అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దు
హైదరాబాద్ జూలై 20: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో గురువారం తెల్లవారుజాము నుంచి కుండపోత వర్షం కురుస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి జోనల్ కమిషనర్లు, అడిషనల్ కమిషనర్లు, ఇంజినీర్లు హాజరయ్యారు. వాటర్ లాగింగ్, చెట్లు విరిగిపోయాయని వస్తున్న ఫిర్యాదులు పరిష్కరించాలని అధికారులను జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశించారు. సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని రోనాల్డ్ రాస్ హెచ్చరించారు.శిథిలావస్థకు చేరిన భవనాల్లో ప్రజలు ఉండకూడదని జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ ఆదేశించారు.
అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని సూచించారు. హైదరాబాద్ నగరమంతా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో లింగంపల్లి నుంచి గచ్చిబౌలి వెళ్లేదారిలో రైల్వే బ్రిడ్జి కింద భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. దీనికి సంబంధించి అర్ధరాత్రి డీఆర్‌ఎఫ్ టీమ్స్‌కు 50 ఫిర్యాదులు అందాయి. వర్షపు నీటికి పురాతన భవనాలు చాలావరకు తడిసిపోయాయి.మియాపూర్‌లో 7.38 సెం.మీ., టోలీచౌకి 6.65 సెం.మీ., హైదర్‌నగర్ 5.68 సెం.మీ., మాదాపూర్ 5 సెం.మీ., కేపీహెచ్‌బీ 4.95 సెం.మీ., మూసాపేట 4.73 సెం.మీ., జూబ్లీహిల్స్ 4.65 సెం.మీ. వర్షపాతం నమోదైంది.