(జులై 21 కోయ గోండీ భాషా దినోత్సవం )
ప్రపంచీకరణలో భాగంగా మొదలైన భాష, సాంస్కృతిక విధ్వంసం ఆదివాసీలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నది. దీనితో పలు భాషలు అంతరించిపోతున్నాయి. వీటిలో కోయ (గోండీ) భాష కూడా ఒకటి. భారత దేశంలో ఆస్ట్రెక్ , ద్రవిడియన్, సినో టిబెటన్ ఇండో యూరోపియన్ నాలుగు భాషా కుటుంబాలు కాగా రెండవ కుటుంబమైన ద్రవిడియన్ విభాగములో కోయ భాష చెందుతుంది. యవ్వ ( తల్లి) గర్భం నుంచి పుట్టిన లిపి లేని కోయ భాషను బ్రతికించుకోవడానికి చిన్న ప్రయత్నం జరుగుతున్నది. కోయ భాషను మాట్లాడే రాష్ట్రాలు అంధ్రప్రదేశ్, తెలంగాణా, ఒడిషా, ఛత్తీస్ గడ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు కాగా మాండలికాల్లో కొద్దిపాటి తేడా ఉంటుంది. కోయ తెగను గోండ్, దొర్ల, మురియా , కుయిగా పిలుస్తారు. నెయ్ ,ఎడ్జ్ ,కల్క్, కెల్క్ , ఏర్ మొదలగు పదాలు ఒకే విధంగా ఉచ్చరిస్తారు, ఈ భాషను నాలుగు కోట్ల మంది మాట్లాడుతారు.
భాష పరిరక్షణ ఎందుకు ?
భాష అంటే కేవలం భావ ప్రకటనా మాద్యమమే కాదు. మనిషి అస్తిత్వపు జాడ. సంస్కృతి, ఆత్మగౌరవ ప్రతీక. అంతరంగాన్ని ఆవిష్కరించే ఒక సాధనం. మనోభావాలు, హక్కులు రక్షించే వారసత్వ సంపద. అది నిత్యం పారే జీవనది లాంటిది. ప్రకృతితో మమేకమై జీవించే ఆదివాసీకి ఇది మరింత అపురూపమైనది. దీనిని పదిల పరచి భావి తరాలకు అందించవలసిన బాధ్యత అందరిపైనా ఉంది.
కోయ నిఘంటువు
లిపిలేని కోయ భాషకు వివిధ రాష్ట్రాల అధికారిక భాషలను కలిపి నిఘంటువును తయారు చేసే ప్రక్రియ ప్రారంభమయింది. దీని కోసం మొదటి వర్క్ షాప్ గాంధీ గాంధీ స్మృతి దర్శన కల్చరల్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వారి సహకారంతో 2014 జులై 21 నుంచి 25 వరకూ, రెండవ వర్క్ షాప్ ఆగస్టు 24 నుండి 29 వరకు కన్నడ యూనివర్సిటీ సహ కారంతో హంపిలోనూ, మూడో వర్క్ షాప్ 25 నుండి 29 వరకు 2014 లో మధ్యప్రదేశ్లో అమర్ కంటక్ ట్రైబల్ సెంట్రల్ యూనివర్సిటీ నిర్వహించడం జరిగింది. నాలుగవ వర్క్ షాప్ డిసెంబర్ 10 నుంచి 15 వరకు 2014 ఉట్నూర్ గిరిజన సమీకృత అభివృద్ధి సంస్థ సహకారంతోనూ, ఐదవ వర్క్ షాప్ మార్చ్ 12 నుంచి 16 వరకు 2015 భద్రాచలం గిరిజన సమీకృత అభివృద్ధి సంస్థ సహాయంతోనూ, ఆరవ వర్క్ షాప్ నవంబర్ 21 నుంచి 25 వరకు 2015 చంద్రపూర్ ఆదివాసి శిక్షణ సంస్థ సహాయంతోనూ, ఏడవ వర్క్ షాప్ జనవరి 9 నుంచి 14 వరకు కన్నడ యూనివర్సిటీ సహకారంతోనూ, ఎనిమిదవ వర్క్ షాప్ ఆగస్టు ఢిల్లీలో 2017 లో జరిగింది. భారత రాజ్యాంగం లోని ఎనిమిదో షెడ్యూల్ ప్రకారంగా కోయ (గొండి) భాష కు గుర్తింపు కోసం 2017, జులై 21 న కోర్ కమిటీ కోయ భాష దినోత్సవాన్ని ప్రకటించడం జరిగింది.
కోయ బాల సాహిత్యం
కోయ బాల సాహిత్యం అంటేనే వినడానికి చదవడానికి ఆశ్చర్యం కలగక మానదు. ఆదివాసి విద్యార్థులు చదువు అంటేనే ఇతర భాషలను నేర్చుకోవడం కష్టమైన పరిస్థితిలో బడి మానివేసే విద్యార్థుల సంఖ్య పెరుగుతున్న తరుణంలో సాహిత్యం మిడికోస్ వేసోడి, విప్పన్ కథ (పొడుపు కథలు ), కోయ భారతి పుస్తకాలు చదువులలో కొత్త ఒరవడిని తీసుకువచ్చాయి. దీనిలో సందేహం లేదు కానీ 2000 సంవత్సరం లోనే అల్లూరి జిల్లా చింతూరు మండలంలోని రామన్నపాలెం కోయత్తూర్ బాట ఆధ్వర్యంలో బాల సాహిత్యం పురుడు పూసుకుంది, కోయ భారతి ప్రారంభించారు. కోయ బాల సాహిత్యం లో పుస్తకాలలో నరక నరక ఉద్దాన్ నైక్, వాతినా, వార్రినా, దింగో, డొంగో, ఎడ్జ్, కుకూ, కూకు, పద్యాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రాథమిక పాఠశాలలో పిల్లలకు కోయ భాష వారి యొక్క సంస్కృతి సాంప్రదాయాలను, ఆచారాలు వ్యవహారాలను, ఆటపాటలను నైతిక విలువలను వారసత్వ కలలను కాపాడుతుంది అనడంలో సందేహం లేదు కోయ భాష ను రక్షించుకోవడంలో బాలసాహిత్యం ఒక ఆశాకరణం వంటిది.
కోయ భాషను భావితరాలకు సజీవంగా అందించాలంటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 29, 30, 350 ప్రకారంగా ఆదిమ తెగల జాతుల భాషా పరిరక్షణ కోసం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకమైన బడ్జెట్ను కేటాయించడంతో పాటు ప్రభుత్వాలు కోయ బాషా దినోత్సవం అధికారికంగా నిర్వహించినట్లయితే, అంతరించిపోతున్న భాషలు మనుగడ సాగించగలుగుతాయి. భూమి అడవి, నీళ్లు ఆదిమతెగలకు ఎంత ముఖ్యమో వాటితో పాటు భాష కూడా ఎంతో ముఖ్యమైనది. దీనిని పరిరక్షించుకోవడానికి భాషావేత్తలు, ప్రేమికులు, హక్కుల సంఘాలు, రాజకీయ పార్టీలు, మేధావులు అంతా కలిసి, ఏకత్వంలోని భిన్న త్వంలో కాపాడవలసిన గౌరవ వించవలసిన అవసరం చాలా ఉంది. ఆదివాసి సంఘాలు తమ భాష, సంస్కృతిని పై చిన్న చూపు వదిలి, పర భాషల, మతాల మోజులో పడి, అభివృద్ధి నాగరికత మాయలో పడిపోకుండా ఉండవలసిన అవసరం ఉంది ఆ దిశగా ఆలోచించాలి. మేథోమథనం జరగాలి.
వ్యాసకర్త
సోడె వీర సూర్య నారాయణ
మొబైల్.. 9642067386