- పేరుకే ఆదివాసీలకు కేటాయింపు
- బినామీలకు బినామీలు పుట్టుకొస్తున్న వైనం
- దుకాణాల కొనుగోలుకు రంగంలోని దిగిన మాఫియా
- రెట్టింపు ధరలకు అమ్ముకోవచ్చనే ధీమా
- విచ్చల విడిగా బెల్టు షాపులు
- మామూళ్ళ మత్తులో ఆబ్కారీ పోలీస్ శాఖలు
భద్రాచలం, ములుగు ఏజెన్సీ ప్రాంతంలో మద్యం మాఫియా రాజ్యమేలుతోంది. రెండు సంవత్సరాల కాలానికి ఇటీవల లాటరీ ద్వారా దుకాణాలను దక్కించుకున్న బినామీలతో కొత్త బినామీలు బేరసారాలు కుదుర్చుకుని కొనుగోళ్ళకు తెగబడ్డారు. షెడ్యూలు ప్రాంతాలకు పంచాయితీరాజ్ విస్తరణ (పీసా) చట్టం ప్రకారం ఏజెన్సీ ప్రాంతంలోని రిటైల్ మద్యం దుకాణాలను స్థానిక ఆదివాసీలకే కేటాయించాల్సి ఉంది. ఆదివాసీలకు ఆర్థిక స్తోమత లేక పోవడంతో దశాబ్థాల కాలంగా బినామీలే వీటిని నిర్వహిస్తున్నారు. తమకు అనుకూలంగా వ్యవహరించే అమాయకులైన ఆదివాసీలను ఎంచుకుని వారితో మద్యం దుకాణాల కోసం దరఖాస్తులు పెట్టించి వ్యవహారం మంతా బినామీలే నడిపిస్తున్నారు. రెండు సంవత్సరాల కాలపరిమితి కోసం లాటరీ ద్వారా ఇటీవల జరిగిన కేటాయింపుల్లో దుకాణాలు దక్కని పాత మద్యం సిండికేట్లతో పాటు కొత్త వక్తులు కూడా రంగ ప్రవేశం చేశారు. మారుమూల ప్రాంతంలో ఉన్న వాజేడు, వెంకటాపురం మొదలుకుని భ్రదాచలం, కొత్తగూడెం వంటి పట్టణాల్లో కూడా బినామీలు హల్ చల్ చేశారు. రూ. 50 లక్షల నుంచి రూ. 2 కోట్ల వరకూ పెట్టుబడిగా పెట్టి దుకాణాలను కొనుగోలు చేశారు.
ఏజెన్సీ పైనే ఎందుకింత మోజు?
ఏజెన్సీ ప్రాంతంలో గతంలో మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. అమాయక ఆదివాసీలు, వెనుకబడిన వర్గాలు అధిక సంఖ్యలో నివసించే ఈ ప్రాంతంలో నిర్ణీత గరిష్ఠ ధర కన్నా రెట్టింపు ధరలకు మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. ఎవరైనా ప్రశ్నించినా వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. మద్యం దుకాణాల యజమానులకు అనుకూలంగా వ్యవహరించేందుకే ఆబ్కారీ శాఖతో సమానంగా పోలీసు అధికారులకు కూడా మామూళ్ళు ముడుతున్నాయి. మద్యం మాఫియా ఏజెన్సీ ప్రాంతంలో కల్తీ మద్యం అమ్ముతున్నారనే ఆరోపణలు వచ్చినా ఎవరూ పట్టించుకోరు. అందుకే ఈ ప్రాంత మద్యం దుకాణాల కోసం ఇతర ప్రాంతాల వారు కూడా ఎగబడుతున్నారు.
రెండు మండలాల్లో 70 బెల్టు షాపులు…
బెల్టు షాపులను అధికారులే ప్రోత్సహించడంతో అసలు దుకాణాల కంటే వీటి జోరే ఎక్కువగా కనిపిస్తోంది. ములుగు, భధ్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు మారుమూలగా ఉన్న వాజేడు, వెంకటాపురం మండలాల్లో అధికారికంగా నాలుగు మద్యం దుకాణాలుంటే అనధికారికంగా 70 బెల్టు షాపులు నడుస్తున్నాయి. వీటి సంఖ్య నానాటికి పెరుగుతున్నది. తాగునీరు లభించని గ్రామాల్లో కూడా మద్యం లభిస్తున్నదంటే మద్యం మాఫియా ఏ విధంగా చెలరేగిపోతున్నదో తెలుస్తుంది. గుడి, బడి, నివాస ప్రాంతాలనే ఎటువంటి మీమాంస లేకుండా అడుగడుగునా బెల్టు షాపులు వెలుస్తున్నాయి.
నగర ప్రాంతాల్లోని బార్లను మించి ఇవి నడుస్తున్నాయి. వీటికి ఎటువంటి అనుమతులు అవసరం లేక పోవడంతో ఆబ్కారీ, పోలీసు శాఖల సహకారంతో అనధికారికంగా నడుస్తున్నాయి. వీరికి సిండికేట్ల అండదండలు పూర్తిగా లభిస్తున్నాయి. రెట్టింపు ధరలకు మద్యం విక్రయించడంతో సిట్టింగ్ సౌకర్యం, మంచింగ్ కోసం తినుబండారాలు, సాఫ్ట్ డ్రింక్ లు లభించడంతో మద్యం ప్రియులను ఇవి ఆకర్షిస్తున్నాయి. పోలీస్ సహా అన్ని శాఖల ఉన్నతాధికారులుండే వెంకటాపురం మండల కేంద్రంలోని చిరుతపల్లి బాలికాల ఆశ్రమ ఉన్నత పాఠశాల ఎదురుగా వెలసిన ఒక బెల్టు షాపుతో బాలికాలు నానా అవస్తలు పడుతున్నారు. వసతి గృహాల నుంచి, గ్రామంలోని ఇతర ప్రాంతాల నుంచి బడులకు వెళ్ళే రహదారిలో కూడా నాలుగు మద్యం దుకాణాలు వెలసినా అక్కడ రోజంతా తాగుబోతులు వీరంగం చేస్తున్నా అధికారులెవరూ పట్టించుకోక పోవడం విశేషం. పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినా వారు కూడా మౌనం వహించడం వెనుక మామూళ్ళ మత్తులో జోగడమే కారణమని స్పష్టమవుతోంది.బెల్టు షాపులను జనావాసాలకు దూరంగా పెట్టించాలనే ఆలోచన కూడా అధికారులకు రావడం లేదు. మహిళలు ఎదరు తిరిగితే తప్ప వారు మేల్కొనే పరిస్థితి లేదు.