వందేండ్ల చరిత్ర కలిగి, దశాబ్థాల పాటు జంట నగరాల దాహార్తి తీర్చిన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాల మనుగడ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. జంట జలాశయాల్ని కాపాడాలంటూ పర్యావరణ వాదులు వేస్తున్న పిటిషన్లు ఒకవైపు, 111 జీవోను రద్దు చేయాలని వస్తున్న ఒత్తిడులు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతున్నాయి.
నగరీకరణ విసురుతున్న పెను సవాళ్ళ మధ్య చట్ట పరిధిలో ఈ సమస్యను పరిష్కరించే దిశగా ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేక పోతున్నది. జంట జలాశయాల పరిధిలో అనాదిగా నివసిస్తున్న స్థానికుల డిమాండ్లను పరిష్కరించడం, బయటి నుంచి వస్తున్న రియల్ ఎస్టేట్ మాఫియాను కట్టడి చేయడం ప్రభుత్వానికి ఇప్పుడు పెను సవాలుగా పరిణమించింది. 111 జీవోపై ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ నివేదిక ఇవ్వడంలో జరుగుతున్న జాప్యంపై రాష్ట్ర హైకోర్టు ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేసింది.
మరో 50 ఏండ్ల పాటు జంట నగరాలకు తాగు నీటి అవసరాలు తీర్చడానికి ప్రధాన నదుల నుంచి నీరు తరలించే ప్రణాళికలు రూపొందించామని హై కోర్టుకు ప్రభుత్వం తెలిపింది. దీనితో జంట జలాశయాలపై ప్రభుత్వానికి శ్రద్థ లేదని పర్యావరణ వాదులు అంటున్నారు. కృష్ణా, గోదావరి నదులతో జంట జలాశయాలను నింపడం ద్వారా వీటిని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తేవాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు.