తరలి వెళ్లి చెల్లా చెదురై పోవడమో జరుగుతుంది.
ప్రమాదం అంచున కొండ రెడ్లు..
పాపి కొండల్లో జీవించే కొండ రెడ్ల పరిస్థితి మరింత దయనీయంగా మారబోతున్నది. కనీసం కొండ దిగి కిందకి రావడానికి కూడా ఇష్టపడని ఆదిమ జాతి తెగకు చెందిన వీరిని కూడా మైదాన ప్రాంతాలకు తరలిస్తే జాతి మొత్తం అంతరించి పోయే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. కేవలం 20 వేల సంఖ్యలో నివసిస్తున్న వీరు ఇప్పటికే అంతరించి పోయే తెగల్లో చేరి పోయారు. శ్రీశైలం డ్యాం నిర్మాణం తర్వాత చెల్లా చెదురైన చెంచులు మైదాన ప్రాంతాలకు వెళ్ళి మృత్యువాత పడ్డారు. ఇదే పరిస్థితి ఇప్పుడు కొండరెడ్లకు కూడా ఎదురయ్యే ప్రమాదం ఉంది.
ఒక విషాదాంత నాటకం..
పోలవరం ప్రాజెక్టు ఒక విషాదాంత నాటకంగా ముగిసి పోబోతోంది. భారీ ప్రాజెక్టుల నిర్మాణంతో జరిగిన పర్యావరణ, జీవన విధ్వంసాల అనుభవం నుంచి పాఠాలు నేర్చుకోని పాలకులు అనేక ప్రత్యామ్నాయాలను వదలి ఓట్ల కోసమో, కమిషన్ల కోసమో పోలవరం వంటి భారీ ప్రాజెక్టును కడుతున్నారనేది జగమెరిగిన సత్యం. ప్రజలు కోరిన విధంగా పునరావాసం పూర్తి చేసిన చైనా లోని ‘త్రీ గోర్జెస్’ నమూనాను కూడా కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాలు పరిగణలోకి తీసుకోక పోవడం విశేషం. ప్రాజెక్టు నిర్మాణానికి ఇచ్చిన ప్రాధాన్యత పునరావాసం కోసం ఇవ్వక పోవడం, నిధుల కొరతతో పునరావాస కాలనీల నిర్మాణం పూర్తి చేయక పోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాఫర్ డ్యాం నిర్మాణం తర్వాత ఇటీవల వచ్చిన కొద్దిపాటి వరదలకే ఆదివాసీ గ్రామాల్లో వరద నీరు వచ్చి చేరడం వారిని కలవర పరచింది. పునరావాస కార్యక్రమాల అమలుకు నిధులు లేక పోవడంతో వరదల్లో చిక్కుకున్న ఆదివాసీలకు ఏపీ ప్రభుత్వం ఒక ఉచిత సలహా ఇచ్చి చేతులు దులుపుకున్నది. మూడు నెలల కాలం కొండల్లో తలదాచుకోవాలంటూ హుకుంజారీ చేసింది. కనీసం తాత్కాలిక శిభిరాలను ఏర్పాటు చేయడానికి కానీ ఆహారం అందించడానికి కానీ వారికి మనసొప్పలేదు.
కొండూరి రమేష్ బాబు