A place where you need to follow for what happening in world cup

జిల్లాకో మెడికల్‌ ‌కాలేజీ….కెసిఆర్‌ ‌కల సాకారం

రాష్ట్రంలో మరో 4 మెడికల్‌ ‌కాలేజీలకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు లభించడం సంతోషించదగ్గ విషయమని బీఆర్‌ఎస్‌ ‌సీనియర్‌ ‌నేత,  మాజీ మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. యాదాద్రి, మెదక్‌, ‌మహేశ్వరం, కుత్బుల్లాపూర్‌ ‌సహా గత నెలలో మెడికల్‌ ‌కాలేజీల అనుమతి పొందిన ములుగు, నర్సంపేట, గద్వాల్‌, ‌నారాయణపేట్‌ ‌ప్రాంత ప్రజలకు ఈ సందర్భంగా హరీష్‌ ‌రావు శుభాకాంక్షలు తెలిపారు. తాజా అనుమతులతో ప్రతి జిల్లాకు ఒక మెడికల్‌ ‌కాలేజి ఏర్పాటు చేయాలన్న కేసీఆర్‌ ‌కల సాకారమైందని హర్షం వ్యక్తం చేశారు. ఇది తెలంగాణ రాష్ట్రం వైద్యారోగ్య రంగంలో విప్లవాత్మకమైన పురోగతి అని అన్నారు. అరవై ఏళ్లలో సాధ్యం కాని అద్భుతాలను దశాబ్ద కాలంలోనే తమ ప్రభుత్వం ఆవిష్కరించిందని పేర్కొన్నారు. తెలంగాణ పిల్లలు వైద్య విద్య కోసమని లక్షలు ఖర్చు చేసి..చైనా, ఉక్రెయిన్‌, ‌రష్యా, ఫిలిప్పీన్‌ ‌వంటి దేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదని హరీష్‌ ‌రావు తెలిపారు. విద్యార్థులు మాతృ భూమికి, తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ అవస్థలు పడాల్సిన అవసరం లేదన్నారు. ఒకవైపు ఎంబీబీఎస్‌ ‌చదవాలనే ఆశ, మరోవైపు అర్థం కాని భాష, దేశం కాని దేశంలో గోస పడడమన్నది ఒకనాడని, నేడు కొత్తగా వొచ్చిన మెడికల్‌ ‌కాలేజీలు, లోకల్‌ ‌రిజర్వేషన్‌ ‌వల్ల డాక్టర్‌ ‌చదువాలనుకునే తెలంగాణ విద్యార్థులకు అవకాశాలు పెరిగాయని హరీష్‌ ‌రావు అన్నారు. ప్రతి జిల్లాకు మెడికల్‌ ‌కాలేజీ ఉన్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ అవతరించి దేశంలోనే రికార్డు నెలకొల్పిందని తెలిపారు.

 

ఈ ఏడాదికి సంబంధించి మొత్తం 8 మెడికల్‌ ‌కాలేజీల ఏర్పాటు కోసం గత కేసీఆర్‌ ‌ప్రభుత్వం నిధులు, భూ కేటాయింపు, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన అనుమతులు మంజూరు చేసిందని పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్‌ ‌ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 8 కాలేజీలకు గాను కేవలం నాలుగు మెడికల్‌ ‌కాలేజీలకు మాత్రమే గత నెల ఎన్‌ఎం‌సీ నుంచి అనుమతులు లభించాయని చెప్పారు. నిబంధనల ప్రకారం మౌలిక వసతుల ఏర్పాటు, బోధనా సిబ్బంది నియామకంలో ప్రభుత్వం విఫలమైందని, అందుకే ఎన్‌ఎం‌సీ అనుమతులు నిరాకరించిందని హరీష్‌ ‌రావు తెలిపారు. జరిగిన తప్పును ఆలస్యంగా గుర్తించిన కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం, ఎన్‌ఎం‌సీ నిబంధనల మేరకు అన్ని మౌలిక వసతులు, బోధన సిబ్బందిని సమకూర్చుకుంటామని అనుమతి కోరుతూ కేంద్రానికి అప్పీల్‌ ‌చేసిందన్నారు. దీన్ని పరిశీలించిన కేంద్రం అప్పీల్‌ అం‌గీకరించి, 4 మెడికల్‌ ‌కాలేజీలకు అనుమతులు ఇవ్వాలని ఎన్‌ఎం‌సీకి మార్గనిర్దేశ చేసిందని తెలిపారు. దీంతో ఒక్కో కాలేజీలో 50 ఎంబీబీఎస్‌ ‌సీట్ల చొప్పున, మొత్తం నాలుగు కాలేజీల్లో 200 సీట్లు ఈ అకడమిక్‌ ఇయర్‌కు అందుబాటులోకి రానున్నాయన్నారు. కొత్త సీట్లతో కలుపుకొని తెలంగాణలోని ప్రభుత్వ మెడికల్‌ ‌కాలేజీల్లోనే మొత్తం సీట్ల సంఖ్య 4,090 కు చేరుకుందన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు రాష్ట్రంలో కేవలం 850 ప్రభుత్వ మెడికల్‌ ‌సీట్లు మాత్రమే ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 4,090 సీట్లకు చేరిందని హరీష్‌ ‌రావు తెలిపారు. అంటే తొమ్మిదేళ్ల కాలంలో తమ గత ప్రభుత్వం మెడికల్‌ ‌సీట్లను 5 రెట్లు పెంచిందన్నారు.

 

ప్రభుత్వ, ప్రైవేటు కలిపి ఏటా పదివేల మందికి పైగా డాక్టర్లను తయారుచేసే రాష్ట్రంగా తెలంగాణ ఎదిగిందని చెప్పారు. ఎంబిబిఎస్‌ ‌సీట్లలో లక్ష జనాభాకు 22 సీట్లతో దేశంలోనే మొదటి స్థానంలో నిలవడం మనందరికీ గర్వకారణమని అన్నారు. సమైక్య రాష్ట్రంలో వైద్యం, వైద్య విద్యలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని గుర్తించిన కేసీఆర్‌ ‌జిల్లాకు ఒక మెడికల్‌ ‌కాలేజీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారని, తద్వారా పేద ప్రజల చెంతకే సూపర్‌ ‌స్పెషాలిటీ వైద్యాన్ని చేరువ చేయడంతో పాటు, తెలంగాణ బిడ్డలు వైద్య విద్య చదివే అవకాశాలను గణనీయంగా పెంచారన్నారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా 157 మెడికల్‌ ‌కాలేజీలను మంజూరు చేస్తే, తెలంగాణకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒక్కటి కూడా ఇవ్వలేదని తెలిపారు. అయినప్పటికీ రాష్ట్రం సొంత నిధులతోనే కొత్తగా మొత్తం 29 ప్రభుత్వ మెడికల్‌ ‌కాలేజీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారని అన్నారు. అందుకు అనుగుణంగా వేగవంతమైన చర్యలు తీసుకున్నారని హరీష్‌ ‌రావు చెప్పారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు 70 ఏండ్లలో రెండు ప్రభుత్వ మెడికల్‌ ‌కాలేజీల ఏర్పాటు జరిగితే, స్వరాష్ట్రంలో 9 ఏండ్లలో 29 మెడికల్‌ ‌కాలేజీలు ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే సరికొత్త రికార్డు సృష్టించిందని హరీష్‌ ‌రావు గుర్తుచేశారు. ఇది కేసీఆర్‌ ‌ఘనత, బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం ఘనత అని కొనియాడారు.

 

వైట్‌ ‌రెవల్యూషన్‌, ‌గ్రీన్‌ ‌రెవల్యూషన్‌, ‌పింక్‌ ‌రెవల్యూషన్‌, ‌బ్లూ రెవల్యూషన్లకు తెలంగాణ నిలయంగా మారిందన్నారు. జిల్లాకు ఒక మెడికల్‌ ‌కాలేజీ ఏర్పాటుతో వైట్‌ ‌కోట్‌ ‌రెవల్యూషన్‌కు నాంది పలికిందని తెలిపారు. ఇక్కడ ఎంబీబీఎస్‌ ‌చదివిన వారు రాష్ట్ర ప్రజలకే కాదు..వివిధ దేశాల్లో  సేవలందించబోతున్నారని హరీష్‌ ‌రావు తెలిపారు. తద్వారా తెలంగాణ ఖ్యాతిని దశదిశలా వ్యాపింపజేయబోతున్నారని అన్నారు. సీఎం కేసీఆర్‌ ‌పాలనలో తెలంగాణ వైద్య విద్యకు కేరాఫ్‌ అ‌డ్రస్‌గా, వైద్య విద్య హబ్‌గా ఎదిగిందని చెప్పేందుకు గర్వ పడుతున్నానని పేర్కొన్నారు. పెరిగిన మెడికల్‌ ‌సీట్లను రాష్ట్ర విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. డాక్టర్‌ ‌కావాలనే కలను సాకారం చేసుకోవాలని కోరారు. మెడికల్‌ ‌కాలేజీల నిర్వహణపై ప్రభుత్వం దృష్టి సారించాలని, మౌలిక వసతులు, బోధన సిబ్బంది కొరత లేకుండా చూస్తూ ప్రతి ఏటా ఎన్‌ఎం‌సీ అనుమతులు(రెన్యువల్‌) ‌కొనసాగేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తద్వారా వైద్య విద్యార్థులకు నష్టం కలగకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Leave A Reply

Your email address will not be published.